20 వేలకు పైగా వైఎస్సార్‌ జనతా బజార్లు | YS Jaganmohan Reddy key decision to set up YSR Janata Bazaars | Sakshi
Sakshi News home page

20 వేలకు పైగా వైఎస్సార్‌ జనతా బజార్లు

Published Tue, Apr 14 2020 4:03 AM | Last Updated on Tue, Apr 14 2020 11:34 AM

YS Jaganmohan Reddy key decision to set up YSR Janata Bazaars - Sakshi

వైఎస్సార్‌ జనతా బజార్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో రైతుజార్లను, మార్కెట్లను వికేంద్రీకరించాం. ప్రతి నిత్యావసర వస్తువును దాదాపు ప్రతిగడప వద్దకూ చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మనకు పెద్ద ఎత్తున మార్కెట్‌ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ లొకేషన్లను కూడా గుర్తించి ఆ మేరకు అక్కడ కూడా జనతా బజార్లు వచ్చేలా చూడాలి. మొత్తంగా మ్యాపింగ్‌ చేయాలి.

వైఎస్సార్‌ జనతా బజార్ల ద్వారా రైతులకు మార్కెటింగ్‌ పరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. లాభ, నష్టాలు లేని రీతిలో నిర్వహిస్తే.. ప్రజలకు తక్కువ ధరల్లో నిత్యావసరాలు లభిస్తాయి. ఇదే జనతా బజార్లలో చేపలు, రొయ్యల్లాంటి ఆక్వా ఉత్పత్తులు కూడా అమ్ముడుపోతాయి.  
 – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో 20 వేలకు పైగా వైఎస్సార్‌ జనతా బజార్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఇవి అతి పెద్ద స్థానిక మార్కెట్లుగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ జనతా బజార్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్‌ చైన్, ప్రాసెసింగ్‌ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగానే అటు రైతులు, ఇటు ప్రజలకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉండేలా జనతా బజార్లకు రూపకల్పన చేశామని చెప్పారు. వీటి నిర్వహణ బాధ్యత  స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం సలహాలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి.

జనతా బజార్లతో అతి పెద్ద నెట్‌వర్క్‌
► రాష్ట్రంలో 11 వేలకు పైగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వైఎస్సార్‌ జనతా బజార్లను ఏర్పాటు చేయాలి. వార్డు సచివాలయాల పక్కన కూడా జనతా బజార్లు రావాలి. మండల కేంద్రాల్లో పెద్ద స్థాయిలో జనతా బజార్లను ఏర్పాటు చేయాలి.
► దాదాపు 20 వేల జనతా బజార్లతో పెద్ద నెట్‌వర్క్‌ ఏర్పడుతుంది. ఈ బజార్లలో శీతలీకరణ యంత్రాలు పెట్టాలి. పాలు, పళ్లు, కూరగాయలు తదితరాలను నిల్వ చేసి విక్రయానికి అందుబాటులో పెట్టాలి.
► వీటి వద్ద చిన్నసైజు ట్రక్కులు లేదా పికప్‌ వ్యాన్స్‌ కూడా పెట్టాలి. ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ట్రక్కు ఉండాలి. ప్రతి రోజూ జనతా బజార్లకు కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు లాంటి సరుకులు తీసుకురావడానికి ఇవి ఉపయోగపడతాయి. మరోవైపు రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు అమ్ముకునే సరుకులను గోదాములకు లేదా దగ్గర్లో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు తరలించేందుకూ ఉపయోగపడతాయి.
మార్కెట్లో జోక్యానికి అవకాశం
► జనతా బజార్ల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలి. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలి. రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే ప్రక్రియలో ఈ ప్రయత్నం మేలు చేస్తుంది. మార్కెట్లో జోక్యం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తద్వారా, రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుంది. తద్వారా గ్రామాల స్వరూపాలు మారిపోతాయి.
► ప్రతి గ్రామంలో గోడౌన్లు ఉండే దిశగా అడుగులు వేయాలి. తద్వారా గ్రామాల్లో గొప్ప మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు అవుతుంది. 
► ఈ ప్రాజెక్టును అధికారులు ఓనర్‌ షిప్‌ తీసుకుని సమిష్టిగా పనిచేసి విజయవంతం అయ్యేలా చూడాలి. వైఎస్సార్‌ జనతా బజార్ల ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ అధికారిని నియమిస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement