వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిలమ్మ, మాజీ ఎంపీలు అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజద్‌బాషా తదితరులు
సాక్షి, కడప : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని నివాళి అర్పించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ను మరువలేక..అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ అనుక్షణం తలుచుకుంటూనే ఉన్నామంటూ స్మరించుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలతోపాటు చిత్రపటాల వద్ద నివాళులర్పించిన అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్‌ను అడుగడుగునా తలుచుకుంటూ అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు సామాజిక సేవల్లో భాగంగా ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనాథ శరణాలయాల్లో అన్నదానం, వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.
వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యుల నివాళి
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్ సతీమణి, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ భారతమ్మ, బ్రదర్ అనిల్‌కుమార్, సాక్షి గ్రూపు సంస్థల చైర్ పర్సన్ వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ సోదరి విమలమ్మ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, సుధీకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి తదితరులు నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనను స్మరించుకునే సమయంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురి కావడంతో నిశ్శబ్ద వాతావరణం చోటుచేసుకుంది.
కడపలో సేవా కార్యక్రమాలు
జిల్లా కేంద్రమైన కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాయి. పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బండి నిత్యానందరెడ్డి, మాసాపేటలో జహీర్ ఏర్పాటు చేపిన అన్నదాన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, మేయర్ పాలుపంచుకున్నారు. కోటిరెడ్డిసర్కిల్ వద్ద వైఎస్సార్ చిత్రపటం వద్ద విద్యార్థి సంఘం నాయకుడు ఖాజా రహమతుల్లా, యువజన విభాగం అధ్యక్షుడు చల్లా రాజశేఖర్‌ల ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టారు.
పులివెందులలో రక్తదాన శిబిరం, దుస్తుల పంపిణీ
పులివెందులలో భాకరాపురంలో ఉన్న వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా సమన్వయకర్త, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైద్యుల విభాగం నాయకులు వైఎస్ అభిషేక్‌రెడ్డి పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సౌజన్యంతో దివ్యాంగులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొని అందజేశారు. పులివెందులలో అన్ని వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలతో పార్టీ శ్రేణులు నివాళులర్పించాయి.
ప్రొద్దుటూరులో ..
ప్రొద్దుటూరులోని పెన్నానగర్‌లో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రాష్ట్రానికి చేసిన మేలు గురించి కొనియాడారు. వైఎస్సార్ సర్కిల్‌లో ఉన్న దివంగత సీఎం విగ్రహానికి కూడా రాచమల్లు పాలాభిషేకం చేశారు.
రాయచోటిలో..
రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కమలాపురంలో అన్నదానం
కమలాపురం నియోజకవర్గంలోని అన్నిచోట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదానాలు, పాలాభిషేకాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కమలాపురంలోని అనాథ ఛాత్రాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో విగ్రహానికి ఎమ్మెల్యే, సమన్వయకర్తలు పాలాభిషేకం, పూలమాలతో నివాళులర్పించారు.
రైల్వేకోడూరులో..
రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు టోల్‌గేటు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకున్నారు.
రాజంపేటలో..
రాజంపేట మన్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదానం, ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాజంపేటలో వైఎస్సార్ విగ్రహాలకు రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజంపేట పార్లమెంటరీ బీసీ కన్వీనర్ పసుపులేటి సుధాకర్ ఏరియా ఆస్పత్రిలో పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఆకేపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు.
జమ్మలమడుగు, బద్వేలులో..
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్యల ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ, అన్నదానం, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. జమ్మలమడుగులోని క్యాంబెల్, ప్రభుత్వ ఆస్పత్రిల్లో పండ్లు పంపిణీ చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి డాక్టర్ సుధీర్‌రెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. పోరుమామిళ్ల, బద్వేలులో డాక్టర్ వెంకట సుబ్బయ్య రక్తదాన, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment