వైఎస్సార్ సీపీ నాయకుడి దారుణ హత్య
కృష్ణా జిల్లా గొట్టుముక్కలలో టీడీపీ శ్రేణుల కిరాతకం
అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి రాళ్లు, కర్రలతో దాడులు
పోలీసులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేదు
నందిగామ/కంచికచర్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గొట్టుముక్కల ఉప సర్పంచిని టీడీపీ శ్రేణులు రాజకీయ కక్షతో పాశవికంగా పొట్టనబెట్టుకున్నాయి. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డ ముష్కరమూకలు ఆటవికంగా హత్య కు పాల్పడ్డాయి. మరో నేత ఇంటిపైనా దాడులకు దిగాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది.
మంత్రి అండతోనే దాడులు!
గొట్టుముక్కలకు చెందిన ఆలోకం కృష్ణారావు(55) వైఎస్సార్ సీపీలో చురుకైన నేతగా వ్యవహరిస్తున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన గ్రామ ఉప సర్పంచిగా ఎన్నికయ్యారు. వివాద రహితుడిగా పేరున్న ఆయన ఎదుగుదలను చూడలేక దాడి చేసేందుకు టీడీపీ నాయకులు పథకం వేశారు. తద్వారా వైఎస్సార్ సీపీ శ్రేణులను భయాందోళనలకు గురి చేయాలని నిర్ణయించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణారావు ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో టీడీపీ నాయకులు దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి కృష్ణారావును రోడ్డుపైకి లాక్కొచ్చి తీవ్రంగా హింసించారు. చేతులు వెనక్కి విరిచేసి కర్రలు, రాళ్లతో దాడి చేయటంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కృష్ణారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఎంపీటీసీ మాజీ సభ్యుడి ఇంటిపైనా దాడి
కృష్ణారావును హత్యచేసిన అనంతరం అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గుదె అక్కారావు ఇంటిపై కూడా దాడికి దిగారు. ‘కృష్ణారావును చంపేశాం. నిన్ను కూడా చంపుతాం. బయటికి రా..’ అని కేకలు వేశారు. ఆయన బయటకు రాకపోవడంతో ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఫోన్ చేసినా.. పోలీసులు రాలేదు!
తన తండ్రిని ఆరుగురు కలిసి హత్య చేశారని కృష్ణారావు కుమారుడు శ్రీనివాసరావు సోమవారం కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిలో త్రివిక్రమరావు(త్రివి), కంచా రమేష్‌బాబు, పాతూరు వెంకటేశ్వరరావు, సామినేని గోపి, చాగంటి రమేష్, చింతల కోటేశ్వరరావు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నాయకులు దాడులకు దిగిన సమయంలో కంచికచర్ల పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని, వారు స్పందించి ఉంటే తన తండ్రి బతికేవాడని ఎస్పీ విజయ్‌కుమార్ ఎదుట శ్రీనివాసరావు విలపించాడు.
వైఎస్సార్ సీపీ నాయకులు రాస్తారోకో
టీడీపీ అకృత్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో కృష్ణారావు మృతదేహాన్ని జాతీయ రహదారిపైకి తరలించి రాస్తారోకో చేశారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదన్నారు.