నిడమర్రు : పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)పై ప్రజా సంకల్పయాత్ర సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించిన తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. 2014 నుంచి ఉద్యోగుల జీవితాలను చీకటిమయం చేసిన ఈ సీపీఎస్‌ను అధికారంలో వస్తే రద్దు చేస్తామని ప్రజా సంకల్పయాత్ర తొలిరోజున జగన్ ఇచ్చిన హామీ సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 4వ తేదీన చిత్తూరులో జరిగిన ఎన్‌జీవోస్ సభలో సీపీఎస్ రద్దు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించడం ఉద్యోగుల పట్ల సీఎం చంద్రబాబు వైఖరి మరోసారి బహిర్గతమైందని వారంటున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దుతోపాటు, ఉద్యోగుల సొంత ఇంటి కల నెరవేర్చుతానని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని ప్రకటించడంతో వచ్చే ఎన్నికల్లో తమ కలలను సాకారం చేసే వారి వెంటే నడుస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెపుతున్నారు.
ఆందోళనను పట్టించుకోని బాబు
సీపీఎస్ విధానం రద్దు చెయ్యాలనే డిమాండ్‌తో ఇప్పటికే వివిధ స్థాయిల్లో ఆందోళనలు జరిగాయి. సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం కొనసాగించాలని జరుగుతున్న ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇటీవల స్పష్టమయ్యింది. ఈనెల 4న తిరుపతిలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సభలో సీఎం చంద్రబాబు మాటల్లో ఇది బహిర్గతం అయ్యింది. సీపీఎస్ రద్దు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదని, అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని సీఎం చెప్పడంపై సీపీఎస్ ఉద్యోగులు విరుచుకుపడుతున్నారు. సీపీఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేస్తున్నా సీపీఎస్ రద్దుపై చంద్రబాబు తప్పించుకునే తీరును ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి.
ఉద్యోగి భవిష్యత్ స్టాక్ మార్కెట్‌లో
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కి ప్రతి ఉద్యోగి, తన బేసిక్ పే, డీఏలలో పదిశాతం చొప్పున ప్రతి నెలా జమ చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం మరో పది శాతం జమ చేస్తుంది. ఈ సొమ్ము మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడతారు. స్టాక్ మార్కెట్‌లో వచ్చే లాభనష్టాల మీద ఆధారపడి, రిటైరైన తర్వాత ఆ ఉద్యోగికి పెన్షన్‌గా చెల్లిస్తారు. పాత పెన్షన్ విధానంలో మాదిరి ఈ సీపీఎస్‌లో నిర్ణీత మొత్తంలో పెన్షన్ వస్తుందన్న గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్‌లు దెబ్బతింటే, వచ్చే పెన్షన్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అసలేమి రాకపోవచ్చు. ఈ కారణం చేతే ఉద్యోగ సంఘాలు సీపీఎస్‌ను వ్యతిరేకిస్తున్నాయి.
ఉద్యోగుల పోరాటాన్ని జగన్ గుర్తించారు
అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ ప్రటించడంతో 12 ఏళ్లుగా ఉద్యోగులు చేస్తున్న పోరాటం ప్రతిపక్ష నేతగా జగన్ గుర్తించినట్లు అయింది. ఇది మాకు ఆనందంగా ఉంది. సీపీఎస్ రద్దు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెట్టేయడం బాధాకరం
– వీరవల్ల వెంకటేశ్వరరావు, అధ్యక్షులు, ఏపీసీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్
సీపీఎస్ రద్దు చేసేవారి వెంటే ఉంటాం
సీపీఎస్ రద్దు చేసి, పాతపింఛన్ అమలు చెయ్యాలని ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. జగన్ ప్రకటనతో సీపీఎస్ రద్దు ఆశలకు ఉపిరి ఊదినట్లయింది. సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి చేసేవారి వెంటే ఉద్యోగులుంటారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా 5 ఏళ్లు చేసినవారికి జీవిత పెన్షన్ ఉంటే 30 ఏళ్లు సుదీర్ఘ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగికి సీపీఎస్‌తో పెన్షన్ బదులు టెన్షన్ మిగులుతుంది.
– వేమవరపు ఏడుకొండలు, జిల్లా ఉపాధ్యక్షులు ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్
సీపీఎస్‌పై పోరాటం ఫలించింది
సీపీఎస్ రద్దుపై చేస్తున్న పోరాటం జగన్ హామీతో ఫలించింది. ఉద్యోగి దాచుకున్న సొమ్మును షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టడం వల్ల ఉద్యోగి జీవితం గాలిలో దీపంగా మారుతుంది. సీపీఎస్ రద్దు విధానం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని కేంద్రం ప్రకటించినా... ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరం.
– రావూరి లక్ష్మి, సీపీఎస్ ఉద్యోగి, ఏలూరు
ఉద్యోగుల పక్షపాతిగా జగన్ హామీలు
ప్రజా సంకల్పయాత్ర తొలిరోజే ఉద్యోగుల పక్షపాతిగా జగన్ మాట్లాడటం హర్షణీయం. సీపీఎస్ రద్దుతోపాటు, ప్రభుత్వ ఉద్యోగి సొంత ఇంటి కల, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యడం వంటి అంశాలపై ప్రతిపక్ష నేతగా జగన్ అవగాహనతో మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు సూచనల ప్రకారం అనేక దేశాల్లో సీపీఎస్ విధానం అమలు చేసినా విఫలమైంది.
– జెడ్డం సుధీర్, జిల్లా అధ్యక్షులు, ఏపీవైఎస్సార్‌టీఎఫ్
ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు
జగన్ సీపీఎస్ విధానం రద్దు చేస్తామనగానే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపినట్ల యింది. 30 ఏళ్లపాటు సేవలందించిన ఉద్యోగికి ఏమాత్రం భరోసా ఇవ్వని సీపీఎస్ రద్దు చెయ్యడం సాహసోపేత నిర్ణయం. పాత పెన్షన్ విధానంతోనే వారి భవిష్యత్‌కు భరోసా ఉంటుంది.
– గుంపుల వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు, బహుజన టీచర్స్ అసోసియేషన్
జగన్ నిర్ణయంతో ఉద్యోగుల్లో హర్షం
జగన్ అధికారంలోకి వస్తే ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పడం ఆహ్వానించదగ్గ అంశం. రెండేళ్లుగా సీపీఎస్ రద్దు చెయ్యాలని అనేక పోరాటాలు చేస్తునే ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం తీవ్రతరం అవుతున్న తరుణంలో జగన్ హామీ ఉద్యోగుల సమస్యలు జాతీయ స్థాయి నేతలను ఆలోచింపచేసేలా ఉంది.
–ఉషా దీప్తి, జిల్లా అధ్యక్షురాలు,
మహిళా విభాగం ఏపీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment