
మేం ప్రశ్నిస్తే కేసులు... మీరు నేరం చేస్తే రాజీలా?
చట్టం తన పని తాను చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని రాజీలు, సెటిల్‌మెంట్లు, పంచాయితీలు చేయడం ధర్మమేనా!
⇔ చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్న
⇔ ముఖ్యమంత్రే రాజీలు, సెటిల్‌మెంట్లు చేయడమేమిటి?
⇔ తప్పు చేసినోళ్లని కాపాడటం ఏమిటి?
⇔ నేను నోరు తెరిస్తే బాగోతాలు బయటకొస్తాయంటే దానర్థం ఏమిటి!
⇔ ఐపీఎస్ అధికారికే క్షమాపణలా..?
⇔ కానిస్టేబుల్‌కు చెప్పరా... వారికి ఆత్మగౌరవం ఉండదా!
⇔ మాకో న్యాయం, వాళ్లకో న్యాయం అన్నందుకు చెవిరెడ్డిని అరెస్టు చేస్తారా?
సాక్షి, అమరావతి: చట్టం తన పని తాను చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని రాజీలు, సెటిల్‌మెంట్లు, పంచాయితీలు చేయడం ధర్మమేనా! అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించి తరలించడంపై అసెంబ్లీలో ప్రస్తావించేందుకు విఫలయత్నం చేసిన జగన్ స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో లాబీల్లోని తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘మావాళ్లు తిరుపతి ఎయిర్‌పోర్టులో అధికారులపై దౌర్జన్యం చేసినట్లు ఎక్కడా లేక పోయినా మా ఎంపీని, ఎమ్మెల్యేను 25 రోజులు జైల్లో పెట్టారు.
అదే టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విజయవాడలో ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌పై దురుసుగా మాట్లాడినా... ఆయన గన్‌మెన్ అయిన కానిస్టేబుల్‌ను దౌర్జన్యంగా తోసి వేసినా అరెస్టు చేయరు. గన్‌మెన్‌పై ఎమ్మెల్యే చెయ్యేసి గట్టిగా తోసినట్లు స్పష్టంగా టీవీల్లో కనిపిస్తున్నా...చంద్రబాబు వారిని పిలిచి రాజీ చేస్తారు... ఇదే విషయాన్ని మాకో న్యాయం... తన వారికో న్యాయమా! అని చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించినందుకు అరెస్టు చేసి తీసుకెళతారా... మా ఎమ్మెల్యేను ఉదయం అరెస్టు చేసి సాయంత్రం వరకూ విడుదల చేయలేదు. మా సహచర ఎమ్మెల్యేలు వెళ్లినా కూడా పోలీస్‌స్టేషన్‌లో చెవిరెడ్డితో మాట్లాడ్డానికి గాని, కనీసం చూడ్డానికి గాని అనుమతించలేదు. ఇదెక్కడి న్యాయం?’’ అని జగన్ ప్రశ్నించారు. వివరాలు ఆయన మాటల్లోనే....
సీఎం ఆదేశించినందుకే సారీ చెప్పారట...
ముఖ్యమంత్రి తమను ఆదేశించినందుకే సారీ చెప్పామని టీడీపీ నేతలంటున్నారు. ఐపీఎస్‌కు సారీ చెప్పారు సరే... మరి కానిస్టేబుల్ మాటేమిటి? ఆయనకు సారీ చెప్పరా... సాధారణ పోలీసు కానిస్టేబుల్‌కు ఆత్మగౌరవం ఉండదా? ముఖ్యమంత్రి చెబితేనే సారీ చెప్పామంటున్న వారికి కానిస్టేబుల్‌కు క్షమాపణలు చెప్పమని చంద్రబాబు ఆదేశించలేదా? నేను నోరు తెరిస్తే చాలా బాగోతాలు బయటకు వస్తాయని సదరు ఐపీఎస్ అధికారి అన్నారంటే...దానర్థం ఏంటి? మీరు (అధికారపక్షం) చేసిన అన్యాయాలు చెప్పకనే చెప్పినట్లు కాదా? టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లింది ప్రజల కోసమో, వారి మంచికోసమో కానే కాదు, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం. తమకు పోటీగా బస్సులను నడుపుతున్న మరో ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇప్పించేలా, తమకు అనుకూలంగా వ్యవహరించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు వెళ్లారు. దీన్ని సాక్షాత్తూ ఆ అధికారే ధృవీకరించారు.
అధికార యంత్రాంగాన్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసే విధంగా చంద్రబాబు జోక్యం చేసుకుని రాజీ చేయించడం సబబేనా? గతంలో ఎమ్మార్వో వనజాక్షి ఉదంతంలో కూడా ముఖ్యమంత్రి ఇలాగే చేశారు. ఆమెను జుట్టు పట్టుకుని దౌర్జన్యం చేసిన టీడీపీ ఎమ్మెల్యేను మంచివాడంటూ మంత్రివర్గంలో చంద్రబాబు పొగిడి కేసుల్లేకుండా చేశారు. టీడీపీ నేతలు అధికారులపై తిరగబడి దౌర్జన్యం చేసిన వ్యవహారాలన్నింటిలోనూ కేసులు లేకుండా చంద్రబాబు సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అధికారులను కొట్టించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఆ తరువాత రాజీలు చేయించడం సబబేనా?
ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలే!
ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు. ఆరెంజ్ కంపెనీ ఏందో నాకు తెలియనే తెలియదు. టీడీపీ ఎంపీ తమ సొంత వ్యవహారానికి సంబంధించి కమిషనర్ కార్యాలయానికి వెళ్లి గొడవ పడ్డారనేది అసలు విషయమైతే దానిని తప్పుదోవ పట్టించేందుకే జగన్ పేరును లాగుతున్నారు. ఆరెంజ్ కంపెనీతో నాకు సంబంధాలున్నాయని అవాస్తవాలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా... చివరకు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఏదైనా అన్నా దీని వెనుక జగనే ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. మసిపూసి మారేడు కాయ చేయడమే కాక నాపై బురద జల్లి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. టీడీపీ వారు చేసిందానికి సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి నాపై నిందలు వేస్తున్నారు.
పోలవరానికి రూ 3,000 కోట్లా!
పోలవరం ప్రాజెక్టుకు గత మూడేళ్లలో కేటాయించింది రూ. 3,000 కోట్లే... వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే రూ 5,500 కోట్లు ఈ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టారు. కానీ జాతీయ ప్రాజెక్టుగా దీనిని ప్రకటించిన తరువాత మూడేళ్లలో మూడు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు.
ఇక అలాంటి దానిపై ఇంకా ప్రెజెంటేషన్ ఏమిటి? ఇపుడు తాజాగా పోలవరం నుంచి బొల్లాపల్లి, అక్కడి నుంచి సోమశిలకు పెన్నా అనుసంధానం పేరుతో రూ . 1 లక్ష కోట్ల వ్యయంతో ప్రాజెక్టు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకే ఏడాదికి రూ .వెయ్యి కోట్లు మించి ఇవ్వని మహానుభావుడు (చంద్రబాబు) మళ్లీ రూ. 1 లక్ష కోట్లతో అనుసంధానం అని ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిదీ కుంభకోణమే కొనసాగుతోంది.
మేమెంత ప్రయత్నించినా సభలో మాట్లాడ్డానికి అవకాశం ఇవ్వడం లేదు. నేనెప్పుడూ అసెంబ్లీలో నా కోసం ఏదీ ప్రస్తావించలేదు. నేను మాట్లాడేదల్లా ప్రజల తరపునే... వారి సమస్యలపైనే .. నేను లేవనెత్తే అంశాలను వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, మాకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది. కానీ ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా చేయడం వల్ల ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు.
భాస్కర్‌రెడ్డి చేసిన తప్పేమిటి?
ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనల్లో తాము అధికారిపై దౌర్జన్యం చేసినట్లు ఎలాంటి దృశ్యపరమైన ఆధారాలు లేక పోయినా తననూ, ఎంపీని ఎందుకు అరెస్టు చేశారు? ఇపుడు కానిస్టేబుల్‌పై దౌర్జన్యం చేసినట్లు, అధికారులను దుర్భాషలాడినట్లు టీవీల్లో సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నా ఎందుకు వారిని అరెస్టు చేయరు? వారికో న్యాయం? మాకో న్యాయమా? అని ప్రశ్నించినందుకే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేశారు.
నందిగామ వద్ద బస్సు ప్రమాదం జరిగిన ఘటనలో పరామర్శ కోసం నేను వెళ్లింది ప్రజలకు సంబంధించిన సమస్యమీద. నేనక్కడకు వెళ్లి పోస్టుమార్టం చేశారా అని ప్రశ్నించినందుకు వైద్యాధికారి తడబడుతూ చేయలేదన్నారు. అలాంటపుడు తరలించేయడానికి కొన్ని మృతదేహాలను ఎలా ప్యాక్ చేసి పెట్టారని గట్టిగా అడిగాను. అక్కడ ఆయన చూపించిన కాగితాన్ని నేను తీసుకున్నాను. నేనే మాత్రం లాక్కోలేదు.
ఈ విషయం టీవీలు చూస్తే తెలుస్తుంది. కానీ నా మీద రివర్స్ కేసు పెట్టారు. నేను ఆసుపత్రిలోకి ఆరోజు వెళ్లినపుడు ఏం జరిగిందీ మీడియా మొత్తం కవర్ చేసింది. నేనెక్కడా ఎవరినీ టచ్ చేయలేదనేది టీవీలు చూస్తే తెలుస్తుంది. కానీ రవాణా శాఖ కమిషనర్ విషయంలో జరిగిన సంఘటనకు, ఆసుపత్రి సంఘటనకూ నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది.
మనస్సాక్షిని అమ్ముకుంటే ఎలా...
ప్రతిపక్షం గాని, మీడియా గాని అధికారపక్షానికి తమ మనస్సాక్షికి అమ్ముకుంటే ప్రజాస్వామ్యం అనేది నిలబడదు. ఈ అన్యాయాలను మీడియా కూడా ప్రశ్నించాలి. ఇలాంటి అన్యాయాలను కనుక మనం ప్రశ్నించక పోతే ఇక ప్రజల తరపున మాట్లాడ్డానికి ఎవరూ ముందుకు రారు. రేపు జర్నలిస్టులకు అన్యాయం జరిగినా ఎవరూ అడగడానికి ముందుకు రాలేరు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.