వైఎస్‌ జగన్: 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా.. | YS Jagan 6 Months as a CM Has Taken More than 60 Key Decisions - Sakshi
Sakshi News home page

6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా..

Published Sat, Nov 30 2019 4:27 AM | Last Updated on Sat, Nov 30 2019 2:36 PM

YS Jagan Mohan Reddy Six Months Administration : Taken More than 60 key decisions along with new schemes - Sakshi

‘ఆరునెలల్లోగా మీ అందరిచేత మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా’ అని ప్రమాణస్వీకార వేదికపై నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినపుడు రాష్ట్రప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఖాళీ ఖజానా.. గాడిలో లేని పాలన.. అన్ని రంగాల్లోనూ అవినీతి విశృంఖలత..

ఇలా ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయినా వెరవలేదు.. తొలి అడుగే సంక్షేమ సంతకం. నాటి నుంచి వడివడిగా అడుగులు పడుతూనే ఉన్నాయి. వరుసగా సంక్షేమ పథకాలు.. అన్ని వర్గాలకు ఆలంబనగా కీలకమైన నిర్ణయాలు వెలువడుతూనే ఉన్నాయి. ఇదేసమయంలో ప్రతిపక్షం, మీడియా అంతా ఏకమై చేస్తున్న వ్యతిరేక ప్రచారం ఆకాశాన్నంటింది. అయినా అన్నిటినీ తట్టుకుని తాను పెట్టుకున్న గడువు నాటికి కనీవిని ఎరుగని విజయాన్ని అందుకున్నాడు. కులాలు చూడలేదు. మతాలు చూడలేదు.. ప్రాంతాలను, పార్టీలను పట్టించుకోలేదు. అర్హులైన ఏ ఒక్కరూ ఏ ఒక్క పథకానికీ దూరం కాకూడదన్నది తన లక్ష్యమని ముఖ్యమంత్రి తరచూ చెబుతున్నారు. శాచురేషన్‌ స్థాయిలో అమలవుతున్న పథకాలే అందుకు సాక్ష్యం పలుకుతున్నాయి.

వైఎస్సార్‌ హయాంలో మొదలై ఆ తర్వాత కాలంలో ఆగిపోయిన, గాడి తప్పిన సంక్షేమ పథకాలన్నిటినీ మరింత మెరుగ్గా తీర్చిదిద్ది పట్టాలెక్కించడమే కాక అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా అనేక కొత్త పథకాలను అమలుచేయగలుగుతారని ఎవరూ ఊహించలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించే ‘స్పందన’ కార్యక్రమం ఎంతో ఊరట కలిగిస్తోందని జనం చర్చించుకుంటున్నారు. ఈ స్వల్ప వ్యవధిలోనే అనేక ‘పరీక్షల’ను అధిగమించి నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు.. అందులోనూ కొత్తగా 1.40 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయాలలో పని మొదలయ్యింది. పెరిగిన వేతనాలు అనేక రంగాలలో కొత్త ఉత్తేజానికి ఊపిరులూదాయి.

మద్యనిషేధం దశలు మొదలుకావడం మహిళల్లో హర్షాతిరేకాలు పెంచాయి.  రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనాన్ని ఆదా చేయడమే కాదు అవినీతికి తావులేని పారదర్శక పాలన చూసి విమర్శకులు సైతం కితాబులిచ్చేలా జగన్‌ ముందుకు సాగుతున్నారు... మౌలిక రంగాలైన విద్య, వైద్యంలో సమూల మార్పులు చేపట్టడం, పాఠశాలలు – ఆసుపత్రులను మెరుగుపరచేందుకు నిర్ణీత కాలాన్ని, లక్ష్యాలను నిర్ణయించుకోవడం, సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టడం వంటివి సామాజిక మార్పు దిశగా తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలే. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంత్రివర్గంలో మెరుగైన స్థానం కల్పించడం ఓ రికార్డు. అంతేకాదు ఈ వర్గాలకు, మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లోనూ, నామినేటెడ్‌ పనుల్లోనూ 50శాతం రిజర్వేషన్‌ కల్పించడం గతంలో కనీవిని ఎరుగరెవ్వరూ. రానున్న కాలంలో పెను సంచలనం సృష్టించనున్న సామాజిక విప్లవానికి ఇవన్నీ సూచికలు.. 

కీలక నిర్ణయాలు
వేతనాల పెంపు 
- ఆశా వర్కర్లకు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు. 
- బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంపు. 
హోం గార్డులకు రూ.18వేల నుంచి రూ.21 వేలకు పెంపు. 
వీవోఏ(వెలుగు యానిమేటర్లు) వేతనం రూ.3 వేల నుంచి 10 వేలకు పెంపు. 
- 108 పైలెట్‌(డ్రైవర్‌) వేతనం
రూ.13 వేల నుంచి రూ.28 వేలకు, ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌) వేతనం రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెంపు. 
- 104 వాహన ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్ల వేతనం రూ.17,500 నుంచి రూ.28 వేలకు, డ్రైవర్‌ వేతనం రూ. 15,000 నుంచి రూ.26 వేలకు పెంపు. 
- మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు గౌరవ వేతనం రూ.3 వేలకు పెంపు. 

సచివాలయాలు – ఉద్యోగాల విప్లవం 
- ప్రజల పనులు/సమస్యలు 72 గంటల్లో పరిష్కారమయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాలు .
పూర్తి పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా 20 లక్షల మందికి పరీక్షలు సజావుగా నిర్వహణ. 
నాలుగు నెలల్లోనే 4.10 లక్షల ఉద్యోగాల కల్పన.  
- ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు. 
- గ్రామ వలంటీర్‌ ఉద్యోగాలు 2.75 లక్షలు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌.

సామాజిక విప్లవం 
మంత్రి మండలిలో బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్ని నామినేటెడ్‌ పదవులు (టీటీడీ మినహా), నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం.. అన్ని నామినేటెడ్‌ పదవులు (టీటీడీ మినహా), నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం.

వైఎస్సార్‌ నవోదయం
లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి. 
గత ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వీటినిఆదుకోవడానికి అక్టోబర్‌ 17న ఈ పథకం ప్రారంభం. 80 వేల ఎంఎస్‌ఎంఈలకు ఊరట.      

అగ్రిగోల్డ్‌ 
రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులు 3.70 లక్షల మందికి తొలి విడతలో రూ.263 కోట్లు పంపిణీ. 
రెండో విడత చెల్లింపుల్లో రూ.20 వేల లోపు డిపాజిటర్లకు త్వరలో పరిహారం. ఇందు కోసం త్వరలోనే రూ.811 కోట్లు విడుదల. 
మొత్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం రూ.1,150 కోట్లు కేటాయింపు.

పోలీసులకు వీక్లీ ఆఫ్‌ 
పోలీసులకు దేశంలోనే మొదటి సారిగా వీక్లీ ఆఫ్‌ (వారంలో ఒక రోజు సెలవు) సౌకర్యం.

స్పందన 
ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం.
ఎప్పటిలోగా సమస్య పరిష్కరిస్తారో సూచిస్తూ ప్రతి అర్జీకి రశీదు తప్పనిసరి.
- ప్రతి వారం ‘స్పందన’ అమలు తీరుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష .
అర్జీదారులు సంతృప్తి చెందేలా వ్యవహరించాలని సీఎం ఆదేశం.

వైఎస్సార్‌ నవశకం 
వైఎస్సార్‌ నవశకం పేరుతో ఈ నెల 20 నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం సాగుతోంది.  
ఈ కార్యక్రమం కింద కొత్తగా బియ్యం కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన – జగనన్న వసతి దీవెన కార్డులను జారీ చేస్తారు. జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ కాపు నేస్తం.. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేల ఆర్థిక సాయం.. అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌ల గుర్తింపు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, లా నేస్తం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. 

దశల వారీగా మద్యపాన నిషేధం   
రాష్ట్రంలోని 44 వేల బెల్ట్‌షాపుల తొలగింపు.  
4,380 మద్యం షాపుల్లో 880 తగ్గించి 3,500కు కుదింపు. ప్రభుత్వమే మద్యం షాపుల నిర్వహణ.  
బార్లలోనూ 40 శాతం తగ్గించాలని నిర్ణయం. మద్యం ధరలు పెంపు, లైసెన్స్‌ ఫీజు భారీగా పెంపు.
మద్యం ముట్టుకుంటేనే షాక్‌ కొట్టేలా నిర్ణయాలు.. త్వరలో నూతన మద్యం విధానం అమలు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 3,500 మంది సూపర్‌వైజర్లు, 8,033 మంది సేల్స్‌మెన్‌ల నియామకం ద్వారా ఉపాధి కల్పన.

మన బడి నాడు–నేడు
మనబడి నాడు–నేడులో భాగంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లు కేటాయింపు. 
తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ధి. 
ప్రస్తుతం పాఠశాలల ఫొటోలు తీసి.. అభివృద్ధి చేశాక ఫొటోలతో తేడా చూపుతారు.

అవినీతిపై యుద్ధం 
రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు 14400 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు. 
ఈ నంబర్‌కు ఫోన్‌ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి.. చర్యలు.  
ఒక్క ఫోన్‌ కాల్‌తో మీ వెంట మేమున్నామనేలా ప్రజలకు భరోసా కల్పిస్తారు.  

కొత్త ఇసుక పాలసీ 
గత ప్రభుత్వ పెద్దల దోపిడీ తీరుకు భిన్నంగా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కొత్త ఇసుక పాలసీ అమలు. 
ఎక్కడా అవినీతికి తావు లేకుండా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాల ఏర్పాటు. 
ఇసుక వారోత్సవంలో రూ.60 కోట్లు ఆదాయం. 

ముఖ్యమైన పథకాలు 
వైఎస్సార్‌ రైతు భరోసా 
రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తి. 
మరో 2.14 లక్షల మంది రైతులకు వారంలోగా చెల్లించాలని సీఎం ఆదేశం. మొత్తంగా 48 లక్షల మంది రైతులకు భరోసా.  
గ్రామ సచివాలయాల్లో రైతులకు అందుబాటులో నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు. వర్క్‌షాపుల్లో రైతులకు శిక్షణ. 
రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విత్తన, ఎరువుల పరీక్ష కేంద్రాలు.
రూ.4 వేల కోట్లతో (కేంద్ర, రాష్ట్రాలు కలిపి) ప్రకృతి వైపరీత్యాల నిధి, అగ్రి కమిషన్, ఆయిల్‌పాం రైతులకు గిట్టుబాటు ధర కోసం నిధుల కేటాయింపు, కౌలు రైతుల కోసం సాగుదారుల హక్కుల బిల్లు, ఉచిత పంటల, పశు బీమా, గత ప్రభుత్వ ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయి రూ. 2 వేల కోట్లు విడుదల, ఇన్‌పుట్‌ సబ్సిడీ 15 శాతం పెంపు, వ్యవసాయ ల్యాబ్‌లు, ఉచిత బోర్లు, పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే కరెంట్‌ సరఫరా. 
శనగ రైతులకు రూ. 330 కోట్లు, ఆయిల్‌పామ్‌ రైతులకు తెలంగాణతో సమానంగా ధర చెల్లింపునకు రూ. 85 కోట్లు, పెదవేగి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ యాజమాన్య హక్కులు రైతులకు అప్పగింత.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం, రైతులకు వడ్డీ లేని రుణాలు, చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు.

వైఎస్సార్‌ వాహన మిత్ర 
ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం. 
ఈ డబ్బును వాహనాల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవాలి.  
ఇప్పటి వరకు రూ.236 కోట్లతో 2,36,343 మందికి రెండు విడతల్లో ఆర్థిక సహాయం.   

వైఎస్సార్‌ కంటి వెలుగు  
ప్రజలందరికీ కంటి పరీక్షలు, చికిత్స చేయిస్తారు.  
తొలి విడతగా సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించారు. రెండవ విడతలో వీరిలో అవసరమైన వారికి చికిత్స చేయించి, ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తారు.   
ఆ తర్వాత 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీ బేస్‌ ఆధారంగా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలవుతాయి. 

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా 
ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు రెండు నెలలు చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి ఇచ్చే సహాయం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంపు. తద్వారా రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి. 
మర పడవల నిర్వాహకులకు ఇస్తున్న డీజిల్‌ రాయితీ లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంపు. ఇంజను కలిగిన తెప్పలకూ రాయితీ వర్తింపు. ఒక్కో మర పడవకు నెలకు రూ.27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 రాయితీ. ఏడాదిలో పది నెలలకు స్మార్డ్‌ కార్డుల ద్వారా రాయితీ. 
సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు. కొత్తగా మూడు ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాలు. ముమ్మిడివరంలో చమురు నిక్షేపాల అన్వేషణలో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.78.24 కోట్ల పరిహారం చెల్లింపు. 

వైఎస్సార్‌ కాపు నేస్తం
ఈ పథకం కింద తొలి ఏడాది రూ. 1,101 కోట్లు కేటాయింపు.
45 ఏళ్లు దాటిన కాపు మహిళకు ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల సహాయం.

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక  
పింఛన్ల పెంపునకు సంబంధించిన ఫైలుపై సీఎంగా వైఎస్‌ జగన్‌ తొలి సంతకం  
సామాజిక పెన్షన్లు రూ.2,250కి పెంపు. ఏటా రూ.250 పెంపుతో రూ.3 వేల వరకు పెంచుతారు.
వృద్ధుల పెన్షన్‌ వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు. వికలాంగులకు రూ.3 వేలు పింఛన్‌.

ఆరోగ్యశ్రీ
వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న కుటుంబాలకు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు. 
హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఎక్కడ వైద్యం చేయించుకున్నా పథకం వర్తింపు.  
చికిత్స చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో నిపుణుల కమిటీ సూచన మేరకు రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ఆర్థిక సహాయం.  
డయాలసిస్‌ చేయించుకునే వారు, తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేల పింఛన్‌. ప్రమాదాల కారణంగా, పక్షవాతం వల్ల, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోధకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్‌ 3,4,5) నెలకు రూ.5 వేల పింఛన్‌. కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేల పింఛన్‌.  
కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ‘నాడు – నేడు’ కింద ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, ఇందుకు రూ.1,500 కోట్లు కేటాయింపు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు కేటాయింపు.  
సుమారు 3.5 కోట్ల మందికి లబ్ధి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 936 వ్యాధులు. మొత్తంగా 2,031 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపు. 

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన
జగనన్న విద్యా దీవెన పథకం కింద పేద విద్యార్థులు ఏ చదువు చదివినా పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌. 
జగనన్న వసతి దీవెన పథకం కింద 2019–2020 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి ఆహారం, వసతి ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు అందజేత.  
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలకూ వర్తింపు.  
- ఈ పథకాల కింద 11.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి, రూ.5668 కోట్లు కేటాయింపు. 

రానున్న రోజుల్లో..
ఇళ్ల పట్టాలు  
ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు.. భూసేకరణ వేగవంతం.
మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్‌.
అవసరమైతే ఆ ఇంటిమీద పావలా వడ్డీకే బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడం. 

ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు 
అవినీతికి ఆస్కారం లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకం. 
ఉద్యోగులకు పూర్తిగా జీతాలు వచ్చేట్టు చేయడమే ఈ కార్పొరేషన్‌ లక్ష్యం. 
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జనవరి 1 నుంచి ఈ కార్పొరేషన్‌ ద్వారానే వేతనాల చెల్లింపు. 

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అధ్యయనం కోసం ఆంజనేయరెడ్డి కమిటీ ఏర్పాటు.
సెప్టెంబర్‌ 3న మధ్యంతర నివేదిక.
విలీనం ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏడుగురు సభ్యులతో వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు. 

ఇంగ్లిష్‌ మీడియానికి ప్రజల మద్దతు  
వచ్చే ఏడాది 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగిస్తూనే ఇంగ్లిష్‌ మీడియం. 
ఉపాధి, ఉన్నత విద్యలో పేద పిల్లలు వెనుక బడకుండా ఉండేందుకు దోహదం.  

అమ్మ ఒడి (జనవరి 9న ప్రారంభం) 
- ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున సాయం.  
- 45 లక్షల మంది అమ్మలకు రూ.6,600 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు.   
ఈ పథకం వల్ల డ్రాపౌట్లు తగ్గుతాయి.  
పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు వృద్ధి చెందుతాయి. 

వైఎస్సార్‌ నేతన్న నేస్తం(డిసెంబర్‌ 21న ప్రారంభం) 
మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల సాయం. 
ఇప్పటి వరకు 73,594 మంది లబ్ధిదారుల గుర్తింపు.  

వైఎస్సార్‌ లా నేస్తం (డిసెంబర్‌ 3న ప్రారంభం)
జూనియర్‌ న్యాయవాదులకు మొదటి మూడేళ్ల ప్రాక్టీస్‌ సమయంలో నెలకు రూ.5 వేల సాయం.

వైఎస్సార్‌ పెళ్లి కానుక  (శ్రీరామనవమి రోజు ప్రారంభం)
ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల చెల్లెమ్మల వివాహానికి రూ.లక్ష సాయం.. బీసీ చెల్లెమ్మల వివాహానికి రూ.50 వేలు సాయం.

వైఎస్సార్‌ ఆసరా  
పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు. ఇందుకోసం ఈ బడ్జెట్లో రూ. 1,788 కోట్లు కేటాయించారు. 
- సున్నా వడ్డీకే రుణం లక్ష్యం రూ.16,819 కోట్లు. 
డ్వాక్రా సంఘాలకు ఎన్నికల నాటికి ఉన్న అప్పుల మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా వారి చేతికే ఇస్తారు.

వైఎస్సార్‌ చేయూత  
45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో (రెండవ ఏడాది నుంచి) దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా రూ.75 వేల సాయం.

మరికొన్ని..
పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం. 
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు గృహ వినియోగ విద్యుత్‌ ఉచితం. 
పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు.
వినియోగదారులకు నాణ్యమైన బియ్యం సరఫరాకు శ్రీకాకుళంలో పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభం.
స్కూల్‌ ఎడ్యుకేషన్, హయ్యర్‌ఎడ్యుకేషన్‌ కమిషన్ల ఏర్పాటు.  
గిరిజన ప్రాంతంలో బాక్సైట్‌ రద్దు.
సాలూరు, పాడేరులో గిరిజన వైద్య కళాశాల.
గిరిజన ప్రాంతాలలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు శ్రీకారం. అరకు, కెఆర్‌పురం, రంపచోడవరం, పార్వతీపురం, పాలకొండ, దోర్నాలలో ఏర్పాటుకు నిర్ణయం. పౌష్టికాహారం పంపిణీకి నిర్ణయం. 
పలాసలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన. 
గిరిజన సలహా మండలి ఏర్పాటు. 
తాగునీటి సరఫరా కోసం వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు శ్రీకారం.  
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం.
సఖి.. లైంగిక వేధింపులపై ఉక్కుపాదం. 
సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌లో పేపరు మిల్లు బాధిత రైతులకు ప్రభుత్వ చెల్లింపులు.  
అర్చకులకు వారసత్వం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం.  
- మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు.  
రాష్ట్రంలో 4 పోర్టుల అభివృద్ధికి చర్యలు  
- అవినీతి రహితంగా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం. 
- వైఎస్సార్‌ ఆదర్శం కింద నిరుద్యోగులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, ఈబీసీ యువతకు వాహనాలు అందిస్తారు. పథకం కింద ట్రక్కుల కొనుగోళ్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది. లబ్ధిదారుడు రూ.50 వేలు చెల్లిస్తే ట్రక్కు ఇస్తారు. 
- లబ్ధిదారులకు నెలకు కనీసం రూ.20 వేల ఆదాయం వచ్చేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement