తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం బంగారు పతకాలను అందించారు. వైఎస్సార్ ప్రతిభా పురస్కారాల పేరిట పాకాల మండలం దామలచెరువు ప్రభుత్వ హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిత్య విద్యార్థి అని కొనియాడారు. నియోజకవర్గంలోని ప్రతిభా వంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వైఎస్సార్ పేరిట ప్రతిభా పురస్కారాలను అందించాలనే భగీరథ యత్నానికి తమ్ముడు చెవిరెడ్డి సంకల్పించారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహం అందించేందుకే వైఎస్‌ఆర్ ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులు గర్వించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 49 హైస్కూళ్లలో గత ఏడాది ఉత్తమ మార్కులు సాధించిన 14 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 267 మందికి వెండి పతకాలు, ప్రశంసాపత్రాలను అందిస్తున్నట్టు తెలిపారు. గురువులను సత్కరించాలనే సంకల్పంతో 500 మంది విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో విద్యాశాఖాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ ప్రతిభా పురస్కారాల ప్రదానం
Published Wed, Feb 25 2015 3:26 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement