
ఉద్యమపథం దిశగా...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రుణ మాఫీ హామీ ఉత్తుత్తి మాఫీగానే మిగిలిపోతోంది... డ్వాక్రా రుణాల మాఫీ అటకెక్కింది... హుద్‌హుద్ తుపాను బాధితుల వేదన అరణ్య రోదనే అయ్యింది. వెరసి ప్రభుత్వ మోసపూరిత విధానాలపై అన్నివర్గాల ప్రజలు మండిపడుతున్నారు. అందుకే ప్రజల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖం పూరిస్తోంది.
ఎన్నికల హామీల అమలులో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద భారీ ధర్నాలు చేయాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ఈ భారీ ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో డిసెంబర్ 5న ధర్నాను విజయవంతం చేయడం ద్వారా ప్రజాగ్రహాన్ని బలంగా వినిపించడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.
సమన్వయంతో సన్నద్ధత
డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చేయడానికి జిల్లా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో పార్టీ అధినేత వై.ఎస్.జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ధర్నా నిర్వహణ గురించి కూడా ప్రధానంగా చర్చించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలు జిల్లాలో నేతలు, కార్యకర్తలతో సమావేశమై ధర్నా ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాలో రైతులు, డ్వాక్రా మహిళలు, తుపాను బాధితులు తదితరులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న అంశాన్ని నేతలు ప్రస్తావించారు. అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకుని ధర్నాను విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు.
నియోజకవర్గాలవారీగా సన్నద్ధత
డిసెంబర్ 5న ధర్నాపై రాష్ట్ర పార్టీ కూడా ప్రత్యేక దృష్టిసారించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి( కార్యక్రమాల కో ఆర్డినేటర్) తలశిల రఘురాం బుధ, గురువారాలు జిల్లాలో పర్యటించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలతో చర్చించారు. జీవీఎంసీ, రూరల్ జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు ధర్నాలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.
అందుకోసం నియోజకవర్గాల్లో గ్రామాలు, డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా మహాధర్నాకు ప్రజలను సంసిద్ధులను చేయడానికి పార్టీశ్రేణులు రంగంలోకి దిగాయి. రూరల్ జిల్లాలో నియోజకవర్గాలవారీగా సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభించారు. జీవీఎంసీ పరిధిలో డివిజన్లవారీగా కార్యకర్తల సమావేశాలు గురువారం నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతుండటంతో పార్టీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.