సాక్షి, తిరుపతి: అటు నిరుద్యోగులకు ఉపాధి, ఇటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిందే వాలంటీర్ల వ్యవస్థ అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన గ్రామ వాలంటీర్ల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే క్షేత్ర స్థాయిలో పని విభజన జరగాలి. అందుకే 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించి రాజధాని నుంచి సూచించే ప్రభుత్వ పథకాలు మరో గంటలోపు అమలు చేయగలిగే వ్యవస్థ రూపుదిద్దుకొనున్నదని వివరించారు. వాలంటీర్లు తమకొచ్చే రూ.5వేల గురించి కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గుర్తించాలన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించారనే భయం, బాధ్యతతో చంద్రగిరిలో నీటి సమస్య తీర్చడం కోసం 250 బోర్లకు ఒకేసారి అనుమతులు మంజూరు చేశానని వెల్లడించారు.
నగర కమిసనర్ మాట్లాడుతూ మీ పరిధిలోని 50 గృహాలకు మీరే మండలాధిపతులుగా ఉంటారనీ, నిస్వార్ధంగా సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాక్షించారు. తుడా సెక్రటరీ రాం సుందర్ రెడ్డి అభిప్రాయంలో సామాన్యులు తమ అవసరాలకు ఎవరిని కలవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారనీ, మీతో ఆ ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాలంటీర్లకు నియామక పత్రాలతో పాటు ఉద్యోగ ప్రదాత సీఎం ఫోటోలను స్వయంగా అందించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment