
సాక్షి, బల్లికురవ : పిడుగుపాటును ముందే కనిపెట్టి హెచ్చరిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో పిడుగుపాటు మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొప్పరపాలెంలో ఆదివారం పిడుగుపాటుకు రాజు(24) అనే యువకుడు దుర్మణం చెందాడు.
గొర్రెలు కాసేందుకు వెళ్లిన రాజుపై పిడుగు పడటంతో అక్కడిక్కడే కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి మోసుకెళ్లగా తీసుకెళ్లగా, అప్పటికే రాజు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యుడు గుర్తించారు. పిడుగు ధాటికి మృతుడి శరీరం పూర్తిగా కమిలిపోయి గుర్తుపట్టనిస్థితికి చేరింది. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం భయంకరంగా మారిందని, చుట్టుపక్కల కనీసం 8 పిడుగులు పడిఉంటాయని గ్రామస్తులు తెలిపారు.
అందని ‘ఆధునిక’ సాయం : గడిచిన వారం రోజులుగా కర్నూలు, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పిడుగుపాటు మరణాలు సంభవించాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పిడుగుపాటును ముందే గుర్తించి, ప్రాణనష్టాన్ని నివారిస్తామని ఇటీవల చంద్రబాబు సర్కారు ప్రకటించినప్పటికీ, ఆచరణలో మాత్రం ప్రజలకు ‘ఆధునిక సాయం’ అందడం లేదు. ఇస్రో సాయంతో పిడుగు ఏ ప్రాంతంలో పడనుందో 40 నిమిషాల ముందే ప్రజలను హెచ్చరించేందుకు ‘వజ్రపథ్’ అనే యాప్‌ను రూపొందించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పిడుగు హెచ్చరికలు జారీచేస్తోన్న ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ.. వాటిని అనుసరించి ప్రజలు ఏం చేయాలన్నదానిపై మాత్రం దృష్టిసారించలేదు. అత్యవసర పనుల నిమిత్తం పొలాలకు వెళ్లిన రైతులకు పిడుగుపాటు హెచ్చరిక జారీ అయిందన్న సమాచారం తెలియడంలేదు.