వైసీపీ ఎన్నికల శంఖారావం | ysr congress party Elections sankharavam in Eluru | Sakshi
Sakshi News home page

వైసీపీ ఎన్నికల శంఖారావం

Published Fri, Feb 28 2014 2:35 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

వైసీపీ ఎన్నికల శంఖారావం - Sakshi

వైసీపీ ఎన్నికల శంఖారావం

 ఏలూరు (ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 3న ఏలూరులో నిర్వహించనున్న ఎన్నికల శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశేషంగా కృషి చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఏలూరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏలూరులో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమవుతుందని, గతంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే భయంతోనే కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై కుట్రలు పన్ని జైలులో పెట్టించారన్నారు. వీటికి భయపడని జగన్ దమ్మున్న నాయకునిగా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయటానికి కాంగ్రెస్, టీడీపీలు పన్నిన కుట్రలను సమర్థంగా ఎదుర్కొని అనేక ఆందోళనలు చేశారని వివరించారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని బాలరాజు స్పష్టం చేశారు.
 
 వైఎస్ ఆశయ సాధనే పార్టీ లక్ష్యం : తోట చంద్రశేఖర్
 పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవ ర్గ ఇన్‌చార్జి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించబోయే ఎన్నికల శంఖారావం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే కాదని మరో నాలుగైదు వారాల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశమున్నందున వాటికి కూడా వర్తిస్తుందన్నారు. రాబోయే అన్ని స్థాయిల ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని ఆధికాన్ని ఇచ్చి ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అత్యధిక లోక్‌సభ స్థానాలు కట్టబెట్టి కేంద్రాన్ని శాసించే స్థాయికి సీమాంధ్ర ప్రజలు చేరుకోవాలన్నారు. ఏలూరులో నిర్వహించనున్న ఎన్నికల శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా సీమాంధ్ర అంతటా సానుకూల సంకేతాలు పంపాల్సిన గురుతర బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ఇతర పార్టీల్లా డబ్బులిచ్చి ప్రజలను సభలకు తెచ్చుకోవాల్సిన దుస్థితి వైసీపీకి లేదన్నారు. ప్రజలకు పార్టీపై ఉన్న అభిమానాన్ని నిలబెడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళితే చాలన్నారు. 
 
 వైఎస్ కుటుంబానికి అండగా ఉండండి : ఆళ్ల నాని
 వైఎస్ కుటుంబానికి రాష్ట్ర ప్రజలు రెండు నెలలపాటు అండగా ఉంటే అక్కడి నుండి రాష్ర్ట ప్రజలకు వారు అండగా ఉంటారని ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని అన్నారు. ఈ  రాష్ట్రాన్ని పాలించటానికి వైఎస్ జగన్‌మోహనరెడ్డే  అర్హుడని ప్రజలంతా విశ్వసిస్తున్నారని చెప్పారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను పణంగాపెట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేసిన సోనియా నియంతలా వ్యవహరించటాన్ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభంజనాన్ని చూసి వైఎస్సార్ కుటుంబంపై బురదజల్లడానికి కాంగ్రెస్, టీడీపీ, కిరణ్ కుమార్‌రెడ్డి చేయని ప్రయత్నంలేదని పేర్కొన్నారు. వైసీపీని అడ్డుకోకపోతే పాతికేళ్ళపాటు తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతో వైఎస్ జగన్‌ను ఎన్ని విధాలుగా కష్టపెట్టాలో అన్ని విధాలా కష్ట పెట్టారని చెప్పారు. వాటన్నిటినీ తట్టుకుని ప్రజల కోసం ఉద్యమాలను వీడకపోవడం ఆయన విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్తలు అశోక్‌గౌడ్, రామచంద్రరావు, పీవీ రావు, కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, జిల్లా అధికార ప్రతినిధులు బొద్దాని శ్రీనివాస్, వగ్వాల అచ్యుతరామారావు, ఏలూరు నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ మంచెం మైబాబు, పార్టీ వివిధ విభాగాల నగర కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 విశ్వసనీయతకు మారుపేరు వైసీపీ
 ఏలూరు(ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్ : రాజకీయాల్లో ఏ పార్టీ సంపాదించుకోలేని విశ్వసనీయతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే పొందిందని పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. గురువారం  వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఆ నాయకులు మాట్లాడుతూ సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయతత్వాన్ని లేవదీసి రాజకీయ ప్రయోజనాలకోసం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఆయా పార్టీల పేరు చెబితే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకోసం చేసిన ఒంటరి పోరాటం తమను విశేషంగా ఆకర్షించిందన్నారు. ఇటువంటి నాయకుని నాయకత్వంలో సామాన్య కార్యకర్తగా పనిచేసినా తమకు తగిన గుర్తింపు వస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే పార్టీకీ స్థానం లేదని ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో సీమాంధ్ర పునర్నిర్మాణంలో తమ వంతు ఉడతా భక్తి సహకరించడానికే వైసీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు.  నగరంలోని ఐదో డివిజన్ మాజీ కార్పొరేటర్ చింతా దుర్గారెడ్డి నాయకత్వంలో సుమారు 200 మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు, 36వ డివిజన్‌కు చెందిన దొంతంశెట్టి బదరీనారాయణ, పుచ్చల అప్పారావు నాయకత్వంలో సుమారు 100 మంది కార్యకర్తలు, వెంకటాపురం పంచాయతీకి చెందిన 11వ వార్డు సభ్యుడు జీలపాటి పరశురామ్, దేవినేని సుబ్బయచౌదరి నాయకత్వంలో సుమారు 100 మంది వైసీపీలో చేరారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement