తుదికంటా పోరాడతాం..
ప్రాణాలు పోయినా సరే బిల్లును అడ్డుకుంటాం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రవేశపెట్టింది విభజన బిల్లు కాదని, అది రాష్ట్రానికి మరణశాసనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. ప్రాణాలు పోయినా సరే ఆ బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బిల్లును పార్లమెంట్‌కు పంపించేస్తే బరువు దిగిపోతుందనే వైఖరితో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారని, పూటకో సిద్ధాంతం మారుస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు సమైక్యాంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. వారిద్దరినీ నమ్ముకోకుండా రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు కలసిరావాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలకు వారు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గొల్ల బాబురావు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బుధవారం అసెంబ్లీ మీడియాపాయింట్‌లో మాట్లాడారు. ఏ రాష్ట్రంలోనూ తీర్మానం లేకుండా విభజన జరగలేద ని, కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత సహకారం వల్ల విభజన ప్రక్రియ వేగంగా సాగుతోందని మండిపడ్డారు. మొదటి నుంచి తాము సమైక్య తీర్మానాన్ని కోరుతున్నా సీఎం తమ విన తిని పెడచెవిన పెట్టారని ఆరోపించారు.
‘మంగళవారం జరిగిన బీఏసీ భేటీకి సీఎం రావడం వల్ల నష్టం జరిగింది. టీఆర్‌ఎస్, తెలంగాణ మంత్రులు బిల్లుపై చర్చ ప్రారంభమైందన్నారు. బీఏసీ భేటీ తర్వాతే చర్చ ఉంటుందని స్పీకర్ చెప్పినపుడు మొన్ననే చర్చ ఎలా ప్రారంభమవుతుందని మేం ప్రశ్నించాం. అపుడు సీఎం మౌనం వహించారు. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ సభ్యులకు, వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులమైన మాకు మధ్య ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అపుడు సీఎం జోక్యం చేసుకొని ‘దానికి, దీనికి పెద్ద తేడా ఏం లేదు’ అని అన్నారు. సీఎం మాటలతో మాకు ఆశ్చర్యం వేసింది. బీఏసీ భేటీకి చంద్రబాబు హాజరు అయితే మాకు తోడుగా ఆయన గొంతు వినిపించేవారు. కానీ రెండు ప్రాంతాల నుంచి ఇద్దరిని పంపి వారి వాదనలు వినిపించుకోమన్నారు. సమైక్యాంధ్ర కోరే వారిలో ఉన్న ఈ అనైక్యతను ఆధారం చేసుకొని సీఎం చర్చకు ఓకే అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలం బీఏసీ నుంచి వాకౌట్ చేశాం’ అని తెలిపారు.
‘ బడ్జెట్‌పై చర్చకు 4 రోజుల సమయమిస్తున్న సర్కారు 8 కోట్ల ప్రజల భవిష్యత్తును తేల్చే బిల్లుపై సమయం ఇవ్వలేదా? సీఎం, స్పీకర్, మంత్రులపై సోనియాగాంధీ ఒత్తిడి చేస్తున్నారు. బిల్లుపై ఓటింగ్ జరుగుతుందో లేదో సీఎం ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? సందర్భాన్ని బట్టి మాటమారుస్తూ సీఎం మోసం చేస్తున్నారు. సీఎం నిజస్వరూపాన్ని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా గ్రహించి సమైక్యాంధ్ర పోరాటంలో కలసిరావాలి. చివరి వరకు క్రీజ్‌లో ఉంటానని చెప్పానే తప్ప చివరి బాల్ వరకు ఆడతానని అనలేదన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం ముక ్కలు చేసేందుకు లేఖ ఇవ్వడమే కాదు. రెండు కళ్లు, కొబ్బరి చిప్పల సిద్ధాంతం చెప్తున్న చంద్రబాబు నైజాన్ని ఆ పార్టీ సీమాంధ్ర నేతలు గ్రహించాలి. కిరణ్, చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారు’అని మండిపడ్డారు.