‘రేవంత్’ ఎపిసోడ్ తరువాత
కూడా నిజాయితీ గురించి మాటలా?
వైఎస్సార్‌సీపీ నేత
జ్యోతుల నెహ్రూ విమర్శ
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై జగన్ సమరదీక్ష
విజయవంతం చేయాలని పిలుపు
రాజమండ్రి : విజయవాడ నవనిర్మాణ దీక్షలో అవినీతి లేని ఆరోగ్యకరమైన రాష్ట్రాన్ని నిర్మిద్దామంటూ ప్రజలచేత ముఖ్యమంత్రి ప్రమాణం చేయించడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి వ్యవహారం వెలుగు చూసిన తరువాత కూడా బాబు నిజాయితీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. అవినీతి గురించి చంద్రబాబు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ‘ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉండి, అభివృద్ధి చేయాల్సింది పోయి, నవనిర్మాణ దీక్షలు చేయడం విడ్డూరంగా ఉంది’ అని అన్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ దాడిలో పట్టుబడిన సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. విజయవాడలో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తూ చంద్రబాబు నవనిర్మాణ దీక్షకు దిగారన్నారు. అధికారంలో ఉన్నవారు దీక్షలు చేయరని, వారికి కనువిప్పు కలిగించేందుకు ప్రతిపక్షాలు మాత్రమే దీక్షలు చేస్తాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదంటూ ఏకపక్షంగా పాలిస్తున్న చంద్రబాబు అభివృద్ధి చేయాలనుకుంటే అడ్డుకునేవారు ఎవరూ లేరని, అభివృద్ధి ముసుగులో పట్టిసీమ ఎత్తిపోతల పథకం, రాజధానిని ప్రైవేట్‌పరం చేస్తే మాత్రం పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో చంద్రబాబు నెరవేర్చలేదని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరిలో బుధ, గురువారాల్లో సమరదీక్ష చేస్తున్నారని జ్యోతుల వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ దీక్షకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కనువిప్పు కలిగిస్తారన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, నక్కా రాజబాబు, సంయుక్త కార్యదర్శి దంగేటి రాంబాబు, పార్టీ కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరిజాల వెంకట స్వామినాయుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు బొంత శ్రీహరి, మజ్జి నూకరత్నం, నాయకులు కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, లంకా సత్యనారాయణ, మోటూరి సాయి, భద్రి బాబ్జీ పాల్గొన్నారు.
చంద్రబాబు తీరు విడ్డూరం
Published Wed, Jun 3 2015 12:46 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement