అత్యంత శక్తిమంతుల జాబితాలో జగన్
-
దేశంలో 100 మంది అత్యంత శక్తిమంతుల
-
జాబితా రూపొందించిన ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’
-
మన రాష్ట్రం నుంచి జగన్, కేసీఆర్‌లకే చోటు
-
21వ స్థానంలో జగన్.. 2013లో 36వ స్థానం
-
66వ స్థానంలో నిలిచిన కేసీఆర్
-
4 నుంచి 57వ స్థానానికి పడిపోయిన ప్రధాని
-
తొలిస్థానంలో మోడీ, తర్వాత రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత శక్తిమంతులైన భారతీయుల జాబితాలో మన రాష్ట్రం నుంచి ఇద్దరికి చోటు లభించింది. ప్రముఖ దినపత్రిక ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రూపొందించిన ఈ జాబితాలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 21వ స్థానంలో నిలిచారు. 2013లో 36వ స్థానంలో నిలిచిన జగన్..
ఈ ఏడాది 21వ స్థానానికి ఎగబాకారు. తొలిస్థానంలో నరేంద్ర మోడీ, రెండోస్థానంలో రాహుల్ గాంధీ, మూడో స్థానంలో సోనియా గాంధీ, నాలుగో స్థానంలో కేజ్రీవాల్, ఐదో స్థానంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆరో స్థానంలో జయలలిత(తమిళనాడు సీఎం), ఏడో స్థానంలో మమతా బెనర్జీ(బెంగాల్ సీఎం), ఎనిమిదో స్థానంలో మాయావతి(బీఎస్పీ), తొమ్మిదో స్థానంలో చీఫ్ జస్టిస్ పి.సదాశివం, పదో స్థానంలో మోహన్ భగవత్(ఆర్‌ఎస్‌ఎస్), 11వ స్థానంలో రాజ్‌నాథ్ సింగ్(బీజేపీ), 12వ స్థానంలో శరద్ యాదవ్(జేడీయూ), 13వ స్థానంలో సుష్మా స్వరాజ్(బీజేపీ) నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో అరుణ్ జైట్లీ, ఎల్.కె.అద్వానీ, రఘురాం రాజన్, పి.చిదంబరం, అమిత్‌షా, ముఖేశ్ అంబానీ, నవీన్ పట్నాయక్, జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారు. ఈ జాబితాలో ప్రధాని మన్మో హన్‌సింగ్ 57వ స్థానంలో నిలిచారు. ఆయన గత ఏడాది ప్రకటించిన జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ స్వీప్..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ స్వీప్ చేయనున్నారని, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ల కంటే మెరుగైన ఫలితాలు సాధించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నారని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారని పేర్కొంది. ఇక రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ జాబితాలో 66వ స్థానం దక్కించుకున్నారు. గతేడాది జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన ఈసారి తెలంగాణలో కింగ్ లేదా కింగ్‌మేకర్ అవుతారని ఆ దినపత్రిక పేర్కొంది.