
'ఉదయించే సూర్యుడు' వస్తున్నాడు!
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. 484 రోజులుగా ఆ కుటుంబం పడ్డ వేదన తీరింది. వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి.
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. 484 రోజులుగా ఆ కుటుంబం పడ్డ వేదన తీరింది. వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. 16 నెలలుగా నిద్రలేని రాత్రులు గడిపిన ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఒక్కగానొక్క తనయుడి కోసం తల్లడిల్లుతున్న కన్నపేగుకు స్వాంతన లభించింది. భర్త కోసం భార్య చేసిన ప్రార్థనలు ఫలించాయి. నాన్నప్రేమ కోసం పరితపిస్తున్న పిల్లల ఆనందం అంబరమంటింది. అన్న రాకకై ఎదురుచూస్తున్న చెల్లికి కొండంత ధైర్యం వచ్చింది. ధర్మం గెలిచింది. న్యాయం పలికింది.
హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ న్యాయస్థానం జగన్‌కు బెయిల్ మంజూరు చేసింది. క్విడ్ ప్రో కో కేసులో ప్రత్యేక న్యాయస్థానం జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. బెయిల్‌పై సీబీఐ అభ్యంతరాలను తోసిపుచ్చారు. ఆస్తుల కేసులో జగన్‌కు బెయిల్ లభించింది. శంకర్రావుతో పాటు టిడిపి నేతలు ఆశ్రయించడంతో ఆగస్టు 2011లో దర్యాప్తునకు ఆదేశించింది హైకోర్టు. దీనిపై పది అంశాలపై దర్యాప్తు చేసిన సిబిఐ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు 73 మందిని నిందితులుగా చేర్చింది.
ఈ కేసులో సాధారణానికి భిన్నంగా.. ఏకంగా పది ఛార్జ్‌షీట్‌లు నమోదు చేసింది. వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేస్తూ.. దర్యాప్తును సాగదీస్తూ జగన్ ఆరుసార్లు చేసిన బెయిల్ ప్రయత్నాలను అడ్డుకుంది సిబిఐ. దీనిపై జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది మేలో దర్యాప్తుకు గడువు విధించింది. నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ తన దర్యాప్తును ముగించామంటూ సోమవారం సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. పదింట ఎనిమిది అంశాల్లో ఎలాంటి క్విడ్‌ప్రోకోకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. సండూర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్, పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, సరస్వతి పవర్&ఇండస్ట్రీస్, మంత్రి డెవలపర్స్‌లలో క్విడ్‌ప్రోకోకు ఎలాంటి ఆధారాలు వెల్లడించింది. దీంతో పాటు 16 కోల్‌కతా కంపెనీలకు సంబంధించి ఈడీ, ఐటీ మాత్రం దర్యాప్తు చేస్తున్నాయని తెలిపింది.
ఉదయం సిబిఐ దాఖలు చేసిన మెమో అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం నాంపల్లిలోని సిబిఐ కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. తీవ్ర ఉత్కంఠ మధ్య.. అందరూ ఎదురుచూస్తుండగా.. సిబిఐ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరం విడిచి వెళ్లొద్దని, రెండు లక్షల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు అందజేయాలని సూచించింది. సాక్షులుగా ఉన్నవారితో మాట్లాడొద్దని, పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని సూచించింది.
బెయిల్ మంజూరయిన విషయం తెలియగానే రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. మరోవైపు ష్యూరిటీల ప్రక్రియ మంగళవారం పూర్తికానుంది. మంగళవారం బెయిల్ ప్రక్రియ పూర్తయి జగన్ విడుదల అవుతారు. జననేత రాక కోసం అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎదురుచేస్తున్నాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉదయించే సూర్యుడని ఆయనను ఎవరూ ఆపలేరంటూ సంబరాలు జరుపుకున్నారు.