అనంత గుండెల్లో రాజన్న  | YS Rajasekhara Reddy Death Anniversary Special Story In Anantapur | Sakshi
Sakshi News home page

అనంత గుండెల్లో రాజన్న 

Published Mon, Sep 2 2019 9:33 AM | Last Updated on Mon, Sep 2 2019 9:35 AM

YS Rajasekhara Reddy Death Anniversary Special Story In Anantapur - Sakshi

అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. నిరుపేదలకు ఉన్నత చదువులు... పేదోడికి చిన్న జబ్బు చేసినా ఆదుకునే ఆరోగ్యశ్రీ...కరువు సీమలో పారుతున్న కృష్ణా జలాలు...పంటపోయినా రైతు కుంగిపోకుండా ఆదుకునే పంటల బీమా...అన్నీ ఆయన చలువే. ఆ మహానేత పాలనలోనే. అందుకే రాజన్నను  ‘అనంత’ జనం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. వైఎస్సార్‌ భౌతికంగా దూరమై దశాబ్దమవుతున్నా...‘అనంత’ అభివృద్ధి జ్ఞాపకంగా నిత్యం ఆయన వెలుగొందుతూనే ఉన్నారు.  వైఎస్సార్‌ ..... ఈ పిలుపు తెలుగువారి గుండెల చప్పుడు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే  దార్శనీకుడుగా. రాజన్న అనే పిలుపునకు సార్థకత చేకూర్చిన వాడు. రైతు, పేదల పక్షపాతిగా పేరొందిన మహనీయుడు. అక్కాచెల్లెమ్మలకు ఆసరా ఇచ్చిన అనుంగు సోదరుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతోమంది నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూతనిచ్చి, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి దోహదపడిన మహోన్నతుడు. ముస్లిం, మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపిన రారాజు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎందరికో ప్రాణభిక్ష పెట్టిన ప్రాణదాత. ఇవి మచ్చుకు మాత్రమే! రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలో అన్నీ అడగకముందే అందించిన సుపరిపాలకుడు వైఎస్‌ రాజశేఖరుడు. అలాంటి మహానేత, పేదల గుండెల చప్పుడు అయిన రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై పదేళ్లు గడిచినా.. నేటికీ ఆయన మనమధ్యే ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఆయన జ్ఞాపకాలు చెరిగిపోలేదు. నేడు వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మననం చేసుకుంటూ..

తాడిపత్రిపై రాజన్న ముద్ర...
తాడిపత్రి పట్టణంలో అభివృద్ధి జరిగిందంటే అది మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే అన్నది అక్షర సత్యం. పట్టణంలోని మున్సిపల్‌వార్డుల్లో ప్రతి వీధిలో సీసీ రోడ్లు నిర్మించారు. జాతీయ రహదారిని తలపించేలా సీబీ రోడ్డును నిర్మించారు. సుమారు రూ. 38 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించారు. అలాగే పీఎబీఆర్‌ స్టేజ్‌–2 కింద తాడిపత్రి నియోజకవర్గంలోని 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలన్న లక్ష్యంతో చాగల్లు ప్రాజెక్ట్‌ నిర్మించారు. పెద్ద పప్పూరు మండలం చాగల్లు గ్రామం వద్ద పెన్నానదిపై రూ.244 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. పెద్దపప్పూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లోని 18,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా పెండేకల్లు ప్రాజెక్ట్‌ను నిర్మించారు. పెద్దవడుగూరు, యాడికి, పెద్దపప్పూరు.తాడిపత్రి మండలాల పరిధిలోని 38 గ్రామాలకు లబ్ధి చేకూరేలా రూ.190 కోట్ల వ్యయంతో యాడికి కాలువ పనులకు 2005, మార్చి 20న డాక్టర్‌ వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారు. సుమారు 50వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అన్నింటా అగ్రస్థానం
వైఎస్సార్‌ హయాంలో మడకశిర నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. జిల్లాలోనే పూర్తిగా వెనుకబడిన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ఘనత వైఎస్సార్‌దే. నియోజకవర్గాన్ని విద్యాకేంద్రంగా మార్చారు.  మడకశిరలో వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల, వ్యవసాయ, హార్టికల్చర్, వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏర్పాటు చేశారు. అమరాపురం, గుడిబండ మండలాలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మంజూరు చేశారు. నియోజకవర్గంలో పూర్తిగా అట్టడుగున ఉన్న వక్కలిగ, సాదర, వీరశైవ కులాల వారిని బీసీలుగా గుర్తించి ఆదుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మడకశిర నియోజకవర్గానికి 40 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేసి పేదలను ఆదుకున్నారు. ఇందుకు గాను దాదాపు రెండు వేల ఎకరాలను సేకరించిన ఘనత వైఎస్సార్‌దే. ఎలాంటి సాగునీటి పథకాలు లేని నియోజకవర్గానికి హంద్రీనీవా పథకంలో భాగంగా మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ను మంజూరు చేశారు. ఫ్లోరైడ్‌ రహిత తాగునీటిని అందించాలని లక్ష్యంతో పీఏబీఆర్‌ నుంచి రూ.600కోట్లతో పీఏబీఆర్‌ (శ్రీరామరెడ్డి తాగునీటి పథకం) తాగునీటి పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చారు. దాదాపు 250 గ్రామాల దాహార్తిని తీర్చారు. 2004కు ముందు నియోజకవర్గంలో ఏ గ్రామానికి రోడ్లు లేవు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి గ్రామానికి తారురోడ్లు వేయించారు. 50వేల రేషన్‌కార్డులను, 35వేల మంది వృద్దులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లను మంజూరు చేశారు. నియోజకవర్గంలో పాడిపరిశ్రమను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు.

వైఎస్సార్‌ హయాంలోనిది.. 
ఇక్కడ మీరు చూస్తున్న ఈ మామిడితోట ఇందిర జలప్రభ పథకం కింద మహానేత వైఎస్సార్‌ హయాంలోనిది. కుందుర్పి మండలం జంబుగుంపల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన ఐదుగురు రైతులను ఓ గ్రూపుగా ఏర్పాటు చేసి ఉచితంగా బోరుబావులు తవ్వించి, విద్యుత్‌ సౌకర్యం, బిందు సేద్యం పరికరాలు, పండ్లమొక్కలు అందజేశారు. నాడు ఆ రైతులు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలసాయాన్ని అందిస్తున్నాయి.

ప్రతి నీటి బిందువులోనూ వైఎస్సార్‌
రాయదుర్గం ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, తెలుసుకున్న మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో పథకాలు చేపట్టి, వారి కన్నీళ్ళు తుడిచేందుకు నిరంతరం శ్రమించారు. రాయదుర్గం పట్టణానికి తాగునీటిని అందించే వైఎస్సార్‌ తాగునీటి పథకాన్ని రూ.48 కోట్లతో పూర్తి చేశారు. కణేకల్లు వద్ద సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటుకు 168 ఎకరాలు భూసేకరణ చేసి, ట్యాంకు నిర్మించారు. హెచ్చెల్సీ నీటిని ట్యాంకులోకి ఎత్తిపోతల ద్వారా నింపి, అక్కడి నుండి రాయదుర్గం వరకు పైపులైను ద్వారా అందిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల అనంతరం మరో రూ.4 కోట్ల నిధులు వెచ్చించి ఈ పథకాన్ని మరింత అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దుర్గం ప్రజలు తాగే ప్రతి నీటి బిందువులోనూ మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని చూసుకుంటున్నారు.

ఉరవకొండలో వైఎస్సార్‌ మానస పుత్రిక
కరువు పీడిత అనంత జిల్లాను కృష్ణా జలాలతో సశ్యశామలం చేయాలన్న మహోన్నత లక్ష్యంతో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి హోదాలో 2005, ఏప్రిల్‌ 24న ఉరవకొండలో పైలాన్‌ ఆవిష్కరించారు. హంద్రీ–నీవా మొదటి దశలో 1.18లక్షల ఎకరాలు, రెండో దశలో 2.27లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా జీడిపల్లి వద్ద రూ.100 కోట్లతో 2005లో రిజర్వాయర్‌ను పూర్తి చేశారు. వైఎస్‌ మానస పుత్రికగా విరాజిల్లుతున్న ఈ రిజర్వాయర్‌కు ఎనిమిదేళ్లుగా కృష్ణా జలాలు చేరుతున్నాయి. తాగు, సాగునీటి అవసరాలు తీర్చి జలప్రదాతగా జిల్లా రైతుల గుండెల్లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారు.

రైతునేస్తం ‘వైఎస్‌’
హైటెక్‌ పాలన అంటూ ట్రిక్కులు చేసి వ్యవసాయ రంగాన్ని పెను సంక్షోభంలోకి నెట్టిన చంద్రబాబు పాలనను ఇప్పటికీ రైతులు మరచిపోలేరు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల పల్లెసీమలు చిన్నాభిన్నమై రైతుల ఆర్థిక పరిస్థితులు దయనీయంగా మారిపోయాయి. గ్రామసీమలు భరోసా కోసం ఎదురుచూశాయి. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండుకళ్లుగా చేసుకుని సువర్ణపాలన కొనసాగించారు. అందులోనూ వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్ద పీట వేసి రైతు పక్షపాతిగా మారారు. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయరంగం గట్టెక్కేలా రాయితీలు, ప్రోత్సాహాలతో రైతులను భుజం తట్టి ప్రోత్సహించారు.

వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించి అన్నదాత గుండెల్లో గూడుకట్టుకున్న నేతగా స్థానం సంపాదించుకున్నారు.  కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైన పాడి, పశుసంవర్ధక, పట్టు, ఏపీఎంఐపీ, ఉద్యానశాఖలకు వైఎస్సార్‌ పెద్దపీట వేశారు. దీంతో ప్రత్యామ్నాయ వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, పేదలు కూడా సమస్యల నుంచి గట్టెక్కారు.  పశుక్రాంతి, జీవక్రాంతి లాంటి ప్రజాకర్షక పథకాలకు శ్రీకారం చుట్టారు. క్షీరవిప్లవం కోసం హర్యానా, గుజరాత్, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల నుంచి మేలు జాతి పశువులు, గేదెలు రాయితీతో రైతులకు అందజేశారు. అందుకోసం రూ.25 కోట్లు రాయితీ వర్తింపజేసి 8 వేల సంఖ్యలో పాడి పశువులు అందజేశారు. ఈ క్రమంలో రైతు ఇంట పాలవెల్లువ కనిపించింది. అప్పట్లో ప్రభుత్వ డెయిరీకి రోజుకు 50 నుంచి 60 వేల లీటర్లు పాలు వచ్చాయంటే ప్రోత్సాహం ఎలా ఉందనేది తెలుస్తుంది. 

అనంత గుండెల్లో రాజన్న 
దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాలో కరువు దెబ్బకు ఏటా రైతులు పంటనష్టపోవడం, ఆత్మహత్యలకు పాల్పడడాన్ని వైఎస్‌ గమనించారు. ఈ క్రమంలో 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాగు, సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూనే జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. తుంగభద్ర జలాల్లో 10 టీఎంసీలు కేసీకెనాల్‌ (కర్నూలు–కడప కాలవ)కు అందాలి. ఏళ్ల తరబడి ఈ నీళ్లు కేసీకి అందేవి. పది టీఎంసీలు తన సొంత జిల్లా కడపకు కాదని ‘అనంత’ తాగు, సాగునీటి అవసరాలకు రివర్స్‌ డైవర్షన్‌ పద్ధతిలో పీఏబీఆర్‌కు కేటాయిస్తూ  2005 ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ‘అనంత’ ప్రజల దాహార్తి శాశ్వతంగా తీరింది. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ. 67 కోట్లతో ముద్దలాపురం వద్ద అనంత తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారు.

హంద్రీ–నీవాతో సాగునీరు.. 
మొత్తం 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 310 గ్రామాల్లోని 33 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.6,850 కోట్లతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని రూపొందించారు.  వైఎస్‌ హయాంలో రూ.4,054 కోట్లను ఖర్చు చేశారు.

పారిశ్రామిక ప్రగతే లక్ష్యం... 
వ్యవసాయరంగానికి దీటుగా పారిశ్రామికరంగం అభివృద్ధిపై వైఎస్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే  రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఒడిస్సీ సంస్థతో సైన్సు సిటీ స్థాపనకు ఒప్పందం చేసుకున్నారు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం తీరుతో సైన్సు సిటీ ఏర్పాటు ఒప్పందాన్ని ఒడిస్సీ సంస్థ రద్దు చేసుకుంది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌లో బీడీఎల్‌(భారత్‌ దైనిక్స్‌ లిమిటెడ్‌), హెచ్‌ఏఎల్‌(హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌), ఈసీఐఎల్‌(ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌), బీహెచ్‌ఈఎల్‌(భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌) వంటి ప్రభుత్వరంగ సంస్థలతోపాటూ పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చాయి. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌లో పరిశ్రమలకు నీరు అందించేందుకు సోమశిల బ్యాక్‌వాటర్‌ నుంచి పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. 25శాతం ఈ పనులు కూడా పూర్తయ్యాయి. తర్వాతి ప్రభుత్వాలు లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ భూముల ఒప్పందాలను రద్దు చేశాయి.

వైఎస్‌ ఆశయాలు కొనసాగిస్తాం..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిరస్మరణీయుడు. ఆయన పరిపాలన కాలం సువర్ణయుగం. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన అందరిలోనూ గొప్ప వ్యక్తిత్వం కల్గిన మానవతావాది వైఎస్‌. ప్రజల కోసం పనిచేసిన మహనీయుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీతో పేదల కుటుంబాల్లో వెలుగులు నింపారు. హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చిన రైతు బాంధవుడు. ఆయన ఆశయాలు కొనసాగించేందుకు ప్రభుత్వం పని చేస్తోంది. 
– మాలగుండ్ల శంకరనారాయణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి 

బీమాతో భరోసా 
1995–2003 మధ్య చంద్రబాబు హయాంలో మండలం యూనిట్‌గా అమలవుతున్న వేరుశనగ పంటల బీమా పథకాన్ని మార్పు చేసి గ్రామం యూనిట్‌గా అమలు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు పారదర్శకంగా పరిహారం ఇచ్చారు. 2004 నుంచి 2009 వరకు ఖరీఫ్‌లో దెబ్బతిన్న వేరుశనగ పంటకు ఏకంగా రూ.1116 కోట్లు పరిహారం ఇచ్చారు. 2008లో తీవ్ర వర్షాభావంతో 80 శాతం మేర పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 4.64 లక్షల మంది రైతులు తమ వాటా కింద రూ.32 కోట్లు ప్రీమియం కట్టారు. గ్రామం యూనిట్‌గా బీమా పథకం కింద 4.59 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.620 కోట్లు పరిహారం అందజేశారు.

‘రాజన్న’జ్ఞాపకం
కదిరి నియోజకవర్గ అభివృద్దికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలు మరువలేనివి. ఆయన ప్రవేశ పెట్టిన  సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది లభ్ది పొందారు.  

  •  కదిరి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు  రూ.100 కోట్లతో శాశ్వత మంచినీటి పథకాన్ని ప్రవేశ పెట్టారు.  
  • కదిరిలో రూ 7.40 కోట్లతో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేశారు.  
  • రూ. 50లక్షల వ్యయంతో కదిరిలో ఎంపీడీఓ కార్యాలయం నిర్మించారు.  
  • కదిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కదిరి రూరల్‌ మండలం చెర్లోపల్లి వద్ద హంద్రీ–నీవా రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశారు. 
  • తనకల్లులో రూ. 1.20 కోట్లు వెచ్చించి 30 పడకల ఆస్పత్రిని నిర్మించారు. 
  • సీజీ ప్రాజెక్ట్‌ సమీపంలో రూ. 3 కోట్లతో ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను నిర్మించారు. 
  • నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. 
  • గ్రామీణ ప్రాంత వాసుల దాహం తీర్చేం దుకు రూ. 8 కోట్లు మంజూరు చేశారు. 
  • నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ 33–కేవీ సబ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసి రైతులకు లో ఓల్టేజీ సమస్య లేకుండా చేశారు. 
  • నియోజకవర్గంలోని ప్రతి మండలానికి కస్తూరిబా పాఠశాలలు మంజూరు చేశారు. 
  • గాండ్లపెంట మండలంలో తెగిపోయిన కొండారెడ్డి చెరువుకు మరమ్మతులు చే యించారు. 
  • కదిరిలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం అభివృద్ది కోసం రూ 10 కోట్లు మంజూరు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement