జగన్ సీఎంలా.. బాబు విపక్షనేతలా వ్యవహరించారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలా హుందాగా వ్యవహరిస్తే.. సీఎం చంద్రబాబు మాత్రం విపక్షనేతలా వ్యవహరించారని వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. రాజధాని ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని, తమపై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. రాయలసీమ తాగునీటి విషయంలో తాము అడ్డుపడుతున్నామంటూ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
గాలేరు-నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులపై చంద్రబాబు సర్కారు ఎందుకు దృష్టి సారించడంలేదని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కేవలం టీడీపీ నేతల కమిషన్ల కోసమే ప్రతిపాదిస్తున్నారని ఆరోపించారు. పట్టిసీమ ఎత్తిపోతల పూర్తయితో మన చేత్తో మనకళ్లు పొడుచుకున్నట్లే అవుతుందని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే ఆయనకు మంచిపేరు వస్తుందన్న దుర్బుద్ధితో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు.