రెండోరోజుకు చేరిన విజయమ్మ సమరదీక్ష
ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయడం చేతకాని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలన్న డిమాండుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. గుంటూరు బస్టాండు ఎదురుగా చేపట్టిన ఈ దీక్షకు అపూర్వ స్పందన వస్తోంది. పలువురు సీనియర్ నాయకులు విజయమ్మ దీక్షకు మద్దతుగా ముందుకొస్తున్నారు.
విజయమ్మ దీక్షకు మద్దతుగా ఊరూవాడా సంఘీభావం లభిస్తోంది. పలు ప్రాంతాల్లో ఆమరణ, రిలే నిరాహార దీక్షలు వెల్లువెత్తుతున్నాయి. విజయమ్మ దీక్షకు సంఘీభావంగా నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆమరణ దీక్ష రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి దీక్ష చేపట్టారు. ఆయన దీక్షా సభకు భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహనరెడ్డి కర్నూలులో ఆమరణ దీక్ష ప్రారంభించారు. రాజమండ్రిలో దీక్షా శిబిరాన్ని వైఎస్సార్సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు.
రెండోరోజు సభలో శాసనమండలి మాజీ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు అటు కాంగ్రెస్ పార్టీపైన, ఇటు తెలుగుదేశం పార్టీపైన నిప్పులు చెరిగారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే చాలా సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాత మాత్రమే ఆ అంశాన్ని లేవనెత్తాలని, అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇప్పట్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడం సబబు కాదనే వైఎస్ రాజశేఖరరెడ్డి నిండు సభలో తెలిపారని వైఎస్సార్సీపీ నాయకుడు దాడి వీరభద్రరావు తెలిపారు. అప్పట్లో తామంతా కూడా సభలో ఉన్నట్లు చెప్పారు. ఇందుకోసం రోశయ్య కమిటీని కూడా నియమించారన్నారు. కేంద్రంలో ప్రణబ్ కమిటీని వేస్తే.. ఇక్కడ రోశయ్య కమిటీని వేసినట్లు చెప్పారు.
నిండు శాసనసభలో టీఆర్ఎస్ వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తెలుగుతల్లిని తిట్టడానికి మీకు దమ్ము ఎక్కడుంది, మీకు బుద్ధి చెప్పే రోజులొస్తాయని హెచ్చరించిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డేనని దాడి అన్నారు. ఆయన చెప్పిన మాటలకు వక్రభాష్యం చెప్పి, శాసనసభలో తెలంగాణ కోసం తీర్మానం కూడా చేశారంటూ అవాస్తవాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
ట్యాంక్బండ్ మీద ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటుచేసిన మహనీయుల విగ్రహాలను టీఆర్ఎస్ వాళ్లు కూల్చేస్తే, ఆ విగ్రహాలను చూడ్డానికి కూడా చంద్రబాబు వెళ్లలేకపోయారని, తెలుగువారి ఆత్మగౌరవానికి ఆయనిచ్చే మర్యాద, ఆత్మాభిమానం అదేనని దాడి ఎద్దేవా చేశారు. విగ్రహాలను చూడ్డానికి రమ్మంటే రాను పొమ్మన్నారని, తెలంగాణ వాళ్లు ఏమనుకుంటారోనన్నదే ఆయన భయమని చెప్పారు. ఏనాడూ తెలంగాణ వారి చర్యలను, దాడులను ఖండించలేదని, విభజనకు ఏకపక్షంగా కారకుడైన చంద్రబాబు చర్యలను ఈ రాష్ట్రం హర్షించదని, ఆయన వల్ల మనం చాలా నష్టపోవాల్సి వస్తోందని అన్నారు. హైదరాబాద్లో ఉన్న ఉద్యోగావకాశాలను యువత కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో స్వయంగా ప్లకార్డు పట్టుకుని మరీ తాము సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతున్నట్లు చెప్పి పోరాడిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వీరభద్రరావు తెలిపారు.