నెల్లూరు(క్రైమ్): ప్రేమించిన వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాజీనగర్ మసీదు సెంటర్‌లో ఎం.దేవి కుటుంబం నివాసముంటోంది. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె శ్రావణి (18) నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఈ క్రమంలో ఆమెకు నెల్లూరు నవాబుపేటకు చెందిన ప్రసాద్‌తో పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇంటర్మీడియట్ పూర్తయిన అనంతరం ఆమె చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది.
ఇటీవల శ్రావణి తన ప్రేమ వ్యవహారాన్ని తల్లి దేవికి తెలియజేసింది. అతనితోనే తన వివాహం చేయమని తల్లిని కోరింది. దీంతో ఆమె ప్రసాద్, అతని తల్లికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు ప్రసాద్, అతని తల్లి నిరాకరించారు. దీంతో మనస్థాపం చెందిన శ్రావణి శుక్రవారం అర్ధరాత్రి తన ఇంట్లోని వంట గది ఫ్యాన్ కోసం ఏర్పాటు చేసిన కొక్కేనికి చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన దేవి కుమార్తెను కిందకు దించి హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు.
శ్రావణిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో దేవి కుప్పకూలిపోయింది. కుమార్తె ఆత్మహత్య విషయమై దేవి శనివారం బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులుపోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై బి. రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment