మండలంలోని తోలుకోడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు గురువారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దళితవాడలో స్థానిక వైఎస్ విగ్రహం వద్ద ఖాళీ స్థలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం
మైలవరం : మండలంలోని తోలుకోడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు గురువారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దళితవాడలో స్థానిక వైఎస్ విగ్రహం వద్ద ఖాళీ స్థలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. గ్రామానికి చెందిన పెండెం భాస్కరరావు స్థలంలో గోగులమూడి సుధాకర్ గతంలో దుకాణం పెట్టుకుంటానని చెప్పడంతో ఆ స్థలాన్ని ఖాళీ చేసి ఇచ్చాడు.
ఏడాదిగా అది మూసి ఉంది. గురువారం ఆ స్థలంలో కంకరవేసి చదును చేస్తున్న నేపథ్యంలో భాస్కరరావు కలుగజేసుకుని తన స్థలాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా సుధాకర్‌ను కోరాడు. ఇందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఘర్షణ జరిగింది. సుధాకర్ తరఫున టీడీపీకి చెందిన కార్యకర్తలు భాస్కరరావుపై దాడి చేసి గాయపర్చారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న బాధితుడి కుమారుడు ఏం జరిగిందోనని సంఘటన స్థలానికి చేరుకోవడంతో అతడిపై, అడొచ్చిన కాలనీ వాసులపై కూడా దాడి చేశారు.
అంతటితో ఆగకుండా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలైన పెండెం ప్రేమ్‌కుమార్, పెండెం భాస్కరరావు, పెండెం శరత్, బుర్రె రాంబాబు, పెండెం యాకోబు, రామల నాగరాజులను తీవ్రంగా గాయపర్చారు. వారిని మెలవరం ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో ఒక మహిళ కూడా గాయపడింది. టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిం చారని గ్రామానికి చెందిన పెండెం కనకరత్నం ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయం లో మాజీ సర్పంచి, ప్రస్తుత వైస్ ఎంపీపీ శోభన్‌బాబు కూడా ఉన్నారని, దాడిని అడ్డుకోవాల్సిందిగా కోరానని అయితే ఆయన తనను పక్కకు నెట్టివేశారని ఆరోపించింది.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ వైఎస్సార్‌సీపీ గ్రామనేత బుర్రె ప్రతాప్ తెలిపారు. స్టేషన్‌లో తాము ఫిర్యాదు చేసినా తీసుకోవడం లేదని అదే టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నారని బాధితులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వెంకన్నబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణరెడ్డి, పార్టీ ప్రచార కార్యదర్శి జి.వి.ప్రసాద్ పరామర్శించారు.