వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం
కడప అగ్రికల్చర్/కమలాపురం :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమలాపురం మండలం జీవంపేటకు చెందిన నేత పుత్తా దస్తగిరిరెడ్డిపై శుక్రవారం కొందరు వ్యక్తులు మారణాయుధాలతో హత్యాయత్నం చేశారు. అతని కాళ్లు, చేతులు విరిచేశారని బంధువులు తెలిపారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంటుగా కూర్చోవడంతో అతనిపై కసి పెంచుకున్నట్లు బంధువులు తెలిపారు.
దాడి జరిగింది ఇలా..
కమలాపురం వచ్చిన పుత్తా దస్తగిరిరెడ్డి తన పని ముగించుకుని మధ్యాహ్నం బైక్‌లో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో కొందరు వ్యక్తులు అతని బైక్‌ను అడ్డగించారు. మారణాయుధాలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఘటనలో దస్తగిరిరెడ్డి కాళ్లు, చేతులు విరిచేశారు. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చనిపోయాడనుకున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఐదుగురిపై కేసు నమోదు
పుత్తా దస్తగిరిరెడ్డిపై జరిగిన హత్యాయత్నం సంఘటనలో టీడీపీకి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేశామని కమలాపురం ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన బాధితుడిని మెరుగైన వైద్య కోసం కడప రిమ్స్‌కు తరలించామన్నారు.
దాడి గర్హనీయం
విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి జమ్మలమడుగు, కమలాపురం ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, రవీంద్రనాథరెడ్డి జరిగిన సంఘటన గురించి బాధితుడి బంధువులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనను వారు ఖండించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇటువంటి సంఘటనలకు పాల్పడటంతో జిల్లాలో శాంతి భద్రతల సమస్య ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.
నేతల పరామర్శ
కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న దస్తగిరిరెడ్డిని వైఎస్సార్ సీపీ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, సుబ్బారెడ్డి, రైతు సంఘం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి, తురకపల్లె రాజశేఖరరెడ్డి, కొండారెడ్డి, ఎమ్మెల్యే ఆది సోదరులు శివనాథరెడ్డి, జయరామిరెడ్డి, వివిధ మండలాల నాయకులు పరామర్శించారు. దాడిని ఖండించారు.
టీడీపీ నాయకులపైనే అనుమానం
పుత్తా దస్తగిరిరెడ్డిపై హత్యాయత్నం ఘటనలో టీడీపీ నాయకులపైనే బంధువులు అనుమానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఏజెంటుగా కూర్చున్నప్పటి నుంచి పుత్తాపై వారు కసితో ఉన్నట్లు తెలిపారు. అదను కోసం వేచి ఉండి,ఇప్పుడు ఈ సంఘటనకు పాల్పడి ఉండొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. అధికారం అండ చూసుకునే వారు ఇలాంటి సంఘటనకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.