
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఒకడిగా, వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమానిగా తాను సోమవారం ఉదయం 7 గంటలకు తిరుపతి తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తిరుత్తణి వరకు పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు.
తిరుపతిలో ఆదివారం చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను చేపట్టిన పాదయాత్ర తిరుత్తణి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం వరకు సుమారు 100 కిలోమీటర్లు సాగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ప్రారంభ కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలియజేస్తారన్నారు. జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని, యాత్రకు ఎలాంటి ఆటంకాలూ ఎదురవకుండా తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.