
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తిరుపతి వేదికగా పూరించిన సమర శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్ జగన్ ప్రసంగంతో కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. వేలాది మంది బూత్ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులతో సమర శంఖారావం సభ కిటకిటలాడింది. వచ్చే ఎన్నికల సమరాన్ని ఎదుర్కోవడానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడంలో ప్రతిపక్ష నేత సఫలీకృతమయ్యారు. ప్రజా సమస్యలపైనా, రాష్ట్ర ప్రయోజనాలపైనా వైఎస్ జగన్ చేసిన పోరాటాలు ఫలించాయని కార్యకర్తల కదన కుతూహలంతో స్పష్టమైంది. ప్రజా సమస్యలపైనే కాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా వైఎస్ జగన్ అంతర్లీనంగా ఎంత దృష్టి సారించారో వెల్లడైంది.
వేలాది మంది బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు, ముఖ్య కార్యకర్తలు, నేతలు హాజరైన సభను చూసినప్పుడు ప్రతి పల్లెలోనూ అధికార పార్టీ దాష్టీకాలకు ఎదురొడ్డి పోరాడే కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీకి లభించారని తేటతెల్లమైంది.
కార్యకర్తల్లోనే కాకుండా పార్టీ నేతల్లోనూ, ఎమ్మెల్యేల్లోనూ, ప్రజాప్రతినిధుల్లోనూ ఆత్మవిశ్వాసం అదే స్థాయిలో కనిపించింది. కీలక సమయాల్లో దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడుగా వైఎస్ జగన్ ఉండటం, ఆయన సై అంటే ముందుకు ఉరికే కార్యకర్తల బలం చూస్తే వచ్చే ఎన్నికలను అలవోకగా ఎదుర్కోగలమనే ధీమాను పలువురు సీనియర్ నాయకులు వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. అధికార పార్టీకి ఎప్పుడు గుణపాఠం చెబుదామా అని కార్యకర్తలు ఎదురుచూస్తున్నట్లుగా ఉందని సమర శంఖారావం సభ విజయవంతం అయిన తీరు చెప్పకనే చెప్పింది. తిరుపతిలో తొలి సమర శంఖారావం సభ భారీగా విజయవంతమైన నేపథ్యంలో ఇక నేడు వైఎస్సార్ జిల్లాలో కూడా అదే స్థాయిలో సభ జరుగుతుందని పార్టీ నేతలు అంటున్నారు.