జలయజ్ఞ ప్రదాత వైఎస్సార్‌ | YS Rajasekhara Reddy Death Anniversary Special Story In Mahabubnagar | Sakshi
Sakshi News home page

జలయజ్ఞ ప్రదాత వైఎస్సార్‌

Published Mon, Sep 2 2019 12:02 PM | Last Updated on Mon, Sep 2 2019 12:03 PM

YS Rajasekhara Reddy Death Anniversary Special Story In Mahabubnagar - Sakshi

ఎన్నో సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసి.. కేఎల్‌ఐతో వ్యవసాయాన్ని పండుగ చేసి.. ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాపై చెరగని ముద్రవేశారు. రైతే రాజు అని నమ్మి.. శ్రీశైలం మిగులు నీటిని ఎత్తిపోసేందుకు జలయజ్ఞం పేరుతో కేఎల్‌ఐని చేపట్టి.. సాగునీటిని తీసుకొచ్చిన జలయజ్ఞ ప్రధాతగా ప్రజల గుండెల్లో నిలిచారు వైఎస్సార్‌. సోమవారం ఆ మహానేత వర్ధంతి సందర్భంగా ఆయన హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలైన సంక్షేమ పథకాలపై ప్రత్యేక కథనాలు.. 

వైఎస్సార్‌ హయాంలో తీసుకువచ్చిన అభివృద్ధి పథకాలు నేటికీ పేద, బడుగు బలహీన వ ర్గాల ప్రజలుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్యశ్రీ, 108, 104 ఆరోగ్య సేవలతో పాటు వృద్ధులు, వితంతువుల సామాజిక భద్రతకోసం పెన్షన్‌లు అందించారు. ఉచిత వి ద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, అభయహస్తం, జలయజ్ఞం, ఫీజు రీయంబర్స్‌మెంట్, భూపంపిణీ, మహిళలకు పావళా వడ్డీకే బ్యాం కు రుణాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేదలపాలిట వరంలా మారాయి. ఏదో ఒక రూ పంలో ప్రతి ఒక్కరికీ ఆయన తీసుకువచ్చిన ప థకాలు లబ్ధిని చేకూర్చాయి. నేడు ఆయన ప్రజ ల మద్యలో లేకపోయినా వారి మదిలో చిరస్థాయిగా నిలిచేలా పథకాలను రూపొందించారాయన.  

నడిగడ్డ అభివృద్ధికి నాంది పలికిన వైఎస్సార్‌
అలంపూర్‌: దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాలన నడిగడ్డ అభివృద్ధికి నాంది పలికింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సస్యశ్యామలం చేయడానికి కృషి చేశారు. సువర్ణయుగంగా రాజన్న పాలన ఏళ్లు గడిచిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయింది. ఆయన పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వైఎస్సార్‌ పాలనలో ఆయన అందించిన వరాలు గద్వాల, అలంపూర్‌ అభివృద్ధికి నాంది పలికాయి. జిల్లాను సందర్శించిన ప్రతిసారి వరాలు కురిపిస్తూ అభివృద్ధికి ఆయన తోడ్పాటును అందించారు. అత్యధికంగా అలంపూర్‌కు మూడు సార్లు పర్యటించారు. 

నెట్టంపాడుకు రూ.1,448 కోట్లు 
జిల్లాలో అతి పెద్ద సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్‌ బీజం వేశారు. నెట్టంపాడుతో ఆరు మండలాలకు సాగునీటి వసతి కల్పించారు. రూ.1448 కోట్ల వ్యయంతో నెట్టంపాడు ప్రాజెక్టును నిర్మించారు. నెట్టంపాడుతో గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గంలోని 1.5 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించడానికి కృషి చేశారు. అదేవిధంగా ఏడు రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు పీజేపీదిగువన 234 మెగా వాట్ల సామార్ధ్యంతో జెన్‌కో జల విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఆర్డీఎస్‌కు ఆదరణ 
ఉమ్మడి జిల్లాలోనే తొలి ప్రాజెక్టుకు వైఎస్సార్‌ హాయంలో ఆదరణ లభించింది. ఆర్డీఎస్‌ అలంపూర్‌ ప్రజలకు జీవనాడి. 87,500 ఎకరాలకు సాగు నీటిని అందించాల్సిన ఆర్డీఎస్‌ ఆధునీకరణకు ముందుకు వచ్చారు. కాలువల లైనింగ్, హెడ్‌వర్క్స్‌ వద్ద పూడికతీత, డిస్టిబ్యూటరీల నిర్మాణాలు చేపట్టడానికి అప్పట్లో రూ.112 కోట్లు కేటాయించారు. అలాగే, అలంపూర్‌–ర్యాలంపాడు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నదిలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు చేశారు. 

కేఎల్‌ఐతో నీటిని అందించిన అపర భగీరథుడు
కందనూలు జిల్లాలో మరో భారీ నీటిపారుదల పథకం ‘మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల’ పథకాన్ని ముఖ్య మంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి 2005లో జలయజ్ఞంలో భాగంగా కొల్లాపూర్‌ మండలం ఎల్లూర్‌ గ్రామ పంచాయితీ రేగుమాన్‌ గడ్డ ప్రాంతంలో పనులు ప్రారంభించారు.  శ్రీశైలం మిగులు జలాలను 3.40లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 25టీఎంసీల నీటి కెటాయింపు చేస్తూ రూ.2,990కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. మొదట నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి ప్రాంతాలకు మాత్రమే నీళ్లు ఇచ్చేలా డిజైన్‌ చేసినా వనపర్తి ప్రాంతానికి కూడా సాగునీటిని అందించేలా  పథకాన్ని రూపకల్పన చేశారు. 99శాతం పనులు పూర్తిచేసి మొదటి లిఫ్టు పంపుల ద్వారా సాగునీటిని ఆయన హయాంలోనే అందించారు. అనుకోని సంఘటన నేపధ్యంలో సెప్టెంబర్‌–2న అకాల మరణం పొందారు. వైఎస్సార్‌ హయాంలో చేపట్టిన ఫీజు రీయింబర్స్‌ మెంట్‌తో ఎంతోమంది పేద విద్యార్థులు లబ్ధిపొందారు. ఇంజనీరింగ్, మెడిసిన్‌తోపాటు మరెన్నో ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

రామన్‌పాడు జలాలు.. వైఎస్సార్‌ చలువే
జడ్చర్ల: పట్టణానికి రామన్‌పాడు జలాలను తరలించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చలువేనని పేర్కొనవచ్చు. తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న నియోజకవర్గ ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు వైఎస్సార్‌ ప్రతిష్టాత్మక రామన్‌పాడ్‌ తాగునీటి పథకాన్ని చేపట్టారు.  పట్టణ ప్రజలతోపాటు బాలానగర్, నవాబ్‌పేట మండలాల్లోని దాదాపు 103 గ్రామాల ప్రజలకు ఈ తాగు నీటి పథకం అందించేందుకు వైఎస్‌ఆర్‌ కృషి చేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2008 ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారనిమిత్తం జడ్చర్లకు విచ్చేసిన సీఎం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లురవిని గెలిపిస్తే జడ్చర్ల తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ పిలుపు మేరకు అప్పట్లో కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ మల్లురవిని ప్రజలు భారీ మెజార్టితో గెలిపించారు.

దీంతో మడమ తిప్పని మహానేత వైఎస్సార్‌ తాను ఇచ్చిన హామీ మేరకు జడ్చర్లకు రామన్‌పాడ్‌ జలాలను తరలించేందుకు వెంటనే రూ.55 కోట్లు మంజూరు చేశారు. అంతేగాక ఆయా పనులకు 13 ఫిబ్రవరి 2009న శంకుస్థాపన కూడా చేశారు.అనంతరం పనులు కొనసాగి ప్రజల దాహార్తి తీరింది. అలాగే, జిల్లాలో మరెక్కడా లేని విధంగా అన్ని హంగులతో సరికొత్త సాంకేతిక విజ్ఞానంతో కోట్ల రూపాయలను వెచ్చించి సువిశాలమైన మైదానంలో ప్రత్యేకంగా నిర్మించిన పత్తి మార్కెట్‌ యార్డును నాటి సీఎం వైఎస్‌ఆర్‌చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకుంది. అంతేగాక, గతంలో రూ.5.50కిలో ఉన్న రేషన్‌ బియ్యం ధరని వైఎస్సార్‌ తమ పాలనలో తగ్గించారు. రూ.2కిలో బియ్యం పథకాన్ని జడ్చర్లలోనే ప్రారంభించిన ఘనత చోటుచేసుకుంది.

కొల్లాపూర్‌లో వరుస పర్యటనలు
నియోజకవర్గంలో మొదటిసారిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేత హోదాలో 1995లో పర్యటించారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక  ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్‌ కొల్లాపూర్‌ ప్రాంతానికి వచ్చారు. ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,995కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదోసారి కొల్లాపూర్‌లో పర్యటించారు.

జనం యాదిలో చెరగని జ్ఞాపకాలు
వనపర్తి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు పనిచేసి ఒంటిచేత్తో పార్టీని మళ్లీ గెలిపించి తన ఆకాంక్షలను పూర్తిస్థాయిలో నెరవేర్చి పేదవాడి కంట కన్నీరు తుడవాలనుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని నేటికి పేద ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పలు పలు పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. తన ఐదేళ్ల పాలనలో వనపర్తితో వైఎస్సార్‌కు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 104 సర్వీస్‌లను, మహిళలకు పావలావడ్డీ రుణ పథకాలను వనపర్తి నుంచే వైఎస్సార్‌ ప్రారంభించడం విశేషం.

అలాగే మురికి వాడల అభ్యున్నతికి  కోట్లాది రూపాయాలు నిధులు విడుదల చేసి పట్టణమంతా వాటిని తిరిగి ప్రారంభించారు. ఉచిత విద్యుత్, విద్యుత్‌ బకాయిల మాఫీ, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ముస్లీం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు అర్ధవంతమైన పింఛన్‌లు అందించి ఆయన అందరి మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రుల పాలనను ప్రజలు చూశారు. అందులో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పరిపాలించిన ఐదేళ్ల మూడు నెలల పాలన మాత్రం ఎందరో జీవితాలను ప్రభావి తం చేసింది. గడపగడపకు వైఎస్సార్‌ సంక్షేమ పథకాల ద్వారా ఏదోరకమైన ప్రయోజనం చేకురింది. దీంతో వైఎస్‌ను తమ ఇంట్లో సభ్యుడిగా భావించి అభిమానాన్ని పెంచుకున్నారు.

దళితవాడలో పర్యటన
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి వననర్తి దళితవాడల్లో పర్యటించిన చరిత్ర లేదు. అలాంటిది వైఎస్సార్‌ ప్రత్యేకంగా దళితుల బస్తీలో పర్యటించి వారితో సదరాగా కలిపి మాట్లాడిన సంఘటనలు ఈ ప్రాంత దళితులు నేటికి గుర్తు చేసుకుంటున్నారు. చిన్నారులను ఎత్తుకొని లాలించిన  సంఘటనలు ఉన్నాయి.

గొప్ప వ్యక్తి వైఎస్సార్‌..
ఆరోగ్యశ్రీ, పింఛన్, మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా.. ప్రజలు మెచ్చిన పాలన అందించిన గొప్ప వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి. ఎందరో నిరుపేద మైనార్టీ వర్గాలు ఉన్నత చదువులు చదివేందుకు ఉపయోగపడ్డాడు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోశ్రీ పథకంతోనే ఎందరికో లక్షలాది రూపాయాల శస్త్రచికిత్సాలు చేయించుకున్నారు.  వెఎస్సార్‌ ఎప్పుడు వనపర్తికి వచ్చిన ఆయనకు భోజ నం వడ్డించే అవకాశం రావడం జీవితంలో మరచిపోలేను.          
– సయ్యద్‌ అఖ్తర్, కాంగ్రెస్‌ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి, వనపర్తి

మహానేతను 15 సార్లు కలిశా..
మహబూబ్‌నగర్‌ క్రీడలు: 2004 నుంచి 2009 వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని 15 సార్లు కలిశా. చివరి సారి కొంత ఆలస్యమైనందుకు ఏం..మాస్టర్‌! కరాటేను బాగా నేర్పుతున్నావా లేదా అంటూ ఉత్సాహ పరచిన తీరు నా జీవితంలో మరుపురాని మధుర స్మృతి. సీఎం స్థాయిలో ఉండి కూడా నన్ను గుర్తు పట్టి పలకరించాడాన్ని చూసి వెంట వచ్చిన పలువురు ఆశ్చర్య పోయారు. అప్పటి నుంచి ఆయనకు ఫిదా అయ్యాను. 
– ఎతినె చెన్నయ్య, టీఎస్‌ స్కూల్‌ కరాటే స్పోర్ట్స్‌ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement