
సాక్షి, హైదరాబాద్: వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని.. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
ఈ తెలుగు సంవత్సరంలో సకాలంలో వానలు పడి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పాడిపంటలతో రైతులు వర్ధిల్లాలని, పల్లెలు కళకళలాడాలని సకల వృత్తులూ పరిఢవిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా అభివృద్ధి ఫలాలను మెండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి ఎనలేని జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని అభిలషించారు.
ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకునే సమయంలో ప్రచార సభలతో ఇబ్బంది పెట్టరాదన్న ఉద్దేశంతో రేపు(ఏప్రిల్ 6న) వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రచారానికి విరామం ప్రకటించారు. అమరావతిలోని స్వగృహంలో వైఎస్ జగన్ ఉగాది పండుగను జరుపుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment