
'వైఎస్ జగన్ తన బాధ్యత నెరవేర్చారు'
ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
హైదరాబాద్: ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షమే ప్రశ్నిస్తుందని చెప్పారు. వైఎస్ జగన్ తన బాధ్యతను నెరవేర్చారని అన్నారు. బడ్జెట్‌లో ఉన్న తప్పులు, లోపాలను ఎత్తిచూపడాన్ని మీరు అంగీకరించలేరా అని సూటిగా ప్రశ్నించారు.
వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు బడ్జెట్‌పై స్పష్టత ఇవ్వాలి కాని ఇలా మాట్లాడకూడదని సూచించారు. ప్రతిపక్షనేతను అవమానించడం చంద్రబాబుకు తగదని హితవు చెప్పారు. మీ తప్పులను ప్రశ్నించడానికి మాకు అనుభవం కావాలా అని నిలదీశారు. చంద్రబాబు తన పద్దతులు, వైఖరి మార్చుకోవాలని ధర్మాన ప్రసాదరావు సలహాయిచ్చారు.