విభజన నరకాసురుల వధ
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని వినూత్న రీతిలో కొనసాగిస్తోంది. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కొందరు కుట్రపన్నుతున్నారని, వారిని రాజకీయంగా వధించాలని కోరుతూ తిరుపతి సమీపంలో తుమ్మలగుంట కూడలిలో వారి చిత్రపటాలతో దిష్టిబొమ్మను తయారుచేశారు. వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలతో తయారుచేసిన ఈ సెట్టింగ్‌ను పేల్చివేసి ’విభజన నరకాసురుల వధ’ నిర్వహించారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని కోరుతూ విశాఖ జిల్లా పాత గాజువాక కూడలిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు హోమం నిర్వహించారు. పార్టీ నేత కొణతాల రామకృష్ణ హోమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ సమన్వయకర్త గేదెల తిరుపతి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బైక్‌ర్యాలీ తీశారు.అదే విధంగా సీమాంధ్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు గురువారం కూడా కొనసాగాయి.
ఎంపీ బాపిరాజుకు సమైక్య సెగ: టీటీడీ చైర్మన్, ఎంపీ కనుమూరి బాపిరాజుకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమైక్య సెగ తగిలింది. వైసీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో అడ్డుకున్నారు.ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఆయన కాళ్లుపట్టుకొని సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. బాపిరాజు మాట్లాడుతూ త్వరలో జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయపార్టీలు సమైక్యాంధ్రకు మద్దతు తెలిపితే విభజన ఆగిపోతుందని చెప్పారు.
కొనసాగుతున్న సమైక్యపోరు
రాష్ర్ట విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమం గురువారం 93వ రోజుకు చేరింది. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్‌లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా బయట సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో విభజనను నిరసిస్తూ నినాదాలు చేశారు.
ముమ్మిడివరంలో ఉద్యమం ప్రారంభమై 80 రోజులు పూర్తయిన సందర్భంగా 216 జాతీయ రహదారిపై 80 ఆకారంలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏపీ ఎన్‌జీఓ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద ఎన్జీవోలు భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో సమైక్యాంధ్రకు మద్ధతుగా ఆర్టీసీ ఎన్‌ఎంయూ సభ్యులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి.