టీడీపీ సర్కారు నయవంచన పాలనపై సమరభేరి మోగించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో
సాక్షి ప్రతినిధి, ఏలూరు : టీడీపీ సర్కారు నయవంచన పాలనపై సమరభేరి మోగించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో తణుకులో తలపెట్టిన చరిత్రాత్మక దీక్షకు పార్టీ నేతలు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్న పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరానున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది నెలల ప్రజాకంటక పాలనపై విసుగెత్తి ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఎవరికి వారే దీక్షకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. పార్టీ జిల్లా సారధి ఆళ్ల నాని ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి నేతలను, కార్యకర్తలను సమాయత్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కొన్నిరోజులుగా జిల్లాలోనే మకాం వేసి పార్టీ నేతలను సమన్వయ పరుస్తూ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా, పార్టీ అధిష్టానం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు పర్యవేక్షకులను నియమించింది. ఈ మేరకు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధా, పార్టీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు పేర్ని నాని, కొయ్య ప్రసాదరెడ్డిలు మంగళవారం జిల్లాకు రానున్నారు.