రాష్ట్రపతితో భేటీ కానున్న విజయమ్మ
న్యూఢిల్లీ : ఢిల్లీ వేదికగా సమైక్యాంధ్రకు మద్దతు ప్రయత్నాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేసింది. విభజన నిర్ణయంతో రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితులను పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రణబ్ ముఖర్జీతో భేటి కానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి , రెహ్మాన్, శోభానాగిరెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొనున్నారు.
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని జాతీయ పార్టీలు వ్యతిరేకించాలని, విభజన జరగకుండా అడ్డుకోవాలని వైఎస్ విజయమ్మ నేతృత్వంలోని బృందం నిన్న సీపీఎం, డీఎంకే పార్టీల ప్రధాన నేతలను కలిసి కోరింది. కేవలం తెలంగాణలో కొన్ని ఎంపీ సీట్లు దక్కుతాయన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ నిరంకుశంగా విభజన నిర్ణయం చేసిందని పార్టీల నేతల దృష్టికి తెచ్చింది.