జనహో.. జయహో | YS Jagan Mohan Reddy starts hunger strike over farmers' issues | Sakshi
Sakshi News home page

జనహో.. జయహో

Published Sun, Feb 1 2015 4:57 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

జనహో.. జయహో - Sakshi

జనహో.. జయహో

     రుణవంచనపై తిరగబడ్డ రైతన్న
     కదం తొక్కిన మహిళా లోకం
     వెల్లువెత్తిన యువకులు, పార్టీ శ్రేణులు
     సర్కారుకు వ్యతిరేకంగా మిన్నంటిన నినాదాలు
     బాబు మోసాలపై నిప్పులు చెరిగిన నేతలు
     ఇది ఆరంభమే.. నిరంతర పోరాటాలకు పిలుపు

 
 తణుకు నుంచి సాక్షి ప్రతినిధి :తమ కోసం నిరశన దీక్ష చేపట్టిన జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిన సంఘీభావం ప్రకటించారు. అంచనాలకు మించి రైతులోకం, నారీజనం రైతు దీక్షకు తరలివచ్చారు. చంద్రబాబు రుణవంచనపై రైతన్న తిరగబడ్డాడు. నారా వారి నయా మోసంపై మహిళా లోకం గర్జించింది. ఉద్యోగాలిప్పిస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పిన మాయమాటలపై యువత నిప్పులు చెరిగింది. ఎడాపెడా పింఛన్ల కోతపై వృద్ధులు, వికలాంగులు కదం తొక్కారు. అధికారం దన్నుతో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడుతున్న వేధింపులపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కన్నెర్ర చేశాయి. వెరసి తణుకులో జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు దీక్షకు ప్రజ పోటెత్తింది. ఎనిమిది నెలల తెలుగుదేశం ప్రభుత్వ దగాకోరు విధానాలను, రుణమాఫీ మాయాజాలంతో రైతులను, డ్వాక్రా మహిళలను నట్టేట ముంచిన చంద్రబాబు నయవంచన తీరును నిరసిస్తూ వైఎస్ జగన్ చేపట్టిన రెండురోజుల నిరశన దీక్షకు తొలి రోజైన శనివారం అంచనాలకు మించి జనం పోటెత్తారు.
 
 మహిళలైతే ఉవ్వెత్తున తరలివచ్చారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన రైతన్నలు, మహిళలతో తణుకు పట్టణం కిక్కిరిసిపోయింది. శనివారం ఎక్కడ చూసినా జగన్ చేపట్టిన దీక్షకు స్వచ్ఛందంగా తరలివస్తున్న రైతులే కనిపించారు. ఉభయగోదావరి జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల నుంచి రైతులు, యువకులు శుక్రవారానికే తణుకు వచ్చేశారు. పట్టణంలో లాడ్జిలు, కల్యాణ మంటపాలు, ఆడిటోరియాలు, హాళ్లు అన్నీ నిండిపోవడంతో దీక్షకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు సభావేదిక వద్దే సేదతీరారు. శనివారం ఉదయం 9గంటలకే సభాప్రాంగణం కిక్కిరిసిపోయింది. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తణుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోగా, వేదికపైకి ఎక్కేందుకు 20 నిమిషాలు పట్టింది.
 
 వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు రైతులు. యువకులు పోటెత్తడంతో కాన్వాయ్ అడుగు మేర ముందుకు కదలడానికి పది నిమిషాలు పట్టింది. వైఎస్ జగన్ వేదిక మీదకు వెళ్లిన తర్వాత అభిమానులు ఆయనను దగ్గరుండి చూసేందుకు వెల్లువలా ముందుకు రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసులు దీక్ష జరిగే ప్రాంతానికి నలువైపులా బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేసినా ఇవేమీ జనం రాకకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఆర్టీసీ బస్సులను కేటాయించకుండా పాలకులు దిగజారుడుతనాన్ని ప్రదర్శించినా జనం రాకను అడ్డుకోలేకపోయారు. మోటార్ సైకిళ్లు, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో రాత్రి పొద్దు పోయే వరకు వివిధ ప్రాంతాల నుంచి జనం వస్తూనే ఉన్నారు.
 
 చప్పట్లతో సంఘీభావం
 తొలుత పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ఆళ్ల నాని ప్రారంభ ఉపన్యాసం చేస్తూ వైఎస్ జగన్ దీక్ష చరిత్రాత్మకమన్నారు. చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, రైతు విభాగం అధ్యక్షుడు ఏఎస్‌వీ నాగిరెడ్డి, నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, కారుమూరి నాగేశ్వరరావు తదితర  నేతలు విరుచుకుపడినప్పుడు ప్రజలు చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు.
 
 బాబు మోసంతో తనువు
 చాలించిన రైతులకు నివాళి
 బాబు రుణమాఫీ మోసానికి, అప్పులపాలై తీర్చే దారిలేక రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలి కాలంలో 86 మంది రైతులు మృత్యువాత పడ్డారు. వీరిలో ఆత్మహత్యకు పాల్పడ్డవారు కొందరైతే గుండెపోటుతో ప్రాణాలొదిలిన వారు మరికొందరు. వీరందరి ఆత్మశాంతి కోసం తొలుత రెండు నిమిషాలు సభలో మౌనం పాటించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించగా, సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.
 
 పశ్చిమ నుంచే
 మొదలైన తిరుగుబాటు
 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపుతో అధికార పక్షానికి పెట్టని కోటగా భావిస్తున్న పశ్చిమ నుంచే వైఎస్ జగన్ రైతు దీక్షతో చంద్రబాబు సర్కారుపై తిరుగుబాటు తీవ్రస్థాయిలో మొదలైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.వైఎస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం ప్రభుత్వ ఆగడాలపై రాజీలేని పోరాటంతో పాటు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతర ఉద్యమాలకు శ్రీకారం చుడతామని పార్టీ నేతలు పిలుపునివ్వడం శ్రేణులకు కొత్త ఊపునిచ్చింది.
 
 జగన్ దీక్షకు నార్వే మాజీ మంత్రి సంఘీభావం  
 తణుకు టౌన్ : తణుకులో రైతు దీక్ష పేరుతో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నార్వే దే శానికి చెందిన మాజీ మేజిస్ట్రేట్ (మాజీ మంత్రి) స్వోలాఫ్రిడ్ స్వీసన్, మరో ముగ్గురు సభ్యుల బృందం కలిసి ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. సేవా కార్యక్రమాల నిమిత్తం రాజమండ్రి వెళుతున్న నార్వే బృందం మార్గమధ్యంలో తణుకులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేస్తున్న విషయం తెలుసుకుని శిబిరం వద్దకు వెళ్లి ఆయనను కలసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్వీడన్ మాజీ మంత్రి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ తనకు ఎంతో సన్నిహితుడుని, ఆయనతో అనుబంధం మరువలేనిదన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడానికి నిరసనగా ప్రభుత్వం తీరుపై జగన్‌మోహన్‌రెడ్డి నిరాహారదీక్ష చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రుణమాఫీని అమలు చేసి రైతులకు, డ్వాక్రా మహిళలకు న్యాయం చేకూర్చాలని ఆమె పేర్కొన్నారు. ఈ బృందంలో నార్వేకు చెందిన రిటైర్డ్ టీచర్ కాలీజీ స్త్విక్, ఓఎన్‌జీ ఇంజనీర్ హరాల్డ్, ఆయిల్ కంపెనీ మేనేజర్ గున్నార్ తదితరులు ఉన్నారు.
 
 సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకే..
 జన నేత ప్రసంగానికి మిన్నంటిన జగన్ నినాదాలు
 ‘రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు వాగ్దానాలతో మోసపోయిన రైతన్నలకు, మహిళలకు తోడుగా ఉండేందుకు ఈ దీక్ష చేపట్టాను. ముందు మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాం. ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో  నిరసన చేపట్టాం. ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రస్థాయి మహాధర్నాకు ఇక్కడకు వచ్చాం’ అని వైఎస్ జగన్ మాట్లాడగానే చప్పట్లతో దీక్ష ప్రాంతం దద్దరిల్లిపోయింది. ‘అక్కచెల్లెమ్మలు, రైతన్నలు పడుతున్న అవస్థలు, బాధలు చూడలేక వారి తరఫున పోరాటం చేస్తున్నాం. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడకు వచ్చిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు మీరంతా మాట్లాడండి. రేపు సాయంత్రం నేను సుదీర్ఘంగా మాట్లాడతాను’ అని అందరికీ అభివాదం చేసి వైఎస్ జగన్ దీక్షలో కూర్చున్నారు. జగన్ మాట్లాడుతున్నంత సేపూ ‘జై జగన్.. జయహో జగన్’ అనే నినాదాలు మార్మోగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement