
రోడ్డుపై బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ నేతలు
గుంటూరు: టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేసిన నలుగురు ఎంపీటీసీ సభ్యులను విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ముప్పాళ్ల ఎపీపీ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో మేడికొండూరు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వాహనాలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. నలుగురు మహిళా ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు.
దీంతో సంఘటనా స్థలంలో రోడ్డుపై వైఎస్ఆర్ సీపీ నాయకులు బైఠాయించారు. టీడీపీ దమనకాండకు నిరసనగా అంబటి రాంబాబు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ముస్తాఫా ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా వందలాదిమంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తల దౌర్జన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.