
సాక్షి, అమరావతి : తిరుపతి ఎస్సీ రిజర్వుడు లోక్‌సభా స్థానం ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు పార్టీ అభ్యర్థి ఎంపిక బాధ్యతను వైఎస్సార్‌సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్‌కే అప్పగించారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పలువురు మంత్రులు, తిరుపతి లోక్‌సభా స్థానం పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అభ్యర్థి విషయంలో అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు. తిరుపతి అభ్యర్థి విషయంలో సీఎం ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకున్నారని, అందరం ఏకగ్రీవంగా సీఎంకే ఎంపిక బాధ్యతను అప్పగించామని తెలిపారు.
భారీ మెజారిటీతో గెలిపిస్తాం : కాకాణి
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ విస్తృత ప్రయోజనాలు, స్థానిక పరిస్థితులపై సీఎం జగన్‌కు పూర్తి అవగాహన ఉంది కనుక అభ్యర్థి ఎంపికపై నిర్ణయాన్ని ఆయనకే వదిలిపెట్టామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎవరిని ఖరారు చేసినా అందరమూ కలసికట్టుగా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. అభ్యర్థి ఎవరు? అనే ప్రస్తావనే సమావేశంలో రాలేదని వెల్లడించారు. తాము కేవలం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను సీఎంకు వివరించామన్నారు. గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తామని మాట ఇచ్చామన్నారు.
అభ్యర్థి విషయంలో సీఎం ఏరోజు నిర్ణయం తీసుకుంటే ఆరోజు నుంచే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగుతామని చెప్పారు. మీడియా సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కె.ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పి.అనిల్‌కుమార్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వి.వరప్రసాద్, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment