
వైఎస్ విజయమ్మకు భద్రత పునరుద్ధరణ
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భద్రతను ఏపీ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. వైఎస్ విజయమ్మకు భద్రత కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ సర్కారు ఆమెకు భద్రతను తిరిగి పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయమ్మతో పాటు ఆమె కుమార్తె షర్మిలకు, బ్రదర్ అనిల్ కు కూడా భద్రతను యథావిధిగా కొనసాగించడానికి ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ విజయమ్మకు ఉన్న 2+2 భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, భద్రత ఉపసంహరించే ముందు తమకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వలేదని ఆ పిటిషన్లో విజయమ్మ తెలిపారు. 2004 నుంచి ఉన్న భద్రతను ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తొలగించడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని ఆమె ఆరోపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వానికి ఆదేశించింది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు వారికి భద్రత కొనసాగించాలని కోర్టు తెలిపింది.