కొండంత భరోసా
అందరికీ అండగా ఉంటాం
గొట్టుముక్కల గ్రామంలో వైఎస్ జగన్ పర్యటన
హత్యకు గురైన ఉపసర్పంచి కృష్ణారావు కుటుంబానికి ఓదార్పు
వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపిన అధినాయకుడు
నందిగామ : కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ ఉపసర్పంచి కృష్ణారావు హత్యానంతరం.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహ న్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపారు. బుధవారం ఆయన కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి వచ్చారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అధికార పార్టీ ఆగడాలు సాగిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజాపోరాటాల ద్వారా ఎండగడతామని హెచ్చరించారు. బహిరంగ వేదికల నుంచి అసెంబ్లీ వరకు ప్రతిచోట టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలపై పోరు సాగిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అన్నివిధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. అక్కడ్నుంచి రోడ్డుమార్గాన గొట్టుముక్కల గ్రామం చేరుకున్నారు.
ఎస్సీ కాలనీలో పలువురు యువతులు, మహిళలు వైఎస్ జగన్‌కు రాఖీలు కట్టారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అనంతరం ఆయన గత ఆదివారం రాత్రి హత్యకు గురైన ఆలోకం కృష్ణారావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఉదయం 10.20 గంటల నుంచి 11.50 వరకు అక్కడే గడిపి కుటుంబసభ్యులందరినీ పేరుపేరునా పలకరించి మాట్లాడారు. అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. తొలుత కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణారావు భార్య ముత్తమ్మతో మాట్లాడారు. ఆమెతోపాటు కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తెలు నాగమణి, పాపాయమ్మ హత్య జరిగిన తీరును, గ్రామంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. ఆయన అంతా విని అక్కడినుంచే డీజీపీకి ఫోన్ చేసి టీడీపీ కేడర్ ఆగడాలపై ఫిర్యాదు చేసి హతుడు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అక్కడ్నుంచి బయల్దేరి టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ధైర్యం కోల్పోవద్దని, పార్టీ కేడర్‌కు అండగా నిలవాలని అక్కారావుకు చెప్పారు. పార్టీ నేతలు కొడాలి నాని, కొలుసు పార్థసారథి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఏ సమస్య వచ్చినా వారికి తెలియజేయాలని సూచించారు.
హత్య కేసులో దోషులతో పాటు హత్యను ప్రేరిపించిన కుట్రదారులను గుర్తించి అరెస్టు చేసే వరకు పోరాటం చేయాలని పార్టీ ముఖ్యులను ఆదేశించారు. అక్కడ్నుంచి పయనమైన వైఎస్ జగన్ కంచికచర్ల, నందిగామ మీదుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని షేర్‌మహ్మద్‌పేట గ్రామం సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలతో కొంతసేపు మాట్లాడి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లారు.
అధినేత వెంట..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు కొడాలి నాని (గుడివాడ), ఉప్పులేటి కల్పన (పామర్రు), రక్షణనిధి (తిరువూరు), మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి, నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు (నందిగామ), పేర్ని నాని (మచిలీపట్నం), పి.గౌతమ్‌రెడ్డి (విజయవాడ సెంట్రల్), దుట్టా రామచంద్రరావు (గన్నవరం), పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, బండి జానకిరామారావు, కోటేరు ముత్తారెడ్డి, కోట బుచ్చయ్యచౌదరి, నెలకుదిటి శివనాగేశ్వరరావు, పాటిబండ్ల హరిజగన్నాథరావు, కోవెలమూడి వెంకటనారాయణ, బొగ్గవరపు శ్రీశైలవాసుతోపాటు మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. ఆధైర్యపడాల్సిన పని లేదు.. ఏ ఒక్కరికి కష్టమొచ్చినా మేం చూస్తూ ఊరుకోం.. ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది.. పార్టీకి పట్టుకొమ్మలైన కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుని అండగా నిలుస్తాం.. - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి