
వర్తమాన దేశ రాజకీయాల్లో ఈ రెండు లక్షణాలు మెండుగా కలిగిన ఈతరం నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే అనడంలో సందేహం లేదు. తండ్రి ఆశయాల సాధన కోసం ఎంత కష్టాన్నైనా భరించే ధైర్యం, కుట్రలను తిప్పికొట్టే స్థైర్యం ఆయన సొంతం. పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా ఆ తపన, ధైర్యం, సాధించాలన్న పట్టుదల కనబరుస్తూ వచ్చారు. దాదాపు దశాబ్ద కాలం నిత్యం ప్రజలతో మమేకమై కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానని భరోసా ఇచ్చారు. అడ్డదారిలో అధికారంలోకి రావడం కంటే ఇచ్చిన మాటకు కట్టుబడి విలువలు, విశ్వసనీయతకే పెద్దపీట వేశారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం అహరహం పోరాడారు. రాజకీయ ప్రత్యర్థులు తనను అంతమొందించేందుకు హత్యాయత్నానికి తెగబడ్డా మొక్కవోని దీక్షతో ప్రజల్లోకి వెళ్లి చరిత్రాత్మక పాదయాత్ర చేపట్టారు. అన్ని ప్రతిబంధకాలను ఛేదించి, అడ్డంకులను అధిగమించి దేశ చరిత్రలోనే అద్వితీయమైన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజా సంక్షేమం పట్ల తపన, రాష్ట్ర ప్రగతిపట్ల నిబద్ధత కలిగిన వైఎస్ జగన్‌కు అశేష ప్రజానీకం వెన్నంటి నిలిచింది. ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించి నిండు మనసుతో ఆశీర్వదించారు. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలుచుకుని వైఎస్ జగన్ తిరుగులేని ప్రజా నాయకుడిగా, బలీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించారు. జాతీయ స్థాయి రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల కీలక నేతగా దేశం దృష్టిని ఆకర్షించారు.
దశాబ్ద కాలంగా ప్రజలతోనే మమేకం
దాదాపు పదేళ్ల పాటు నిత్యం ప్రజల్లోనే ఉన్న నేత వైఎస్ జగన్ మినహా దేశంలోనే మరొకరు లేరన్నది నిస్సందేహం. 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించాలన్న నిర్ణయం జగన్ గమ్యాన్ని, గమనాన్ని మార్చేసింది. ఓదార్పు యాత్రలో భాగంగా 800 మందికి పైగా కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వైఎస్సార్‌సీపీని స్థాపించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా, ప్రమాదాలు జరిగినా బాధితులకు అండగా నిలిచారు. థర్మల్ ప్లాంట్ల వ్యతిరేక పోరాటాలతోపాటు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ఎలుగెత్తారు. జలదీక్ష, రైతు దీక్ష, విద్యార్థి దీక్ష, బందరు పోర్టు సాధన పోరాటంతోపాటు పలు ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. నాడు చంద్రబాబుతో సహా అన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకు సమ్మతించినా వైఎస్ జగన్ ఒక్కడే సమైక్యాంధ్ర కోసం గళమెత్తారు. ప్రతిపక్ష నేతగా ఐదేళ్లపాటు ప్రజల్లోనే ఉంటూ రాజ ధాని భూ కుంభకోణాలు, బాక్సైట్ తవ్వకాలు, ఇసుక దోపిడీ, టీడీపీ సర్కారు అవినీతిపై ఉద్యమాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్య మించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో యువభేరి సదస్సులు నిర్వహించారు.
ఇద్దరితో మొదలై..
కేవలం ఇద్దరు ప్రజాప్రతినిధులతో స్థాపించిన పార్టీని అలుపెరగని ప్రజా పోరాటాలతో అఖండ మెజార్టీతో అధికారంలోకి తేవడం వైఎస్ జగన్‌కే సాధ్యమైంది. నమ్మిన ఆశయాల సాధన కోసం నాడు కాంగ్రెస్ పార్టీకి, పదవులకు వైఎస్ జగన్, విజయమ్మలు రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వచ్చారు. ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ 5,45,672 ఓట్ల రికార్డు మెజార్టీతో కడప ఎంపీగా ఎన్నికకాగా, వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల భారీ మెజార్టీతో పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా 2011 మార్చి 12న జగన్ వైఎస్సార్‌సీపీని స్థాపించారు. అలా ఇద్దరు ప్రజాప్రతినిధులతో మొదలైన పార్టీ రాష్ట్రంలో ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగింది. రైతుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో నాడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి మద్దతు ఇస్తే ఎమ్మెల్యే పదవులకు అనర్హులమవుతామని తెలిసినప్పటికీ జగన్‌పై విశ్వాసంతో 17 మంది ఎమ్మెల్యేలు నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. వారిపై అనర్హత వేటు వేయడంతో 2012లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 15 అసెంబ్లీ సీట్లతోపాటు నెల్లూరు ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. అనంతరం 2014 ఎన్నికల్లో కేవలం 1 శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన వైఎస్సార్‌సీపీ 67 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీ స్థానాల్లో నెగ్గి బలమైన ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర పోషించింది. ఐదేళ్లపాటు జగన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ వచ్చారు.
పొలిటికల్ రాక్‌స్టార్
వైఎస్ జగన్ పోలిటికల్ రాక్‌స్టార్‌గా దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల్లో వైఎస్ జగన్ అంతటి సమ్మోహనశక్తి ఉన్న ప్రజా నేత మరొకరు లేరన్నది నిస్సందేహం. జగన్‌కు ఉన్న ఆదరణ, మాస్ ఫాలోయింగ్ దేశంలో మరే నేతకు లేదు. పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన పట్ల ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. జగన్ ఓదార్పు యాత్ర చేసినా, ప్రజాసమస్యల పరిష్కారం కోసం దీక్షలు, ధర్నాలు చేసినా, ఆయన బయటకు వస్తే చాలు జనసందోహం పోటెత్తుతోంది. జగన్‌ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, ఆయనతో ఫొటో దిగేందుకు వయోబేధం లేకుండా అంతా పోటీ పడుతున్నారు. జగన్ బహిరంగ సభలు ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిటకిటలాడతాయి. ఆయన ప్రసంగాలకు ప్రజలు ఉర్రూతలూగుతున్నారు. జగన్ పాదయాత్ర సమయంలో కృష్ణా, గోదావరి వంతెనలపై జనసంద్రం సాక్షాత్కరించింది. సోషల్ మీడియాలో కూడా వైఎస్ జగన్ అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా ఆవిర్భవించారు. ఎన్నికల ప్రచారం కోసం పార్టీ రూపొందించిన ‘రావాలి జగన్...కావాలి జగన్’ ప్రచార గీతాన్ని ఏకంగా 3 కోట్ల మందికిపైగా వీక్షించడం ఓ రికార్డు. ఇంత మాస్ ఇమేజ్ ఉన్న నేత దేశంలో మరొకరు లేరని జాతీయ రాజకీయాల పరిశీలకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సింహం... సింగిల్‌గానే...
దేశంలో దాదాపు అన్ని పార్టీలు పొత్తులు పెట్టుకునే ఎన్నికల్లో పోటీ చేశాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, శివసేన, డీఎంకే, అకాలీదళ్ తదితర పార్టీలన్నీ పొత్తులతోనే బరిలోకి దిగాయి. టీడీపీ ఈసారి లోపాయికారీ పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేసినా వైఎస్ జగన్ మాత్రం ఒంటరిగానే పోటీ చేసి ఘన విజయం సాధించడం విశేషం. 2014లో తృటిలో అధికారం కోల్పోయినందున ఈసారి పొత్తు కుదుర్చుకుని పోటీ చేద్దామన్న కొందరి సూచనలకు ఆయన అంగీకరించలేదు. పొత్తులు పెట్టుకుంటే మిత్రపక్షాల ఒత్తిడి వల్ల ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో రాజీ పడాల్సి వస్తుందని భావించిన జగన్ ఒంటరిగానే ఎన్నికల పరీక్షను ఎదుర్కొన్నారు.
ముళ్లబాటలో ముందుకు...
సాధారణంగా ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల తనయులకు రాజకీయాలు పూలబాటగా ఉంటాయి. వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా సాగింది. నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట కోసం ఆయన ముళ్లబాటలో ముందుకు సాగారు. జగన్ ఎదుర్కొన్నన్ని కష్టాలు, కుట్రలు దేశంలో మరే నేతకు ఎదురుకాలేదు. అక్రమ కేసులు, అరెస్టులకు వెరవకుండా, దుష్ప్రచారాలు, ఓటములకు బెదరకుండా ఆయన ధైర్యంగా ముందుకు సాగారు. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత అధికార కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌కు వ్యతిరేకంగా పలు కేసులు పెట్టి వేధించాయి. నిబంధనల ప్రకారం మూడు నెలల్లో రావాల్సిన బెయిల్‌ను 16 నెలల వరకు రాకుండా అడ్డుకున్నాయి. అనుకూల మీడియాలో దుçష్ప్రచారంతో జగన్ వ్యక్తిత్వ హననానికి కూడా తెగబడ్డాయి. మరొకరు అయితే బెంబేలెత్తిపోయి జీ హుజూర్ అంటూ అధికార పార్టీకి లొంగిపోయేవారు. వైఎస్ జగన్ మొక్కవోని మనోనిబ్బరంతో ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. 2014 ఎన్నికల్లో తృటిలో అధికారం దూరమైనా ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజల తరపున పోరాడారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుని వైఎస్సార్‌సీపీ లేకుండా చేయాలన్న కుట్రలను తట్టుకుని నిలబడ్డారు. పాదయాత్ర చేస్తున్న తనను అంతమొందించేందుకు ఏకంగా హత్యాయత్నానికి తెగబడ్డా జగన్ వెనుకంజ వేయలేదు. ఈ అన్యాయాలపై ప్రజా తీర్పు కోరారు.
విలువలకు కట్టుబడ్డ నాయకుడు..
వర్తమాన రాజకీయాల్లో వైఎస్ జగన్‌లా విలువలకు కట్టుబడ్డ నాయకుడు మరొకరు లేరన్నది వాస్తవం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి మెజార్టీ సాధించడం, గవర్నర్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేసి అధికారం దక్కించుకోవడం లాంటివి పలు రాష్ట్రాల్లో చూస్తున్నాం. వైఎస్ జగన్ అందుకు పూర్తి భిన్నంగా రాజకీయాల్లో విలువలకు కట్టుబడ్డారు. 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం అనంతరం దాదాపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుతూ సంతకాలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వద్దామని కొందరు ఆయనకు సూచించారు. అయితే తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చబోనని చెప్పి జగన్ విలువలకు కట్టుబడ్డారు.
విశ్వసనీయతే ప్రాణం
ప్రస్తుత రాజకీయాల్లో వైఎస్ జగన్ అంతటి విశ్వసనీయత ఉన్న నేత మరొకరు లేరని ఘంటాపథంగా చెప్పొచ్చు. అధికారం కోసం మోసపూరిత హామీలిచ్చే నేతలకు భిన్నంగా ఆయన విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తే అధికారంలోకి రావచ్చని కొందరు జగన్‌కు సూచించినా అసాధ్యమైన వాగ్దానాలు చేయబోనని తేల్చి చెప్పారు. చంద్రబాబు 640కిపైగా మోసపూరిత హామీలు ఇచ్చినా, తాను మాత్రం అధికారం దక్కకపోయినా పర్వాలేదుగానీ అసాధ్యమైన హామీలు ఇవ్వబోనంటూ విశ్వసనీయతకే జగన్ పెద్దపీట వేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతికి మార్గదర్శకంగా నిలిచేలా శాస్త్రీయంగా, సహేతుకంగా నవరత్నాల పథకాలకు రూపకల్పన చేసి వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న సామాన్య కార్యకర్తలకు ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చారు. విశ్వసనీయత కలిగిన జగన్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మారు కాబట్టే ఇంతటి ఘన విజయాన్ని అందించారు.
50 శాతం ఓట్లు...86 శాతం సీట్లు
ఈ ఎన్నికల్లో ఒంటిచేత్తో వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని సాధించిపెట్టిన వైఎస్ జగన్ దాదాపు 50 శాతం ఓట్లతో దేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించారు. ఏకంగా 86 శాతం సీట్లను వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడం విశేషం. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 151 సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 25 ఎంపీ స్థానాల్లో 22 చోట్ల ఘన విజయం సాధించింది. అతి తక్కువ మెజార్టీలతో పార్టీ ఓడిన మూడు ఎంపీ సీట్లలో కూడా రెండు స్థానాల్లో ఓట్ల లెక్కింపు వివాదాస్పదం కావడం గమనార్హం. 100కిపైగా అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రాల్లో ఓ పార్టీ 86 శాతం సీట్లను గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ 1994 ఎన్నికల్లో 68 శాతం సీట్లు గెలుచుకోవడం ఇప్పటివరకు రికార్డుగా ఉంది. దీన్ని బద్ధలుకొడుతూ వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఏకంగా 86 శాతం సీట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
పదవులకు రాజీనామా చేశాకే రావాలని షరతు
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టికెట్లపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించలేదు నలుగురు ఫిరాయింపుదారులకు చంద్రబాబు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కానీ జగన్ మాత్రం వైఎస్సార్ సీపీలో చేరే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేశాకే రావాలని ముందస్తు షరతు పెట్టడం విశేషం. నాడు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డితో ఆ పదవికి రాజీనామా చేయించిన తరువాతే వైఎస్సార్‌సీపీలో చేర్చుకున్నారు. టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తమ పదవులకు రాజీనామా చేశాకే వైఎస్సార్ సీపీలో చేరారు. అదీ రాజ్యాంగ విలువలపట్ల జగన్ నిబద్ధతకు నిదర్శనం. వైఎస్ జగన్ చేసిన చరిత్రాత్మక ప్రజా సంకల్ప పాదయాత్ర అయన రాజకీయ ప్రస్థానంలో మకుటాయమానంగా నిలిచింది. 14 నెలల పాటు 3,648 కి.మీ. మేర రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని ‘నేను విన్నాను...నేనున్నాను’ అని ధైర్యం చెప్పారు. 134 నియోజకవర్గాల మీదుగా 2,516 గ్రామాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల పరిధిలో సాగిన పాదయాత్రలో 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలలో జగన్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసి 78 సభల్లో పాల్గొన్నారు.
అత్యంత శక్తిమంతుడైన ప్రాంతీయ నేత
2019 ఎన్నికలు దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలకు నాంది పలికాయి. దేశంలో అత్యంత శక్తిమంతుడైన ప్రాంతీయ నేతగా వైఎస్ జగన్ ఆవిర్భవించారు. 17వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మొదటి రెండు స్థానాల్లో నిలవగా డీఎంకే మూడో స్థానంలో నిలిచింది. వైఎస్సార్‌సీపీ, తృణమూల్ కాంగ్రెస్ చెరో 22 ఎంపీ సీట్లు గెలిచి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాయి. అయితే లోక్‌సభ సభ్యులు, రాష్ట్రాల్లో అధికారం అనే కోణంలో చూస్తే ప్రాంతీయ పార్టీ నేతల్లో జగన్ అత్యంత శక్తిమంతుడైన నేత అనేది నిర్వివాదాంశం. డీఎంకే 23 ఎంపీ సీట్లు గెలిచి మూడో స్థానంలో నిలిచిప్పటికీ ఆ పార్టీ తమిళనాడులో అధికారంలో లేదు. వైఎస్సార్‌సీపీతో సమానంగా 22 ఎంపీ సీట్లను గెలుచుకున్న మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్నారు కానీ ఏపీలో వైఎస్సార్‌సీపీ ఒంటరిగా పోటీ చేసి ఏకంగా 86 శాతం ఎమ్మెల్యే సీట్లు గెలిచి అధికారం దక్కించుకుంది. మమతా బెనర్జీకి ఆ స్థాయిలో అక్కడి అసెంబ్లీలో బలం లేదు. బెంగాల్‌లో బీజేపీ ఏకంగా 18 ఎంపీ సీట్లు గెలుచుకుని బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించింది. కానీ ఏపీలో జగన్‌కు కనీసం పోటీ ఇచ్చే స్థితిలో కూడా ప్రత్యర్థి పార్టీలు లేకుండా పోయాయి. ఎన్నికల ఫలితాలతో టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. మరోవైపు వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మకంగా అటు బీజేపీవైపుగానీ ఇటు కాంగ్రెస్‌వైపు గానీ మొగ్గు చూపకుండా తటస్థ వైఖరి అవలంబించింది. దీంతో కేంద్రంతో అంశాలవారీగా సత్సంబంధాలు నెరుపుతూ జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించనుంది. అందువల్లే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ కంటే వైఎస్సార్ సీపీ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మాజీ సీఎంల తనయుల్లో ఒకే ఒక్కడు
రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల తనయుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తున్న తొలి వారసుడు వైఎస్ జగన్. అంతే కాదు దేశవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రుల తనయుల్లో వైఎస్ జగన్ మాదిరిగా విజయవంతమైన నేత మరొకరు లేరు. సొంతంగా పార్టీ స్థాపించి కుట్రలను చేధించి అపూర్వ ప్రజాదరణతో అధికారం దక్కించుకున్న ఏకైక నేత ఆయన ఒక్కరే. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎంల తనయులంతా అధిష్టానం కనుసన్నల్లోనే మెసలుతూ ఏదో ఒక పదవి వస్తే చాలని రాజకీయ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎంలు చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, పీవీ నరసింహారావు కుమారులతోపాటు ఇతర రాష్ట్రాల్లో మాధవరావు సింధియా, షీలా దీక్షిత్ తదితర నేతల వారసులది కూడా అదే పరిస్థితి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు కుమారులు ఎవరికీ ఆ పార్టీ సారథ్యం కూడా దక్కలేదు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణించిన తరువాత ఆయన కుమారుడు స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ తన తండ్రి స్థాపించిన సమాజ్‌వాదీ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. ఒడిశా మాజీ సీఎం బిజూ పట్నాయక్ కుమారుడు నవీన్ పట్నాయక్ మాత్రం తన తండ్రి పేరుతో బిజూ జనతాదళ్ స్థాపించి రెండు దశాబ్దాలుగా అప్రతిహతంగా సీఎంగా కొనసాగుతున్నారు. అయితే ఆయన రాజకీయ ప్రయాణం నల్లేరుపై నడకని పరిశీలకులు పేర్కొంటున్నారు. వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం వీరందరికీ భిన్నంగా అపూర్వ జనాదరణతో ముందుకు సాగుతోంది.