పథకం ప్రకారమే వైఎస్‌ను టార్గెట్ చేస్తున్నారు: వైఎస్సార్ సీపీ | YSR being targeted as per plan: YSRCP | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే వైఎస్‌ను టార్గెట్ చేస్తున్నారు: వైఎస్సార్ సీపీ

Published Sun, Aug 11 2013 1:49 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

YSR being targeted as per plan: YSRCP

రాష్ట్రంలో తమ పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేక ఏఐసీసీ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. 1999లో వైఎస్ సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజనకు చొరవ చూపారని దిగ్విజయ్ పేర్కొనటాన్ని ఆయన శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ‘‘తెలంగాణ అంశంపై 2001లో సీడబ్ల్యూసీ రెండో ఎస్సార్సీ వేయాలని తీర్మానం చేసిన విషయాన్ని దిగ్విజయ్ మరిచినట్టున్నారు.. అదే విషయాన్ని వైఎస్ స్వయంగా శాసనసభలో స్పష్టంగా చెప్పారు.. ఆ విషయం మరిచిపోయారా?’’ అని సూటిగా ప్రశ్నించారు.

మరణించిన వైఎస్ ఇక తిరిగిరారని, సమాధానం చెప్పుకోలేరని గడిచిన నాలుగేళ్లుగా ఆయన  ప్రతిష్టను దెబ్బతీయటానికి కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా.. ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేసిన ఘనకీర్తి కాంగ్రెస్ నేతలదని.. అలాంటి నేతలు ఎంతకైనా తెగించి మాట్లాడతారని శ్రీనివాసులు దుయ్యబట్టారు. ‘‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం చేశారని నిరూపించగలరా? కనీసం దానికి సంబంధించిన రికార్డులనైనా చూపగలరా?’’ అని ప్రశ్నించారు. ‘‘2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలు, పొత్తుల గురించి మాట్లాడుతున్నారే.. ఆనాడు టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని వైఎస్ చెప్తే.. తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్పింది మీ అధిష్టానం కాదా?’’ అని నిలదీశారు. పెపైచ్చు ఆ మేనిఫెస్టోల్లో ఏం ఉందన్న విషయం కూడా మర్చిపోయి నిందలు మోపటం ఎంతవరకు సమంజసమన్నారు.

కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకమవటంతోనే

‘‘రాజశేఖరరెడ్డి వారసత్వం వైఎస్సార్ కాంగ్రెస్ దేనని ప్రజలు తేల్చిన కారణంగానే కదా ఈ రోజు కాంగ్రెస్ నాయకత్వం వైఎస్‌ను టార్గెట్ చేసుకుని మాట్లాడుతోంది..? రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తోంటే.. కాంగ్రెస్ భవిష్యత్తు, మనుగడ ప్రశ్నార్థకం కావటంతోనే కదా ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు..?’’ అని కొరుముట్ల దుయ్యబట్టారు. తెలంగాణ వెనుకబాటుతనంపై వైఎస్ అనేక సందర్భాల్లో మాట్లాడారని, తన హయాంలో తెలంగాణను సస్యశ్యామలం చేయాలని వైఎస్ కలలు కన్నారని పేర్కొన్నారు. తెలంగాణ అంశం వచ్చినప్పుడు వస్తుంది.. అప్పటివరకు ఆ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే వైఎస్ సంకల్పమని చెప్పారు.

రోశయ్య కమిటీని వేసిన విషయం మరిచారా..?
‘‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడుతుంటే చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించినప్పుడు తెలంగాణకు చెందిన మీ కాంగ్రెస్ నాయకులు కొందరు వైఎస్‌ను సైమన్‌తో పోల్చి గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తామని చెప్పిన విషయాలను మరిచిపోయారా?’’ అని కొరుముట్ల ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ బాధ్యతలు చేపట్టాక 2009లో ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాల మేరకే నిర్ణయం జరగాలని, ఆ విషయాలను చర్చించటానికి అసెంబ్లీ వేదికగా రోశయ్య నేతృత్వంలో కమిటీ వేసిన విషయం దిగ్విజయ్ మరిచిపోయి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు అందుకు భిన్నంగా ఒక పథకం ప్రకారం వైఎస్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఇష్టానుసార నిర్ణయాల కారణంగా ఈ రోజు రాష్ట్రం అతలాకుతలమైంది. సీమాంధ్రలో ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తుంటే ఏమీ పట్టించుకోకుండా నిద్రపోయిన మీ ముఖ్యమంత్రి తొమ్మిది రోజుల తర్వాత నిద్రలేచి వైఎస్ గురించే మాట్లాడారు తప్ప.. అసలు సమస్యకు కారణమైన కాంగ్రెస్‌ను, ఆ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడలేదంటేనే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అధిష్టానం పథకం ప్రకారమే జరుగుతోందని కాకుండా మరేమనుకోవాలి’’ అని మండిపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement