జగన్ యాత్రలో రాజకీయ దురుద్దేశం లేదు | YS Jagan Bus Yatra Political, does not have | Sakshi
Sakshi News home page

జగన్ యాత్రలో రాజకీయ దురుద్దేశం లేదు

Published Fri, Apr 17 2015 3:00 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YS Jagan Bus Yatra Political, does not have

 ప్రధాన ప్రతిపక్షంగా స్పందించాల్సింది మేమే
 రైతుల కోసం భవిష్యత్‌లో కూడా పోరాటాలు
 చర్చకు సిద్ధమని తొలి సవాల్ మేమే విసిరాం
 వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు
 
 ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో బుధవారం నుంచి చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన బస్సుయాత్ర రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నది కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. గురువారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీలు మాత్రమే ఉన్నాయని, ఆ రెండు మిత్రపక్షాలు కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ.. ప్రజలకు ఎదురయ్యే ఏ చిన్న సమస్యపైనైనా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
 
 ఈ మేరకు ప్రజల పక్షాన తమ పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తోందని గుర్తుచేశారు. తమ నాయకుడు జగన్ రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగుల కోసం ప్రశ్నలు సంధిస్తూ పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలకు పోవడం లేదని, ప్రతిపక్షాలు తమ నేతపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నా ఆయన హుందాగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రైతుల కోసం భవిష్యత్తులో కూడా పోరాటాలు చేస్తామన్నారు.
 
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఆ పనులు చేపట్టాలన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే ఉభయగోదావరి జిల్లాలకు నష్టాన్ని చేకూర్చే ఈ ప్రాజెక్టు లిఫ్టు పైపులను 16 మీటర్ల ఎత్తున నిర్మించుకుంటే తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు జీవోలో పరిశ్రమల కోసమేనని చెప్పగా ప్రజల నుంచి వ్యక్తమైన ఆందోళనలతో ఈ నీటిని రాయలసీమకు తరలించడం కోసమని మాట మార్చారని ఎద్దేవా చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా ఎడారిగా మారిపోతుందని ఇంజినీర్లు స్పష్టం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
 
 ల్యాండ్‌మైన్ అంత ప్రమాదకరమైన ప్రాజెక్టు అయినందునే పట్టిసీమను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారని ఒక విలేకరి కొత్తపల్లి దృష్టికి తీసుకురాగా ఈ సవాల్‌ను తొలిసారిగా విసిరింది మేమేనని ఆయన స్పష్టం చేశారు. జగన్ నిర్వహించిన బస్సుయాత్ర, రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా రైతాంగానికి, ప్రజల్లో జగన్ యాత్రపై చైతన్యం కలిగించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలియచేశారు. పార్టీ మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, జిల్లా క్రమశిక్షణ సంఘం సభ్యులు పటగర్ల రామ్మోహనరావు, జిల్లా కోశాధికారి దిరిశాల వరప్రసాదరావు, నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నగర కన్వీనర్ మున్నుల జాన్‌గురునాధ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement