
అదే జగన్.. అదే ఉత్సాహం
అందరిలోనూ ఒక్కటే ఉత్కంఠ... అంతటా ఒకే ఉద్విగ్నిత... వేలాదిగా జనప్రభంజనం... వేర్వేరు ప్రాంతాలు... వేర్వేరు వర్గాలు... అయినా అందరిలోనూ ఒకేఒక్క ఉత్సాహపూరిత భావన...
* రెండు చేతులు జోడిస్తూ.. అభివాదం చేస్తూ..
* అమ్మలను చేరదీస్తూ.. చిన్నారులను ముద్దాడుతూ..
సాక్షి, హైదరాబాద్: అందరిలోనూ ఒక్కటే ఉత్కంఠ... అంతటా ఒకే ఉద్విగ్నిత... వేలాదిగా జనప్రభంజనం... వేర్వేరు ప్రాంతాలు... వేర్వేరు వర్గాలు... అయినా అందరిలోనూ ఒకేఒక్క ఉత్సాహపూరిత భావన... సుదీర్ఘ నిరీక్షణ తరువాత తమ అభిమాన నేతను ఎప్పుడెప్పుడు చూస్తామా...! అన్న ఆతృత. ఆ క్షణాలు రానే వచ్చాయి. దాదాపు 16 నెలల తర్వాత... మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల 55 నిమిషాలకు వారి నిరీక్షణ ఫలించింది.
ఒకే ఒక్కడుగా... అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలునుంచి జనం మధ్యకు వచ్చారు. ఆయన రాకతో ఒక్కసారిగా అక్కడున్న వారి మది ఒక్కసారిగా పులకరించింది. ఉత్సాహం ఉరకలెత్తింది. కేరింతలతో తమను తాము మరిచిపోయారు. తన కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న లక్షలాది జనం, తనపై ఎన్నో ఆశలు పెంచుకున్న కోట్లాది ప్రజలను మనసారా పలకరించేందుకు జగన్ కూడా చెదరని చిరునవ్వులతో వారి మధ్యలోకి వచ్చారు.
గతంలో ఓదార్పు యాత్ర సందర్భంగా ఆయనలో ఎంతటి ఉత్సాహం, ఆదరణ, అభిమానం కనిపించాయో ఇప్పుడవి ఆయనలో అంతకు రెట్టింపుగా ప్రతిఫలించాయి. అప్పటిమాదిరిగానే అందరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకొన్నారు. మార్గమధ్యంలో వీలున్న చోటల్లా వాహనం దిగి అక్కలు, అవ్వలను పలకరించారు. చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు.
భద్రతా సిబ్బంది ఎంతగా తోసినప్పటికీ ఒక ప్రవాహంలా మీద పడుతున్నా... అభిమానులను.. వాహనంపైపైకి తోసుకొస్తున్నా... అందరినీ ఆయన నవ్వుతూ పలకరించారు. తన వాహనం డోరును సగభాగం తెరిచి, ఫుట్ బోర్డుపై నిలబడి అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. తోపులాట జరుగుతుంటే పడిపోతారంటూ పలుచోట్ల అభిమానులను వారించారు. జగన్‌లో కించిత్ మార్పు కూడా రాలేదనీ, అవే పలకరింపులు, నవ్వుతూ అదే పలకరింపులు, అదే ఓపిక, సహనం, అన్నీ కలగలిపి 2010లో ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడున్న ఆత్మస్థైర్యంతోనే ఉన్నారని జనమంతా అనుకోవడం వినిపించింది.
20 కిలోమీటర్ల పాటు రోడ్డు పొడవునా వేలాది మంది జనానికి, మేడలు మిద్దెలపై నుంచి తనను చూసేందుకు ఉత్సాహంగా బారులు తీరిన వారికి చేతులూపుతూ జగన్ ముందుకు సాగారు. ఆద్యంతం 2010 ఏప్రిల్ 9న ఓదార్పు యాత్రను ప్రారంభించి 300 రోజులకు పైగా కొనసాగించినప్పుడు వెల్లువెత్తిన ఆప్యాయత, ప్రేమాభిమానాలే దారిపొడవునా పునరావృతమయ్యాయి.