హిందీలో మాట్లాడి అందర్ని ఆకట్టుకున్న వైఎస్ జగన్!
హైదరాబాద్: రాజకీయాల్లో విశ్వసనీయత లోపించిందని, రాజకీయాల్లో మార్పు అవసరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బీఎస్ మక్తాలో హిందీలో వైఎస్ జగన్ ప్రసంగించారు.
హిందీలో మాట్లాడి వైఎస్ జగన్ అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటలను నేతలు విస్మరిస్తున్నారని, ఎన్నికల ముందు ఒకలా..తర్వాత మరోలా చెబుతున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్వచ్చమైన పాలన కోసం పోటీ చేస్తున్న విజయారెడ్డిని గెలిపించాలని ఓటర్లకు వైఎస్ జగన్ సూచించారు. తెలంగాణలో నేడు కాకున్నా మరో రోజు అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లు అధికారం ఇచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయలేదన్నారు.
చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయతకు అర్థం తీసుకురావాలని, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించుకుందామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.