విపత్తు నేపథ్యంలో ప్రజలకు ఏదైనా సరే ఇచ్చే కోణంలోనే అధికారులు ఆలోచించాలి. పేద ప్రజల గురించి మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఎవరైనా రేషన్ అడిగితే.. వారికి ఇబ్బంది ఉందని గ్రహించి వెంటనే పరిశీలించి రేషన్ ఇచ్చేలా చూడాలి.
ఇప్పటి వరకు నిర్వహించిన ఇంటింటి సర్వే ద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, బీపీ, ఆస్తమా, షుగర్‌తో బాధ పడుతున్న వారిపై దృష్టి పెట్టాలి. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారందరికీ ముందుగా పరీక్షలు చేయించాలి.
నిత్యావసర వస్తువుల ధరలపై పర్యవేక్షణ కొనసాగాలి. ప్రతి దుకాణం వద్ద తప్పనిసరిగా ప్రకటించిన ధరలతో బోర్డులు పెట్టాలి. ఆ బోర్డుల్లో పేర్కొన్న ధరలకన్నా ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి.
రేషన్ తీసుకునే వారందరికీ వెయ్యి రూపాయల సహాయం కూడా అందేలా చూడాలి. ప్రస్తుతం కార్డులు లేకుండా రేషన్ అడుగుతున్న వారితో దరఖాస్తు చేయించాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ సోకిన వారికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇందుకోసం ఎయిమ్స్ వైద్యులతోనూ మాట్లాడాలని సూచించారు. కుటుంబ సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు గుర్తించిన వారందరికీ పరీక్షలు నిర్వహించాల్సిందేనని పునరుద్ఘాటించారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యలు, కుటుంబ సర్వే, ఆక్సిజన్ సరఫరా, లాక్ డౌన్ నేపథ్యంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, నిత్యావసర సరుకుల అందుబాటు, ధరలు.. తదితర అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలు, సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి.
వైద్యంపై మరింత దృష్టి
► కరోనా వైరస్ బాధితులందరికీ మంచి వైద్యం అందాలి. ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడాలి. వివిధ దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ వైద్య విధానాలపై దృష్టి పెట్టాలి.
► ఎన్–95 మాస్క్‌లు రాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యేలా ప్రయత్నాలు మొదలు పెట్టాలి. సంబంధిత పరిశ్రమల వారితో మాట్లాడి ఇక్కడే ఉత్పత్తి అయ్యేలా చూడాలి. క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో పారిశుధ్య సమస్యలు ఉండకూడదు.
► అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కోవిడ్ పేషెంట్ల కోసం కనీసం 400 బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలి.
వ్యవసాయం పరిస్థితి ఇదీ..
► రబీలో భాగంగా పండించిన ప్రాంతాల్లో సగం మేర నూర్పిడి పూర్తి. ధరల పరంగా ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ఉద్యానవన ఉత్పత్తులు బయటి రాష్ట్రాలకు వెళ్తున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ల సమయాన్ని పెంచాలి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
► ప్రభుత్వం ఆలోచిస్తున్న జనతా బజార్లకు ఒక ముందస్తు సన్నాహకంగా అరటిని స్థానిక మార్కెట్లకు సరఫరా చేయడం కొనసాగించాలి. ఇదే సమయంలో మరింత ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలి.
► ఎక్కడెక్కడ మార్కెటింగ్‌కు అవకాశం ఉందనే దానిపై మ్యాపింగ్ చేయాలి. బయటి రాష్ట్రాలకు చేపల రవాణా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి.
► రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చికెన్, గుడ్లు, చేపల విక్రయం కోసం భౌతిక దూరం పాటించేలా ఒక వ్యూహాన్ని సిద్ధం చేయాలి.
► పశ్చిమ బెంగాల్, అసోం, బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో వ్యవసాయ మార్కెట్‌లను తెరిపించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. అమెరికా, యూరోప్ లాంటి దేశాలకు రొయ్యలు ఎగుమతయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలి.
► రోజుకు 1,100 నుంచి 1,200 వరకు పరీక్షలు చేయిస్తున్నామని, ఆక్సిజన్ సరఫరాకు లోటు లేకుండా చూస్తున్నామని, ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటున్నామని వైద్యులు సీఎంకు వివరించారు. రోజుకు 10 వేల చొప్పున పీపీఈలను రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment