
ఓదార్పు యాత్రకు అనుమతివ్వండి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకుగాను బెంగళూరు మీదుగా చిత్తూరు జిల్లా పలమనేరు వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
బెంగళూరు మీదుగా పలమనేరు వెళ్లేందుకు..
కోర్టును అనుమతి కోరిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకుగాను బెంగళూరు మీదుగా చిత్తూరు జిల్లా పలమనేరు వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న బెంగళూరులో బస చేసి 27న పలమనేరు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు. ఆయన జనవరి 2 వరకు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారని, గతంలో మధ్యలో ఆపిన ఓదార్పు యాత్రతోపాటు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో సమైక్య శంఖారావం కార్యక్రమాన్ని చేపట్టనున్నారని చెప్పారు. ఈ పిటిషన్‌ను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టుల ఇన్‌చార్జ్ న్యాయమూర్తి.. సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.