బస్సు యాత్రకు బ్రహ్మరథం | YS Jagan in Vijayawada bus trip | Sakshi
Sakshi News home page

బస్సు యాత్రకు బ్రహ్మరథం

Published Fri, Apr 17 2015 4:25 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

బస్సు యాత్రకు బ్రహ్మరథం - Sakshi

బస్సు యాత్రకు బ్రహ్మరథం

విజయవాడలో వైఎస్ జగన్ బస్సు యాత్ర
ప్రకాశం బ్యారేజీ పరిశీలన
ప్రాజెక్ట్ సందర్శనలో పాల్గొన్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు
రాష్ట్ర అతిథి గృహంలో జగన్‌ను కలిసిన నేతలు
జగన్ దృష్టికి సీతారామ కల్యాణమండపం వివాదం

 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్రకు విజయవాడలో అపూర్వ స్వాగతం లభించింది. నగరంలోని రాష్ట్ర అతిథిగృహం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అడుగడుగునా ప్రజలు, పార్టీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి జననేత జగన్‌మోహన్‌రెడ్డికి అభివాదం చేశారు. అందరినీ ఆప్యాయంగా బస్సులో నుంచే పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు బస్సు యాత్రకు ముందు బైక్ ర్యాలీ నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ ప్రసంగించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన బస్సు యాత్ర గుంటూరు మీదుగా ప్రకాశం జిల్లాకు చేరింది.
 
సాక్షి, విజయవాడ : బస్సు యాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నగరానికి బుధవారం రాత్రి చేరుకుని స్థానిక స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. ఆయనతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నగరానికి వచ్చారు. గురువారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు జగన్‌మోహన్‌రెడ్డిని అతిథిగృహంలో కలిశారు. పలు ప్రజా సంఘాలు, మహిళలు, వివిధ సంఘాల నేతలు ఆయన్ని కలిసి తమ సమస్యలను విన్నవించారు. తొలుత పార్టీ ముఖ్యులతో జగన్‌మోహన్‌రెడ్డి కొంతసేపు సమావేశమయ్యారు.

అనంతరం ఆయన్ని బ్రాహ్మణ సంఘ నేతలు కలిశారు. సత్యనారాయణపురంలోని సీతారామ కల్యాణమండపం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒంటెత్తు పోకడ అనుసరిస్తూ మండపాన్ని స్వాధీనం చేసుకుందని, తమ పక్షాన పోరాడాలని కోరారు. దీనికి స్పందించిన వైఎస్ జగన్ మీ పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి స్థానిక నేతలు మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. పలువురు నిరుపేద మహిళలు తమకు ఇళ్లు లేవని, పింఛన్లు రావటం లేదని తదితర సమస్యలు వివరించి ఆయన వినతిపత్రం అందజేశారు.

దీనికి ఆయన స్పందిస్తూ.. మీకు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి రాధాకృష్ణ అండగా ఉండి మీ తరఫున ప్రభుత్వంపై పోరాటం చేసి సమస్యలను పరిష్కరిస్తారని మహిళలకు సూచించారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి బందరురోడ్డు మీదుగా వంగవీటి రాధాకృష్ణ నివాసానికి చేరింది. అక్కడ తన కోసం వేచి ఉన్న పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్ అభివాదం చేశారు. అక్కడి నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్, ఫ్లైవోవర్ మీదుగా ప్రకాశం బ్యారేజీ సెంటర్‌కు చేరింది. ఈ సందర్భంగా అక్కడ వేలాది మంది జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో అందరికీ అభివాదం చేస్తూ అందరినీ పలకరిస్తూ ఆయన ఎమ్మెల్యేల బృందంతో  ప్రకాశం బ్యారేజీకి చేరుకున్నారు.

బ్యారేజీ పరిశీలన...
వైఎస్ జగన్ ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి బ్యారేజీ చరిత్రను ఆయనకు వివరించారు. బ్యారేజీ ఎప్పుడు నిర్మించారు, ఎంత నీటిని ఇక్కడ నిల్వ చేసే సామర్థ్యం ఉంది, ఎంత నీరు ఏటా సముద్రంలో కలుస్తుంది, దీని పరిధిలో ఎంత ఆయకట్టు ఉంది తదితర అంశాలు తెలిపారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి బ్యారేజీ నిర్మాణాన్ని పరిశీలించారు. అక్కడ రైతులనుద్దేశించి మాట్లాడారు. అనంతరం వారధి మీదుగా గుంటూరు జిల్లా వైపు జగన్‌మోహన్‌రెడ్డి బస్సుయాత్ర సాగింది.

పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, గిడ్డి ఈశ్వరి, రవీంద్రనాధ్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, మహ్మద్ ముస్తాఫా, కోన రఘుపతి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చీర్ల జక్కిరెడ్డి, వరుపుల సుబ్బారావు, నారాయణ స్వామి, గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు, కృష్ణాజిల్లా నేతల హాజరు...
కొలుసు పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ, పూనూరి గౌతంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, పేర్ని నాని, పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, మొండితోక జగన్మోహనరావు, మొండితోక అరుణ్ కుమార్, పుప్పాల రాంప్రసాద్, సామినేని ఉదయభాను, దూలం నాగేశ్వరరావు, కాజా రాజ్‌కుమార్, పార్టీ నగర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నేతలు మర్రి రాజశేఖర్, మోపిదేవి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్, ఆతుకూరి ఆంజనేయులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement