- 8వ రోజూ సమైక్య, ఓదార్పుయాత్రకు అపూర్వ స్పందన
- ఎస్.ఎస్.పురంలో ఓదార్పులో పాల్గొన్న వై.ఎస్.జగన్
- ఆరు గ్రామాల్లో మహానేత విగ్రహాల ఆవిష్కరణ
- {పభుత్వం వచ్చిన వెంటనే పావలా వడ్డీ విడుదల
- టీపీ కోట మహబూబ్ సుభానీ దర్గాలో ప్రార్థనలు
- ఓబులరాజుకండ్రిగలో జగన్‌కు ఘన స్వాగతం
జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా అఖండ స్వాగతం లభించింది. మారుమూల పల్లెల్లో కూడా జనం ఆయనను చూడడానికి బారులుతీరారు. నాలుగు నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధాప్య పింఛన్ మొత్తాన్ని పెంచుతామని జననేత ప్రజలకు హామీ ఇచ్చారు. జిల్లాలో నిర్వహిస్తున్న నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రకు ఎనిమిదో రోజు సోమవారమూ విశేష స్పందన లభించింది. సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించారు.
సత్యవేడు, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎనిమిదో రోజు సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర నాగలాపురం మండలంలోని రాజులకండ్రిగ నుంచి ప్రారంభమైంది. మధ్యలో వడ్డిపాళెంలో మహిళలను, గ్రామస్తులను పలకరిస్తూ రోడ్‌షో నిర్వహిస్తూ ముందుకు సాగారు. ఈ గ్రామంలోనే రెండు చోట్ల ప్రజలు జగన్‌ను ఆపి స్వాగతం పలికారు. వడ్డిపాళెం మీదుగా రోడ్ షోగా బయల్దేరి ఓదార్పులో పాల్గొనేందుకు ఎస్.ఎస్.పురం చేరుకున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.
ఈ గ్రామంలో మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి అకాలమరణాన్ని తట్టుకోలేక ఆయన అభిమాని బాలపల్లి సుబ్బమ్మ మృతిచెందింది. బాధిత కుటుం బాన్ని జగన్ ఓదార్చారు. వారికి అన్నివిధాలా అండ గా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతకుముందు గ్రామంలో రోడ్లపై రంగవల్లులు వేసి పులివెందుల పులిబిడ్డకు స్వాగతం అని రాశారు. ఇక్కడ హైదరాబాద్ ఓక్కుడోలు వాయిద్యాలు వాయిస్తూ నృత్యకారులు నాట్యం చేయడం చూపరులను ఆకట్టుకుంది.
గ్రామాల్లో జననీరాజనం
రోడ్ షోలో భాగంగా దామకండ్రిగలో వై.ఎస్.జగన్ కాన్వాయ్‌ను మహిళలు ఆపి స్వాగతం పలికారు. కాన్వాయ్ వెళుతుండగా యువకులు మోటారు సైకిళ్లపై వెంటవస్తూ జగన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. జానికాపురం వద్ద మహిళలు జగన్‌ను పలకరించా రు. తమ సమస్యలు తెలియజేశారు. జానికాపురం క్రాస్‌లో వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన నేతలు జననేతను కలిశారు. అనంతరం వజ్జావారికండ్రిగకు చేరుకున్న వై.ఎస్.జగన్ రోడ్‌షో నిర్వహించారు. ఇక్కడ మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో బారులుతీరి తమ అభిమాన నాయకుడికి ఆహ్వానం పలికారు. జగన్ ప్రతి ఒక్కరినీ పలకరించి వారి సమస్యలు ఓపికగా విన్నారు.
కడివేడు గ్రామంలో మహిళలను పలకరిం చి కారు నుంచే అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ గ్రామం లో కమలమ్మ అనే వృద్ధురాలు తనకు వస్తున్న పింఛన్ చాలడం లేదని, కుటుంబం పేదరికంలో ఉందని జగన్ దృష్టికి తెచ్చారు. నాలుగు నెలల్లో తమ ప్రభుత్వం రాగానే వృద్ధుల పింఛన్ పెంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఇదే గ్రామంలో గిరిజ అనే మహిళ తన భర్త చనిపోయాడని, తనకు ఒకే కిడ్నీ ఉందని ఆర్థికసాయం చేయాలని జననేత వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో చలించిన వై.ఎస్.జగన్ ఆమెను ఓదార్చారు. సాయం చేయాల్సిందిగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు వరప్రసాద్‌కు సూచించారు. వరప్రసాద్ ఆ మహిళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
పావలా వడ్డీని విడుదల చేస్తాం
కడివేడు గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున జననేతకు స్వాగతం పలికారు. గ్రామంలోని మహిళలందరూ వరుసలో నిలబడి జగన్‌ను కలుసుకున్నారు. రుణాల మొత్తం చెల్లించినా పావలా వడ్డీ డబ్బులు తిరిగి ప్రభుత్వం జమ చేయడం లేదని మహిళలు జగన్ దృష్టికి తెచ్చారు. ఆయన స్పందిస్తూ నాలుగు నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని, మహిళా తల్లులకు రావాల్సిన పావలావడ్డీని పూర్తిగా వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కడివేడులో వై.ఎస్.జగన్ రోడ్‌షోలో పాల్గొన్న విద్యార్థులు, కొందరు మహిళలు ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.
మహానేత విగ్రహావిష్కరణ
బీరకుప్పం శివార్లలోనే గ్రామస్తులు బాణసంచా కాలుస్తూ, డప్పులు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ తమ అభిమాన నాయకుడికి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పలికారు. పాఠశాల విద్యార్థులూ జగన్‌ను చూసేందుకు వేచి ఉండడం కనిపించింది. బీరకుప్పంలో మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జననేత ఆవిష్కరించారు. వేదిక సమీపంలో ఎన్నికల గుర్తు ఫ్యాను వేలాడదీశారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మిద్దెలపైకి ఎక్కి నిలబడ్డారు. గ్రామస్తులు శాలువలతో జగన్‌ను సత్కరించారు.
వరదయ్యపాళెం మండలంలో..
జననేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో వరదయ్యపాళెం మండల సరిహద్దు అంబికాపురం చేరుకోగానే మండల పార్టీ నాయకులు, సర్పంచులు, అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. తొండంబట్టు గ్రామంలో బాణసంచా కాలుస్తూ, నృత్యం చేస్తూ ర్యాలీగా గ్రామంలోకి వై.ఎస్.జగన్‌ను ఆహ్వానించారు. ఇక్కడ మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కప్పడుతాగేళిలోనూ జననేత పెద్ద సంఖ్యలో వేచి ఉన్న మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అక్కడ నుంచి పెద్దపాండూరు చేరుకుని మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రోడ్‌షో నిర్వహిస్తూ వెంగారెడ్డి కండ్రిగ, చెన్నావారిపాళ్యంలో ప్రజలను పలకరించారు. చీకట్లో, చలిలో సైతం జనం జగన్ కోసం వేచి ఉండడం కనిపించింది. అక్కడ నుంచి జగన్ వరదయ్యపాళెంలో రోడ్‌షో నిర్వహించారు. ఇక్కడ స్థానికులు బాణసంచా కాలుస్తూ, డప్పులు వాయిస్తూ జననేతకు ఘన స్వాగతం పలికారు. కాన్వాయ్ వెంట యువకులు పరుగులు తీశారు. బస్టాండ్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించిన అనంతరం మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. తర్వాత బహిరంగసభలో ప్రసంగించారు. అనంతరం బీఎన్‌కండ్రిగ మండలం నీర్పాకోట గ్రామంలోని వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ విద్యానాథరెడ్డి ఇంట్లో రాత్రి బస చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ఎ.ఎస్.మనోహర్, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, యువత కన్వీనర్ ఉదయకుమార్, కార్మికవర్గ కన్వీనర్ బీరేంద్ర వర్మ, నాగలాపురం మండల కన్వీనర్ అపరంజిరాజు, జిల్లా మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చిన్నదొరై, నాయకులు విరూపాక్షి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొనారు.