నిర్మాణాత్మక దిశగా...
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రజల పక్షాన నిల బడి.. వారి సమస్యలపై విస్తృత పోరాటాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింత నిర్మాణాత్మకమైన సేవలందించేందుకు సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పూర్తిస్థాయిలో విశ్లేషించుకుని.. భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు నియోజకవర్గాల వారీ సమీక్షలను నిర్వహించనుంది. ఇందుకోసం పార్టీ నియమించిన త్రిస భ్య కమిటీ ఆదివారం ఏలూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసింది. అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి నేతృత్వంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలతో కూడిన త్రిసభ్య కమిటీ ఈ కార్యక్రమానికి హాజరు కానుంది.
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలోని 15 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు, మునిసిపల్, జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన వారు హాజరుకానున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన పరిస్థితులు, ఏయే అంశాలు ప్రభావితం చేశాయన్న దానిపై చర్చించనున్నారు. నియోజకవర్గాల వారీగా క్రోడీ కరించిన అంశాలపై ఈనెల 4, 5 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహించే ప్రాంతీయ సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి త్రిసభ్య కమిటీ నివేదికలను సమర్పించనుంది. నివేదికల ఆధారంగా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్ధేశం చేస్తారు. ఏలూరులో నిర్వహించే సమావేశానికి పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ముఖ్య నేతలు హాజరవుతారు.
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గ్రామస్థారుు నుంచి మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానం దృష్టి సారించింది. రానున్న కాలం లో ప్రజలపక్షాన నిలబడి పోరాటాలు చేసే దిశగా కార్యకర్తలు, నాయకులను కార్యోన్ముఖులను చేసేలా, వారిమధ్య సమన్వయం పెంచేలా చర్యలు చేపడుతోంది.