Gottumukkala
-
కొండంత భరోసా
అందరికీ అండగా ఉంటాం గొట్టుముక్కల గ్రామంలో వైఎస్ జగన్ పర్యటన హత్యకు గురైన ఉపసర్పంచి కృష్ణారావు కుటుంబానికి ఓదార్పు వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపిన అధినాయకుడు నందిగామ : కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ ఉపసర్పంచి కృష్ణారావు హత్యానంతరం.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహ న్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపారు. బుధవారం ఆయన కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి వచ్చారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అధికార పార్టీ ఆగడాలు సాగిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజాపోరాటాల ద్వారా ఎండగడతామని హెచ్చరించారు. బహిరంగ వేదికల నుంచి అసెంబ్లీ వరకు ప్రతిచోట టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలపై పోరు సాగిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అన్నివిధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. అక్కడ్నుంచి రోడ్డుమార్గాన గొట్టుముక్కల గ్రామం చేరుకున్నారు. ఎస్సీ కాలనీలో పలువురు యువతులు, మహిళలు వైఎస్ జగన్‌కు రాఖీలు కట్టారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అనంతరం ఆయన గత ఆదివారం రాత్రి హత్యకు గురైన ఆలోకం కృష్ణారావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఉదయం 10.20 గంటల నుంచి 11.50 వరకు అక్కడే గడిపి కుటుంబసభ్యులందరినీ పేరుపేరునా పలకరించి మాట్లాడారు. అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. తొలుత కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణారావు భార్య ముత్తమ్మతో మాట్లాడారు. ఆమెతోపాటు కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తెలు నాగమణి, పాపాయమ్మ హత్య జరిగిన తీరును, గ్రామంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని జగన్మోహన్రెడ్డికి వివరించారు. ఆయన అంతా విని అక్కడినుంచే డీజీపీకి ఫోన్ చేసి టీడీపీ కేడర్ ఆగడాలపై ఫిర్యాదు చేసి హతుడు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అక్కడ్నుంచి బయల్దేరి టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ధైర్యం కోల్పోవద్దని, పార్టీ కేడర్‌కు అండగా నిలవాలని అక్కారావుకు చెప్పారు. పార్టీ నేతలు కొడాలి నాని, కొలుసు పార్థసారథి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఏ సమస్య వచ్చినా వారికి తెలియజేయాలని సూచించారు. హత్య కేసులో దోషులతో పాటు హత్యను ప్రేరిపించిన కుట్రదారులను గుర్తించి అరెస్టు చేసే వరకు పోరాటం చేయాలని పార్టీ ముఖ్యులను ఆదేశించారు. అక్కడ్నుంచి పయనమైన వైఎస్ జగన్ కంచికచర్ల, నందిగామ మీదుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని షేర్‌మహ్మద్‌పేట గ్రామం సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలతో కొంతసేపు మాట్లాడి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లారు. అధినేత వెంట.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు కొడాలి నాని (గుడివాడ), ఉప్పులేటి కల్పన (పామర్రు), రక్షణనిధి (తిరువూరు), మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి, నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు (నందిగామ), పేర్ని నాని (మచిలీపట్నం), పి.గౌతమ్‌రెడ్డి (విజయవాడ సెంట్రల్), దుట్టా రామచంద్రరావు (గన్నవరం), పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, బండి జానకిరామారావు, కోటేరు ముత్తారెడ్డి, కోట బుచ్చయ్యచౌదరి, నెలకుదిటి శివనాగేశ్వరరావు, పాటిబండ్ల హరిజగన్నాథరావు, కోవెలమూడి వెంకటనారాయణ, బొగ్గవరపు శ్రీశైలవాసుతోపాటు మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. ఆధైర్యపడాల్సిన పని లేదు.. ఏ ఒక్కరికి కష్టమొచ్చినా మేం చూస్తూ ఊరుకోం.. ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది.. పార్టీకి పట్టుకొమ్మలైన కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుని అండగా నిలుస్తాం.. - వైఎస్ జగన్మోహన్రెడ్డి -
వైసీపీ నేత హత్య కేసులో నిందితుల అరెస్టు
కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గ్రామ ఉప సర్పంచి ఆలోకం కృష్ణారావు హత్య కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కంచికచర్ల రూరల్ సీఐ ఎం.రామ్‌కుమార్ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను మీడియాకు వెల్లడించారు. కృష్ణారావును హత్య చేసేందుకు, అక్కారావు ఇంటిపై దాడి చేసేందుకు అదే గ్రామానికి చెందిన చాగంటి సీతారామయ్య రూ.2 వేలు ఆర్థిక సాయం చేసి ప్రోత్సహించారని చెప్పారు. ఆ డబ్బుతో మద్యం తాగిన నిందితులు, ఆదివారం ఉదయం నుంచి గ్రామంలో యర్రంరెడ్డి సీతయ్య దంపతులతో పాటు గుదే సెల్వరాజు, తాటుకూరి సావిత్రిపై దాడులకు పాల్పడి గాయపరిచారని తెలిపారు. రాత్రి 12 గంటల సమయంలో నిందితులు వడ్డె త్రివిక్రమ్‌రావు, కంచె రమేష్‌బాబు, పాతూరి వెంకటేశ్వరరావు, సామినేని గోపి, చాగంటి రాజేష్, చింతల కోటేశ్వరరావులు కలిసి కృష్ణారావును హత్య చేసినట్లు తెలిపారు. నిందితులు నందిగామ బస్టాండ్‌లో ఉండగా ఈనెల 12న అరెస్టు చేశామన్నారు. హత్య కేసుకు సంబంధించి వారిని నందిగామ కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. కానీ, నిందితులు మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపై దాడిచేసిన కేసును ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. -
నేడు గొట్టుముక్కలకు వైఎస్ జగన్
-
నేడు గొట్టుముక్కలకు వైఎస్ జగన్
విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో ఆదివారం రాత్రి హత్యకు గురైన వైఎస్సార్ సీపీ నేత అలోకం కృష్ణారావు కుటుం బాన్ని పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఆ గ్రామానికి వెళుతున్నారు. జగన్ హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి ఉదయం 9 గంటలకు గన్నవరం చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా గొట్టుముక్కల గ్రామానికి వెళ్తారని పార్టీ ప్రోగాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తెలిపారు. కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగుపయనమవుతారని చెప్పారు. -
వైఎస్సార్ సీపీ నాయకుడి దారుణ హత్య
కృష్ణా జిల్లా గొట్టుముక్కలలో టీడీపీ శ్రేణుల కిరాతకం అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి రాళ్లు, కర్రలతో దాడులు పోలీసులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేదు నందిగామ/కంచికచర్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గొట్టుముక్కల ఉప సర్పంచిని టీడీపీ శ్రేణులు రాజకీయ కక్షతో పాశవికంగా పొట్టనబెట్టుకున్నాయి. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డ ముష్కరమూకలు ఆటవికంగా హత్య కు పాల్పడ్డాయి. మరో నేత ఇంటిపైనా దాడులకు దిగాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. మంత్రి అండతోనే దాడులు! గొట్టుముక్కలకు చెందిన ఆలోకం కృష్ణారావు(55) వైఎస్సార్ సీపీలో చురుకైన నేతగా వ్యవహరిస్తున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన గ్రామ ఉప సర్పంచిగా ఎన్నికయ్యారు. వివాద రహితుడిగా పేరున్న ఆయన ఎదుగుదలను చూడలేక దాడి చేసేందుకు టీడీపీ నాయకులు పథకం వేశారు. తద్వారా వైఎస్సార్ సీపీ శ్రేణులను భయాందోళనలకు గురి చేయాలని నిర్ణయించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణారావు ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో టీడీపీ నాయకులు దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి కృష్ణారావును రోడ్డుపైకి లాక్కొచ్చి తీవ్రంగా హింసించారు. చేతులు వెనక్కి విరిచేసి కర్రలు, రాళ్లతో దాడి చేయటంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కృష్ణారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడి ఇంటిపైనా దాడి కృష్ణారావును హత్యచేసిన అనంతరం అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గుదె అక్కారావు ఇంటిపై కూడా దాడికి దిగారు. ‘కృష్ణారావును చంపేశాం. నిన్ను కూడా చంపుతాం. బయటికి రా..’ అని కేకలు వేశారు. ఆయన బయటకు రాకపోవడంతో ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఫోన్ చేసినా.. పోలీసులు రాలేదు! తన తండ్రిని ఆరుగురు కలిసి హత్య చేశారని కృష్ణారావు కుమారుడు శ్రీనివాసరావు సోమవారం కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిలో త్రివిక్రమరావు(త్రివి), కంచా రమేష్‌బాబు, పాతూరు వెంకటేశ్వరరావు, సామినేని గోపి, చాగంటి రమేష్, చింతల కోటేశ్వరరావు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నాయకులు దాడులకు దిగిన సమయంలో కంచికచర్ల పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని, వారు స్పందించి ఉంటే తన తండ్రి బతికేవాడని ఎస్పీ విజయ్‌కుమార్ ఎదుట శ్రీనివాసరావు విలపించాడు. వైఎస్సార్ సీపీ నాయకులు రాస్తారోకో టీడీపీ అకృత్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో కృష్ణారావు మృతదేహాన్ని జాతీయ రహదారిపైకి తరలించి రాస్తారోకో చేశారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదన్నారు.