పులివెందుల సీఎస్ చర్చి ప్రార్థనలలో వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ తదితరులు
పులివెందుల: దేవుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన ఉన్నాడని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. మంగళవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైఎస్ కుటుంబీకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబం తరపున ప్రజలందరికి క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయన బాటలోనే ప్రస్తుతం జగన్ పయనిస్తున్నారన్నారు. వైఎస్సార్‌పై సెక్రటేరియట్‌లో హత్యాయత్నం జరిగిన సమయంలో, నక్సలైట్లు బాంబు పెట్టిన సమయంలోనూ దేవుడే ఆయనను కాపాడారని ఆమె అన్నారు. నా జీవితంలో 52ఏళ్ల జీవితం ఒక ఎత్తయితే.. వైఎస్సార్ మరణం తర్వాత 9ఏళ్లు మరొక ఎత్తు అన్నారు.
క్రిస్మస్ సందర్భంగా జీసెస్ చారిటీస్‌లో అనాథ పిల్లలతో కేక్ కట్ చేయిస్తున్న షర్మిల, రాజారెడ్డి, అంజలి
ఈ 9ఏళ్లు అనేక కష్టాలతో గడిచిందన్నారు. ఎన్నో కుట్రలు, కేసులు, గొడవలతో ఇబ్బందులు పెట్టినా జగన్‌మోహన్‌రెడ్డి వెనక్కి తగ్గలేదన్నారు. వైఎస్సార్‌లాగే ప్రజలకు సేవ చేయాలన్న తపన వైఎస్ జగన్‌లో కూడా నిండుగా ఉందన్నారు. 14 నెలలుగా పాదయాత్ర చేస్తున్న జగన్‌ను ప్రతి క్షణం దేవుడు తోడుగా ఉండి కాపాడుకుంటున్నారన్నారు. అంతేకాక వైఎస్ కుటుంబం కోసం దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారన్నారని, వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ విజయమ్మతోపాటు దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్సార్ సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, డాక్టర్ ఇసీ గంగిరెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తదితరులు పాస్టర్ బెనహర్ బాబు ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. కాగా స్థానిక జీసెస్ చారిటీస్‌లోని అనాథ ఆశ్రమంలో గల చర్చిలో వైఎస్ జగన్ సోదరి షర్మిలమ్మతోపాటు ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి అనాథ పిల్లలచే కేక్ కట్ చేయించి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment