మూడు రోజుల పాటు నరకాసుర వధ.. బాబు దిష్టిబొమ్మల దహనం
హైదరాబాద్: రైతుల రుణమాఫీ విషయంలో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి నిరసనగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోను మూడు రోజుల పాటు 'నరకాసుర వధ' పేరిట చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, మొత్తం 13 జిల్లాల్లోని అన్ని గ్రామాల్లోనూ ఇది జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. అడవుల్లో చెట్లను కూడా బ్యాంకులకు తాకట్టు పెడతామని ఆయన అంటున్నారని, ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయలేని బాబు ఇప్పుడు కల్లబొల్లి కారణాలు చెబుతున్నారన్నారు. విశ్వసనీయతకు, వంచనకు జరుగుతున్న ఎన్నికలని తాము ముందే చెప్పామన్నారు.
తనకు అనుకూలంగానే కోటయ్య కమిటీతో చంద్రబాబు చెప్పించారని, ఆ మేరకే ఆయన కూడా నివేదిక ఇచ్చారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబుకు ముందే తెలుసునని, అన్నీ తెలిసి విభజనకు ఆయన అనుకూలంగా ఓటేశారని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోల్లో రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వనరులపై పూర్తి అవగాహనతోనే రుణమాఫీ హామీ ఇచ్చానని చంద్రబాబు ...ఎన్నికల కమిషన్కు లేఖ రాశారన్నారు.
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి, రైతు, డ్వాక్రా రుణాలమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీలను వీడియో క్లిప్పింగ్స్ను ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాకు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో రూ.87,612వేల కోట్లు రైతుల రుణాలు, రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలున్నాయన్నారు. అయితే చంద్రబాబు మాఫీ చేస్తానన్న రుణాల మొత్తం రూ.1,01,816 కోట్లు అని జగన్ అన్నారు. మరి రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు...కోటయ్య కమిటీ ఎందుకు వేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కమిటీల పేరుతో బాబు కాలయాపన చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
తెలంగాణ, ఏపీ మేనిఫెస్టోల్లో రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని, వనరులపై పూర్తి అవగాహనతోనే రుణమాఫీ హామీ ఇచ్చానంటూ చంద్రబాబు ఈసీకి కూడా లేఖ రాశారని జగన్ మోహన్ రెడ్డి గుర్తుచేశారు. రుణమాఫీపై ఎందుకు పరిమితులు విధించారని ప్రశ్నించారు. తెలంగాణలో రుణమాఫీపై ఓ మంత్రి పరిమితులు విధిస్తే కేసీఆర్ మాట తప్పారంటూ ఆయన దిష్టిబొమ్మలు దహనం చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలా పరిమితి విధిస్తారని నిలదీశారు.
పాకెట్ కొట్టేసిన వారిపై 420కేసు పెట్టినప్పుడు చంద్రబాబుపై ఏకేసుపెట్టాలంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారని, మీ మాట నమ్మి రుణం కట్టని రైతుల పరిస్థితేంటని అడిగారు. రుణమాఫీకి డబ్బుల్లేవంటారు గానీ, అడవుల్లో చెట్లను బ్యాంకులకు తాకట్టు పెడతామంటున్నారని, హైకోర్టు ఆదేశాలున్నా ఇసుక రీచ్‌లను అమ్మేస్తామంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పుణ్యంతో రైతులు పంటల బీమా నష్టపోయారని, అందుకే చంద్రబాబు తీరుకు నిరసనగా రేపటి నుంచి మూడురోజులపాటు 13 జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఆందోళనలు చేస్తామని తెలిపారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు మభ్యపెట్టిన తీరును గ్రామగ్రామాన ప్రజలందరికీ వివరిస్తామని, నరకాసురవధ పేరుతో దిష్టిబొమ్మల దహనం కార్యక్రమం చేపడతామని వివరించారు.