ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం పొందిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు.
కాకినాడ :ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం పొందిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రం కాకినాడతోపాటు పలు నియోజకవర్గాల్లో వైఎస్ విగ్రహాలవద్ద నివాళులర్పించి, సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ, పలుచోట్ల అన్న, వస్త్రదానాలవంటి కార్యక్రమాల నిర్వహణకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
వైఎస్ స్ఫూర్తిని, ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కాకినాడలో జయంతి వేడుకలకు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌లో మహానేత వైఎస్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలకు హాజరవుతారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితోపాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించాలని జ్యోతుల నెహ్రూ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. నియోజకవర్గాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.