
సమరభేరి!
ఈ ధర్నాలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననుండటం జిల్లాకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.
ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసింది... ప్రభుత్వ మోసపూరిత విధానం బట్టబయలైంది... ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాభేరి మోగనుంది. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించనున్నారు. రుణమాఫీ అమలులో ప్రభు త్వ వైఖరి, హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో వైఫల్యానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం మహాధర్నాకు సర్వం సిద్ధమైంది.
⇒ ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యక్ష కార్యాచరణ
⇒ నేడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా
⇒ సమాయత్తమవుతున్న వైఎస్సార్‌కాంగ్రెస్ శ్రేణులు
⇒ భారీగా తరలిరానున్న ప్రజలు
⇒ అధికార జులుంతో ధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వ కుట్ర
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చరిత్రాత్మక ప్రజాపోరాటానికి జిల్లా కలెక్టరేట్ వేదికగా నిలవనుంది. కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించే ఈ ధర్నాలో పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననుండటం జిల్లాకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. దాంతో ఈ ధర్నాను విజయవంతం చేయడానికి జిల్లా యావత్తూ కదలివస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు కొన్ని రోజులుగా సన్నాహాలను ముమ్మరం చేశారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడ గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజులతోపాటు నియోజకవర్గ సమన్వయకర్తలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ధర్నా విజయవంతం చేయాల్సిన ఆవశ్యతకను కార్యకర్తలను వివరించారు. రైతులు, మహిళలు, తుపాను బాధితులు, అని వర్గాల ప్రజలు వారికి సంఘీభావం ప్రకటించారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్‌కృష్ణరంగారావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం జిల్లావ్యాప్తంగా పర్యటించి పార్టీ శ్రేణులను సమాయత్తపరిచారు. దాంతో శుక్రవారం ధర్నాకు జిల్లావ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చేందుకు సంసిద్ధమయ్యారు.
పోలీసుబలంతో అధికార జులుం: వెల్లువెత్తుతున్న సానుకూలత ప్రభుత్వంలో కలవరం కలిగిస్తోంది. అందుకే పోలీసు బలాన్ని ప్రయోగిస్తోంది. 2వేలమంది పోలీసులను మోహరించడం గమనార్హం. ధర్నాకు వచ్చే వాహనాలను అడ్డుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే పోలీసులు విశాఖలోనూ గ్రామాల్లోనూ పోలీసులు ప్రైవేటు వాహన యజమానులను బెదిరిస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏదో ఒక సాకుతో నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీ సుకోవాలని కుట్ర పన్నుతోంది. మరోవైపు ధర్నాలకు అనుమతిలేదం టూ పోలీసులు గురువారం రాత్రి హడావుడిగా ఓ ప్రకటన విడుదల చేయ డం సందేహాలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గే పోలీ సులు ఈ ప్రకటన విడుదల చేశారని తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ధర్నా ను అడ్డుకోవడానికి టీడీపీ నేతలు కూడా కుట్రలు పన్నుతున్నారు.
శాంతియుతంగా ధర్నా...: వైఎస్సార్ కాంగ్రెస్
శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా శుక్రవారం ధర్నా నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆద్యంతం పార్టీ కార్యకర్తలు శాంతియుతంగానేవ్యవహరిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించారు.
వై.ఎస్.జగన్ పర్యటన ఇలా...
జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించిన వివరాల ప్రకారం... జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 8గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌కు వస్తారు. అక్కడ కొంతసేపు ఉన్న తరువాత ఉదయం 10గంటలకు ధర్నా నిర్వహించే కలెక్టరేట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంటవరకు ధర్నా నిర్వహిస్తారు. అనంతరం వై.ఎస్.జగన్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. పార్టీ నేతలతో కొంతసేపు సమావేశమయ్యాక సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ వెళతారు.