భద్రత తొలగింపు అన్యాయం: వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy serious over scaling down of security | Sakshi
Sakshi News home page

భద్రత తొలగింపు అన్యాయం: వైఎస్ జగన్

Published Tue, Sep 16 2014 2:05 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

భద్రత తొలగింపు అన్యాయం: వైఎస్ జగన్ - Sakshi

భద్రత తొలగింపు అన్యాయం: వైఎస్ జగన్

తనకున్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించి, (1+1) వ్యక్తిగత భద్రత సిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు

‘జెడ్ కేటగిరీ’పై హైకోర్టుకు విన్నవించిన జగన్
  కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు
  ఇప్పటివరకు సమాచారం కూడా లేదు
  నాకు ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు 
  నివేదికలు ఇచ్చాయి
  అయినా కూడా జెడ్ కేటగిరీ తొలగించారు
  జెడ్ కేటగిరీని పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండి
  భద్రత కుదింపుపై వైవీ సుబ్బారెడ్డి పిటిషన్
 
 సాక్షి, హైదరాబాద్: తనకున్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించి, (1+1) వ్యక్తిగత భద్రత సిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గత మూడేళ్లనుంచి తనకు కొనసాగుతూ వచ్చిన జెడ్ కేటగిరీ భద్రతను యథాతథంగా కొనసాగించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, వైఎస్సార్ జిల్లా ఎస్‌పీ, రాష్ట్రస్థాయి భద్రత సమీక్ష కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మావోయిస్టులపై నిషేధం విధించారని, ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా భద్రతనిచ్చారని, అందులో భాగంగా తనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించారని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
మావోయిస్టుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు కొనసాగుతూ వస్తోందని తెలిపారు. ‘నా తండ్రి మరణించిన తరువాత కూడా నాకు జెడ్ కేటగిరి భద్రత కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి కూడా ఇదే రకమైన భద్రత కల్పిస్తూ వస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులకు ఇప్పటికీ జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారు. ప్రతిపక్షనేతగా నాకు కేబినెట్ హోదా ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 13న ప్రతివాదులు నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా నాకున్న జెడ్ కేటగిరి భద్రతను ఉపసంహరించారు. ఉపసంహరణకు సంబంధించి ఇప్పటివరకు నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. హైదరాబాద్‌లో నివాసం ఉండే నేను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇరు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాను. రాజకీయ దురుద్దేశాల్లో భాగంగానే ఇరు ప్రభుత్వాలు కలిసి నా భద్రతను ఉపసంహరించాయి. నాకున్న ప్రాణహానికి, ఈ విషయాన్ని ధృవపరుస్తున్న నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భద్రతను ఉపసంహరించారు. 
 
నాకు ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. అందువల్ల నాకున్న జెడ్ కేటగిరి భద్రతను మెరుగుపరిచి, దానిని కొనసాగించాలని నిఘా వర్గాలు చెప్పాయి. నిఘా వర్గాల నివేదికలకు విరుద్ధంగా ప్రతివాదులు నాకున్న జెడ్ కేటగిరి భద్రతను ఉపసంహరించారు. నాకు జెడ్ కేటగిరి భద్రతను కల్పించేటప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ప్రాణహాని ఉన్న వ్యక్తులు, నాయకులు భద్రత కోసం సంబంధిత అధికారులను ఆశ్రయించవచ్చునని ఇదే హైకోర్టు ధర్మాసనం 1996లో స్పష్టమైన తీర్పునిచ్చింది. రాజకీయ దురుద్దేశాలతో నాకు తొలగించిన జెడ్ కేటగిరి భద్రతను యథాతథంగా పునరుద్దరించేలా ప్రతివాదులను ఆదేశించండి’ అని ఆయన తన పిటిషన్‌లో కోర్టును కోరారు. తనకు హైదరాబాద్‌లో ఉన్న (2+2) భద్రతను ఉపసంహరించి, ప్రకాశం జిల్లాలో (1+1) భద్రతను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి కూడా సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement